అరాచకం: మహిళపై టీడీపీ రేషన్‌ డీలర్‌ దాడి | Sakshi
Sakshi News home page

అరాచకం: మహిళపై టీడీపీ రేషన్‌ డీలర్‌ దాడి

Published Tue, Jun 5 2018 8:43 AM

TDP Ration Dealer Attack On women in Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు(ఆదోని టౌన్)‌: పేదల బియ్యాన్ని స్వాహా చేయటంపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో అధికార పార్టీకి చెందిన రేషన్‌ డీలర్, అతడి సోదరులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

అక్రమాలపై ఫిర్యాదు చేశారనే కక్షతోనే 
టీడీపీకి చెందిన అంజినయ్య గ్రామంలో రేషన్‌ డీలర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కార్డుదారులకు రేషన్‌ సక్రమంగా ఇవ్వకుండా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు అతడిపై ఆరోపణలున్నాయి. డీలర్‌ అక్రమాలపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్థానిక తహశీల్దార్‌ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వీఆర్‌వో రామాంజనేయులు ఆదివారం గ్రామంలో విచారణ జరపగా రేషన్‌ డీలర్‌ బియ్యం ఇవ్వటం లేదని వంద మందికిపైగా కార్డుదారులు తెలిపారు. ఇదే నివేదికను వీఆర్‌వో తహసీల్దార్‌కు సమర్పించారు. ఏపీ ఫుడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుడిసె క్రిష్ణమ్మ కూడా సోమవారం గ్రామాన్ని సందర్శించి డీలర్‌ అక్రమాలు, తూకాల్లో మోసాలపై ఆరా తీశారు. 

దీన్ని జీర్ణించుకోలేని డీలర్‌ అంజనయ్య, అతడి  సోదరులు నాగరాజు, కేశవ్, ఈరన్న గ్రామస్తులతో గొడవకు దిగారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ గొల్ల లక్ష్మి అనే మహిళను దుర్భాషలాడారు. ఆమెపై భౌతిక దాడికి దిగి కొట్టటంతో జాకెట్‌ చిరిగిపోయింది. ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపుతామంటూ బెదిరించారు. దాడితో అస్వస్థతకు గురైన బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. నడుము భాగం దెబ్బ తిన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు, మీడియా వద్ద బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వేడుకుంది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement