శిక్షణకు 26 మంది డుమ్మా | Sakshi
Sakshi News home page

శిక్షణకు 26 మంది డుమ్మా

Published Wed, May 8 2024 5:25 AM

శిక్షణకు 26 మంది డుమ్మా

తిరుపతి అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శిక్షణకు డుమ్మాకొట్టిన 26 మంది పీఓలు, ఏపీవోలకు సెక్షన్‌ 134 ప్రకారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చామని చెప్పారు. అయితే రెండో సారి నిర్వహించిన శిక్షణకు 4,524 మందికి గాను 4,498 మంది మాత్రమే హాజరయ్యారని, ఇందులో 26 మంది ముందుస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే శిక్షణకు డుమ్మాకొట్టారని వెల్లడించారు. మూడు రోజుల్లో వారు సరైన వివరణ ఇవ్వకుంటే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,748 మంది స్వామివారిని దర్శించుకోగా 30,688 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

డిగ్రీ ఫలితాలు విడుదల

తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన డిగ్రీ అన్ని గ్రూపులకు సంబంధించిన ఐదో సెమిస్టర్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి దామ్లానాయక్‌ తెలిపారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌ నందు ఆన్‌లైల్‌లో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.

పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ

తిరుపతి అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్‌ స్లిప్పులు పంపిణీ నిబంధనల మేరకు జరగాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో షేడ్‌, తాగు నీరు, లైటింగ్‌, ర్యాంపు, వీల్‌ చైర్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. పీడబ్ల్యూడీ, సీనియర్‌ సిటిజన్స్‌ ఓటింగ్‌ కోసం వెయిటింగ్‌ లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో పెంచలకిషోర్‌, జిల్లా నోడల్‌ అధికారులు, ఎన్నికల సెక్షన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అనుమతులు తప్పనిసరి

తిరుపతి అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, దానికి ముందు రోజు ప్రింట్‌ మీడియాలో అభ్యర్థులకు సంబంధించిన రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రకటనలకు రెండు రోజుల ముందే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్వేషపూరిత ప్రకటనల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.

96 శాతం హోమ్‌ ఓటింగ్‌

తిరుపతి అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో హోమ్‌ ఓటింగ్‌ 96 శాతం పూర్తయింది. 1,139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,077 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement