బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అతడు తన చిన్ననాటి సంగతులను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తండ్రి, స్టార్ హీరో ఫిరోజ్ ఖాన్ చేసిన పని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిపాడు. 'నాన్న హీరోగా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. 1972లో అపర్ధ్ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ సమయంలో నిర్మాతలు అధిక వడ్డీకి అప్పు తీసుకుని చిత్రాలు చేసేవారు. నాన్న కూడా అలానే చేశాడు. అది చూసి మేమంతా భయపడ్డాం.
ఆర్థిక ఇబ్బందులు
తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టార్ హీరో కుమారుడిని అని గల్లా ఎగరేసి చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. మా అమ్మ ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంట్‌గా 9 సంవత్సరాలు పని చేసింది. అమ్మానాన్న ఇద్దరూ మాకోసం కష్టపడేవారు. ప్రతి ఏడాది లాంగ్ వెకేషన్‌కు తీసుకువెళ్లేవారు. కొన్నిసార్లు ఆ వెకేషన్ కూడా ఆపేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బర్త్‌డే పార్టీ కూడా చిన్నగా జరిపేవారు. అలా అని తినడానికి తిండి లేనంత దీన స్థితిలోనైతే లేము అని పేర్కొన్నాడు.
దేశం విడిచి పారిపోలేదు
ఇండస్ట్రీకి 14 ఏండ్లు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. నేను సినిమాలకు దూరంగా ఉన్నమాట వాస్తవమే.. కానీ దేశం విడిచి వెళ్లిపోలేదు. కొన్నాళ్లపాటు అక్కడ ఉండి మళ్లీ ఇండియాకు వచ్చేశాను.. ఇక్కడే ఉన్నాను. కొన్నేళ్ల క్రితం నేను కాస్త లావయ్యాను. నా అవతారం చూసి సినిమాలు పూర్తిగా మానేసినట్లున్నాడని అంతా అనుకున్నారు. నిజంగా 14 ఏళ్లు మూవీస్‌కు దూరంగా ఉండటం నేను చేసిన అతిపెద్ద పొరపాటు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫర్దీన్ ఖేల్ ఖేల్ మే, విస్ఫోట్ సినిమాల్లో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment