చెక్‌పోస్టు ఉద్యోగం భలే కిక్కు! | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టు ఉద్యోగం భలే కిక్కు!

Published Sun, Jun 16 2024 2:02 AM

-

కేసుల నమోదు లేకుండా పంచాయితీలు

 బాటిళ్లు తీసుకొని రవాణాదారులను వదిలేస్తున్న వైనం

 కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

కర్నూలుకు చెందిన గిరిబాబుతో పాటు మరో నలుగురు యువకులు శనివారం అలంపూర్‌కు వెళ్లి మద్యం సేవించి తిరిగి వచ్చేటప్పుడు కారులో రాయల్‌స్టాగ్‌ మద్యం బాటిళ్లను తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ వాహనం తనిఖీ చేశారు. కారులో ఆరు రాయల్‌స్టాగ్‌ ఫుల్‌ బాటిళ్ల మద్యం పట్టుబడగా వాటిని నొక్కేసి కారును వదిలేశారు.

కర్నూలు: కర్నూలు శివారులోని అంతర్‌రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులో సెబ్‌ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ నుంచి జిల్లాలోకి అక్రమ మద్యం రవాణా కాకుండా నిరోధించేందుకు పంచలింగాల క్రాస్‌ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటైంది. గతంలో సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులతో పాటు అధిక సంఖ్యలో సిబ్బంది నిరంతరం వాహనాలు తనిఖీ చేస్తూ మద్యం అక్రమ రవాణాను కట్టడి చేశారు. ఎన్నికల సమయంలో కూడా ఈ చెక్‌పోస్టు వద్ద సివిల్‌, సెబ్‌ పోలీసులతో పాటు రవాణా, ఇతర శాఖల అధికారులతో కలసి నిరంతరం వాహనాలు తనిఖీ చేపట్టారు. 

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సివిల్‌ పోలీసులు, రవాణా శాఖ అధికారులు తమ విధులకు వెళ్లిపోవడంతో కేవలం సెబ్‌ పోలీసులు మాత్రమే చెక్‌పోస్టులో విధుల్లో ఉంటున్నారు. అక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో తనిఖీల్లో పట్టుబడిన మద్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు షిఫ్టులలో ఇక్కడ సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ సిబ్బంది కొరత వల్ల కొంతమంది మాత్రమే ఉంటున్నారు. అక్కడ విధులు నిర్వహించే ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ఒక కానిస్టేబుల్‌ ప్రతిరోజూ పట్టుబడిన మద్యం బాటిళ్లను వారు ఉంటున్న గదుల్లో భద్రపరచి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

👉 అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడితే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి మద్యంతో పాటు వాహనాన్ని సీజ్‌ చేసి రవాణాదారులపై కేసు నమోదు చేయాల్సి ఉంది.

👉 అయితే కొంతకాలంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సెబ్‌ సిబ్బంది అక్రమ సంపాదనకు అలవాటు పడి చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

👉 సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ కొంతకాలంగా సిబ్బంది పట్టుబడిన మద్యాన్ని రహస్య ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

👉 ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ను వివరణ కోరగా విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీల సందర్భంగా మద్యం నొక్కేసినట్లు విచారణలో బయటపడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అక్కడ విధులు నిర్వహించాల్సిన ఉన్నతాధికారుల పనితీరుపైనా విచారణ జరిపిస్తానని తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement