విద్యుత్‌ షాక్‌తో చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో చిన్నారి మృతి

Published Wed, May 8 2024 5:25 AM

-

– మరో చిన్నారికి తీవ్ర గాయాలు

చిల్లకూరు : తండ్రితో కలిసి గొర్రెలు మేపేందుకు వెళ్లిని ఓ చిన్నారిని విద్యుత్‌ తీగ బలిగొంది. మరో చిన్నారిని గాయాలు పాలు చేసింది. ఈ విషాద సంఘటన మంగళవారం తీర ప్రాంతంలోని బకింగ్‌ హాం కెనాల్‌కు అవతలి వైపున చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని తీర ప్రాంత గ్రామమైన తూర్పుకనుపూరు పంచాయతీలోని ఈదులవారిపాళెం గ్రామానికి చెందినసిద్ధయ్య, ముత్యాలయ్య అనే గిరిజన కుటుంబాల వారికి గొర్రెలు ఉన్నాయి. వాటిని మేపుకునేందుకు గ్రామానికి సమీపంలో ఉన్న బకింగ్‌హాం కెనాల్‌కు అవతలి వైపు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇద్దరి కుమారులు మునేంద్ర(8), సతీష్‌(9) కూడా వారితో వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నారులిద్దర్నీ ఇంటికి వెళ్లమని తండ్రులు వారికి నచ్చజెప్పారు. చిన్నారులిద్దరూ ఇంటికి వచ్చే క్రమంలో కాలువకు దగ్గరగా ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగ తెగిపడి ఉండడంతో గుర్తించక దానిపై కాలు వేశారు. మునేంద్ర అక్కడికక్కడే కాలిపోయి మృతి చెందగా సతీష్‌కు కాళ్లు కాలి పోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రమాదాన్ని గమనించి ఇద్దరు తండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపిస్తూ ఇద్దరు బిడ్డలను ఇంటికి చేర్చారు. ఆపై తీవ్రంగా గాయపడిన సతీష్‌ను ఆస్పత్రికి తరలించారు. మునేంద్ర మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. విద్యుత్‌ తీగ తెగిపడిన విషయమై ఆ శాఖ ఏఈని వివరణ కోరగా.. తమకు కూడా సమాచారం అందిందని, వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement