వెంటాడుతున్న అలజడి | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న అలజడి

Published Sat, Jan 31 2015 1:37 AM

వెంటాడుతున్న అలజడి

మరో మూడు కేసుల్లో స్వైన్‌ఫ్లూ నిర్ధారణ
నాలుగు చేరిన కేసుల సంఖ్య
చికిత్స పొందుతున్న బాధిత రోగులు
{పభుత్వాస్పత్రిలో  వెంటిలేటర్ల పెంపు

 
విశాఖ మెడికల్: స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. రెండు రోజుల క్రితం ఒకరికి వ్యాధి నిర్ధారణ కావడంతో ఉలికిపడిన విశాఖవాసులకు శుక్రవారం మరో మూడు  కేసులకూ పాజిటివ్ రావడం కలవరపరిచింది. అబిద్‌నగర్‌కు చెందిన వృద్ధునికి..నగరానికి చెందిన 52ఏళ్ల మహిళతోపాటు విజయనగరం జిల్లా భోగాపురం మహిళ(32)కి వ్యాధి నిర్ణారణయింది. వీరంతా ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.  దీంతో విశాఖలోనే కాకుండా జిల్లాలోనూ ఈ వ్యాధిపట్ల అప్రమత్తం పెరిగింది. మాస్కులు ధరించకుండా ఎవరూ బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఆస్పత్రుల ఏరియాలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. శుక్రవారం స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో  కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. టౌన్‌కొత్తరోడ్డు ప్రాంతం నుంచి 56 ఏళ్ల మహిళతో పాటు గాజువాకకు చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలుండడంతో ఆస్పత్రిలో చేర్చారు. అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న విజయనగరానికి చెందిన 41 ఏళ్ల మహిళను గురువారం రాత్రి ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చేర్చుకున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాంబశివరావు తెలిపారు.

శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఆమెను వెంటిలేటర్‌పై నుంచి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇదే ఆస్పత్రిలో మూడు రోజుల కిందట చేరిన పలాసకు చెందిన 50ఏళ్ల వృద్ధుడికి స్వైన్‌ఫ్లూ లేనట్టు నిర్థారణ నివేదిక రావడంతో డిస్చార్జ్ చేసినట్టు తెలిపారు. కేజీహెచ్‌లో శుక్రవారం కొత్తగా అనుమానిత కేసులేవీ నమోదు కాలేదు. వ్యాధి అనుమానిత లక్షణాలతో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నాలుగేళ్ల బాలుడికి స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్థారణయింది. పెదవాల్తేర్ ఆదర్శనగర్‌కు చెందిన మరో బాలుడుకి వ్యాధి లేదని నివేదిక అందినట్లు వైద్యవర్గాలు చెప్పాయి. పిల్లల వార్డులో మరో ముగ్గురు చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో గురువారం రాత్రి చేర్చుకున్న విషయం తెలిసిందే.  పిల్లల వార్డులో వారం రోజుల కిందట చేరిన బాధితురాలికి స్వైన్‌ఫ్లూ వ్యాధి కాదని నిర్థారణయింది.

వ్యాధి నిరోధక చర్యలు ముమ్మరం

స్వైన్‌ఫ్లూ నియంత్రణకు జిల్లా యంత్రంగం చర్యలు ముమ్మరం చేసింది.  శుక్రవారం నుంచి  క్లస్టర్ స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ (ఆశా నుంచి ఆరోగ్యకార్యకర్త స్థాయి వరకు)సిబ్బంది ర్యాలీలు చేపట్టింది. హైదరాబాద్,  ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. బస్సు, రైలు, విమాన కేంద్రాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తిపై తనిఖీలు నిర్వహించాలని  నిర్ణయించింది. బస్సు, రైలు, విమానయాన కేంద్రాల వద్ద తనిఖీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనుంది. వ్యాధి అ నుమానిత లక్షణాలు గల వారికి సలహా లు, సూచనలిచ్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పా టు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల న్నింటిలోనూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. శనివారం కలెక్టరేట్‌లో డ్వాక్రా మహిళలు, విద్యా శాఖ, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ముఖ్య అధికారులతో కుటుంబ సంక్షేమ కార్యాలయం సమన్వయకర్త డాక్టర్ అరుణదేవి చర్చించనున్నారు.  కేజీహెచ్, ఛాతి ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించే విషయమై శుక్రవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు.  ఛాతి ఆస్పత్రి స్వైన్‌ఫ్లూ వార్డులో మరో రెండు వెంటిలేటర్ల ఏర్పాటు చేయాలని, వీటిని ఈఎన్‌టీ ఆస్పత్రి నుంచి తరలించాలని నిర్ణయించారు.

స్వైన్‌ఫ్లూ అనుమానిత రోగుల గొంతు నుంచి లాలాజల నమూనాలను సేకరించే విషయంలో కేజీహెచ్‌లోని టెక్నికల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వైరస్‌ను అడ్డుకునేందుకు ఎన్-95 మాస్క్‌ల కొరత ఉన్నందున కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. సమావేశంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మదుసూధనబాబుతో పాటు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ సోమరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.సరోజీని, ఛాతి, ఈఎన్‌టీ ఆస్పత్రుల సూపరిటెండెంట్‌లు డాక్టర్ సాంబశివరావు, కృష్ణకిషోర్, జిల్లా స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారి ఎల్‌బిఎస్ దేవి, కేజీహెచ్ నోడల్ అధికారి డాక్టర్ ఇందిరాదేవి, మైక్రోబయాలజీ సహాయ ప్రొఫెసర్లు డాక్టర్ శివకల్యాణి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement