‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు.. నేనే’, ‘అన్నయా.. ఈ తొక్కలో మీటింగులేంటో నాకర్థం కావట్లేదు. పదిమంది ఉన్నారు.. అందర్ని లేపేస్తే ఇంటికెళ్లిపోవచ్చు’, ఎప్పుడు వచ్చావని కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా?, ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ ఈ డైలాగ్స్‌కి ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్‌కి కలెక్షన్ల టేస్ట్ చూపించిన సినిమా ‘పోకిరి’. ఈ సూపర్ హిట్ మూవీ విడుదలై నేటికి (ఏప్రిల్ 28) 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘పోకిరి’గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. తొలుత ఈ సినిమాకు మహేశ్‌ని అనుకోలేదట పూరి. మాస్ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్దం చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను చేయలేకపోయాడట. అలాగే ఈ సినిమాకు ‘పోకిరి’అనే టైటిల్ కూడా చివర్లో పెట్టారట. మొదట్లో ఈ కథకి ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య’అని టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడట పూరి. కానీ రవితేజ తప్పుకోవడంతో.. టైటిల్‌తో పాటు కథలో మార్పులు కూడా చేశారట.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఇలియానాను కూడా చివరి నిమిషంలో తీసుకున్నారు. తొలుత ఈ చిత్రానికి హీరోయిన్‌గా అయేషా టాకియాను సంప్రదించారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పులేదు. ఆ తర్వాత కంగనా రనౌత్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. షూటింగ్‌కి రెడీ అవుతున్న సమయంలో కంగనా కూడా హ్యాండించింది. తనకు బాలీవుడ్‌లో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదించి ఒప్పించారు. ఈ సినిమాతో ఇలియానా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఇక పోకిరి కంటే ముందు మహేశ్ అన్ని సినిమాల్లోనూ ఒకేలా కనిపించేవాడు. క్లీన్ షేవ్‌తో క్లాస్‌గా కనిపించేవాడు. కానీ తొలిసారి ఈ సినిమాలో ఊరమాస్ గెటప్ దర్శనం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. క్లాస్‌గా కనిపించే మహేశ్‌లోని ఊరమాస్ యాంగిల్‌ని ప్రేక్షలకు చూపించాడు పూరి. కథ చెప్పినప్పుడే జుత్తు బాగా పెంచాలని చెప్పాడట. పూరి చెప్పినట్లుగానే ‘అతడు’ తర్వాత మహేశ్ నాలుగు నెలల విరామ తీసుకొని మరీ గెటప్‌ని చేంచ్ చేసుకున్నాడు. సరికొత్త లుక్‌లో కనిపించడానికి చాలానే కష్టపడ్డాడు. ఈ కష్టమంతా తెరపై కనిపించింది. ఈ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది.
Comments
Please login to add a commentAdd a comment