ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. గతంలో ‘రీళ్లు’లో థియేటర్లకు వచ్చి సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు 4 k టెక్నాలజీతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈతరం సినీ ప్రియులను అలా నాటి తరంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఈ ట్రెండ్‌ను సెట్ చేసింది టాలీవుడ్ మాత్రమేనని చెప్పవచ్చు.
భారీగా ఆదాయం
ఒక సినిమాను రీరిలీజ్ చేయడం మంచి లాభదాయకంగా ఉంటుందని సూపర్ స్టార్ కృష్ణ సోదరడు ఆదిశేషగిరిరావు ఒకప్పడు అన్నారు. ఒక సినిమా రిజల్యూషన్‌ను 4కేలో మార్చడానికి దాదాపు రూ.10లక్షల ఖర్చు అవుతుందని పలువురు సినీ ట్రేడర్స్ పేర్కొన్నారు. ఒరిజినల్ ప్రింట్‌ను తక్కువ ధరకే పొందగలిగితే. రీరిలీజ్ పక్కాగా మంచి లభాదయకమైన బిజినెస్ అని వారు తెలిపారు.
'పోకిరి'తో నాంది
టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్‌కు 'పోకిరి' సినిమానే నాంది పలికందని చెప్పాలి. 2006లో మహేశ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా 'పోకిరి' నిలిచింది. ఈ చిత్రాన్ని మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా 2022లో ఆగస్టు 9న అమెరికాలో మళ్లీ విడుదల చేశారు. ఒక్క రోజులో 320 ‘షో’ల్లో ప్రదర్శితమైన ‘పోకిరి’ సుమారు రూ.1.75 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఇండియాలో కూడా విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బును ఆయన అభిమానులు ఛారిటీలకు ఇచ్చారు. గుండెకు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు జరిపించేలా ప్లాన్ చేశారు.
ఒకే నెలలోనే ప్రభాస్ సినిమాలు
రీరిలీజ్ అయిన సినిమాల్లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యాయి. ఆయన నటించిన రెబెల్, బిల్లా, వర్షం రీ రిలీజ్‌లో భారీగా సందడి చేశాయి. రెబల్ మొదటిసారిగా విడుదలైనప్పుడు ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది. కానీ రీ రిలీజ్ సమయంలో మంచి వసూళ్లు సాధించింది. అలాగే బిల్లా, వర్షం సినిమాలకు కూడా భారీగానే కలెక్షన్లు వచ్చాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అందువల్ల ఆయన సినిమాలకు డిమాండ్ కూడా అదే రేంజ్‌లో ఉంది.
ఎవరైనా రీ రిలీజ్ చేయవచ్చా
ఈ విధానంలో కాపీ రైట్ సమస్య ఉంటుంది. కాబట్టి ఏదైనా సినిమాను రీ రిలీజ్ చేయాలంటే ఆ సినిమాకు చెందిన నిర్మాతల అంగీకారంతో కూడిన పత్రాన్ని ల్యాబ్స్‌కు అందిస్తే.. ఆయా సినిమాలను రీ మాస్టరింగ్ చేస్తాయి. ఈ మార్కెట్‌పై అవగాహనతో పాటు ఆసక్తి ఉంటే ఎవరైనా ఒక సినిమాను రీ రిలీజ్ చేయవచ్చు. ఇప్పటికే మా హీరోది ఫలానా సినిమా రీ రిలీజ్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది అభిమానులు అభ్యర్థిస్తున్నారు. గతంలో బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకున్న ఇంకా ఏయే సినిమాలు భవిష్యత్తులో సందడి చేస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
సింహాద్రితో మరో ట్రెండ్
ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటి సింహాద్రి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ ఆయన ఫ్యాన్స్ కొత్త ట్రెండ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు సింహాద్రి రీ-రిలీజ్ సినిమాకు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్‌గా జరిపారు. అలా ఏ మాత్రం కొత్త సినిమాలకు తగ్గకుండా తమ అభిమాన హీరో పాత చిత్రాలను ఆదరిస్తున్నారు.
ఇలాంటి సమయంలో నష్టమే
చిత్ర పరిశ్రమలో ప్రతి శుక్రవారం సినిమా జాతకాలు మారిపోతుంటాయి. వారం వారం ఎన్నో చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే చిన్న సినిమాలు విడుదలైన సమయంలో రీ రిలీజ్ చిత్రాలను విడుదల చేస్తే వారు భారీగా నష్టపోతున్నారు. అప్పుడు కొత్త సినిమాలకు టికెట్లు తెగడం లేదు.
ఒక్క సినిమాకు ఎంత సమయం?
గతంలో సినిమాలను 'రీళ్ల' ద్వారా మాత్రమే చిత్రీకరించేవారు. వాటిని ప్రస్తుత టెక్నాలజీ ఉన్న థియేటర్లలో ప్రదర్శించటం వీలు కాదు. కాబట్టి ఆ రీళ్లను ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టు మార్చాలి. ప్రతి ఫ్రేమ్‌ను స్కాన్ చేసి 4k విజువల్స్‌లోకి తీసుకొస్తేనే రీ రిలీజ్‌కు అవకాశం ఉంటుంది. ఇది కొంత మేరకు సమయం పడొచ్చు. అందుకు గాను సుమారుగా 3 నెలల వరకు ఉంటుంది. ఇందులో స్కానింగ్, గ్రేడింగ్, రీస్టోరేషన్ అనే మూడు పద్ధతులను అనుసరించి 4k విజువల్స్‌లోకి మారుస్తారు.
ఆశ్చర్యపోయిన హీరో సూర్య
15 ఏళ్ల క్రితం విడుదలైన సినిమాను రీ రిలీజ్ చేస్తే అసలు కలెక్షన్స్ వస్తాయా అనుకున్నారు. అందులో సూర్య తమిళ హీరో కాబట్టి పెద్దగా అంచనాలు లేకుండా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'ను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 350 థియేటర్లలో విడుదల చేశారు. ఈ సనిమాకు గాను సుమారు రూ 3.5 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లలో వస్తున్న విశేష స్పందన చూసి హీరో సూర్య సైతం సంతోషంతో సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment