గలగల పారుతున్న గోదారిలా...!
అందమైన అమ్మా యిని చూడగానే ఏ అబ్బాయి మనసైనా గాల్లో తేలినట్టు.. గుండె పేలినట్టు అయిపోవాలి. అచ్చంగా ‘జల్సా’లో ఇలియానాను చూసి, ‘గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే..’ అని పవన్ కల్యాణ్ పాడినట్టన్న మాట. యస్.. ఇలియానాను చూస్తే.. ఏ అబ్బాయి అయినా అలానే అయిపోతాడు. జర జర పాకే విషంలా ఫాస్ట్‌గా ఇలియానాపై ప్రేమ మొదలైపోతుంది. అందానికి చిరునామా అనలేం కానీ, సమ్‌థింగ్ వెరైటీ ఫిజిక్‌తో ఆకట్టుకుంటారు ఇలియానా.
‘దేవదాసు’ ద్వారా ఇలియానా పరిచయమైనప్పుడు ‘మరీ సన్నగా ఉంది’ అనే కామెంట్స్ వినిపించాయి. తర్వాత తర్వాత ‘అలా ఉన్నా బాగానే ఉంది’ అనిపించుకో గలిగారు ఇలియానా. మొదటి సినిమాయే సూపర్ హిట్ కావడం, ఆ వెంటనే మహేశ్‌బాబు వంటి స్టార్ హీరోతో ‘పోకిరి’ చేసే అవకాశం రావడం, ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇలియానాకు తిరుగులేకుండా పోయింది. ఇలియానా అంటే గ్లామర్‌కి కేరాఫ్ అడ్రస్.. అలాంటి పాత్రలే చేయగలుగుతారని ఫిక్స్ అవుతున్న తరుణంలో ‘రాఖీ’తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్నారు ఈ గోవా బ్యూటీ.
వెనక్కి తిరిగి చూసుకునేంత తీరిక లేకుండా దాదాపు ఏడేళ్లు ఫుల్ బిజీగా సినిమాలు చేశారామె. సడన్‌గా డౌన్‌ఫాల్ మొదలైంది. తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న ఇలియానాకు విచిత్రంగా ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. కానీ, ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. ఆ మలుపే బాలీవుడ్. ‘బర్ఫి’ చిత్రం ద్వారా ఇలియానా హిందీ తెరకు పరిచయం అయ్యారు. తెలుగులో చేసిన మొదటి సినిమా ‘దేవదాసు’ ఎంతటి గుర్తింపు తెచ్చిందో.. హిందీలో చేసిన మొదటి సినిమా ‘బర్ఫి’ కూడా అంతే గుర్తింపు తెచ్చింది. దాంతో బాలీవుడ్ దర్శక- నిర్మాతల దృష్టి ఇలియానాపై పడింది. ‘ఫటా పోస్టర్... నిఖ్లా హీరో’, ‘మై తేరా హీరో’, ‘హ్యాపీ ఎండింగ్’... ఇలా వరుసగా హిందీ చిత్రాలు చేశారు.
సో.. తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ హిందీలో ఇలియానా అవకాశాలు దక్కించుకో గలిగారు. అయితే ఈ మధ్య హిందీలో కూడా గ్యాప్ వచ్చింది. దానికి కారణం ఇలియానానే. ఏ పాత్ర పడితే అది చేయకూడదని ఫిక్స్ అయిపోయా రట. అందుకే కొంత విరామం తీసుకున్నారు. ఇటీవలే ‘రుస్తుమ్’ అనే చిత్రం అంగీకరించారు. ఇందులో ఈ బక్కపలచని భామది బరువైన పాత్ర అట. అందుకే గ్రీన్ సిగ్న్ ఇచ్చేశారు. ఇలియానా కథా నాయిక అయ్యి పదేళ్లయ్యింది. స్టిల్ నాట్ అవుట్. ‘పోకిరి’ సినిమాలో ‘గల గల పారు తున్న గోదారిలా..’ ఇలియానా కెరీర్ కొనసాగుతోంది.