ముప్పు తప్పాలంటే ముందే చూడాలి! | Sakshi
Sakshi News home page

ముప్పు తప్పాలంటే ముందే చూడాలి!

Published Sat, Jun 11 2016 2:25 AM

ముప్పు తప్పాలంటే ముందే చూడాలి!

ఫ్లాటు కొనేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలేంటి? వాణిజ్య సముదాయాల్లో స్థలం కొనేవారు, అద్దెకిచ్చేవారు చూడాల్సిన వివరాలేంటి? ఫ్లాట్ కొనేటప్పుడు మోసపోతున్నామని ముందే తెలుసుకోవటమెలా?

 స్థిరాస్తి కొనేముందు ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించాల్సిందే. లేకపోతే కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. త్వరలోనే స్థిరాస్తి రేట్లు పెరుగుతాయనో.. ఇప్పుడు కొనకుంటే అసలిక కొనలేమనో.. ఆఫర్లు, రాయితీలిస్తున్నారనో.. స్థిరాస్తి కొనుగోలులో తొందరపడొద్దు.

సాక్షి, హైదరాబాద్ :అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కానీ, వాణిజ్య భవనంలో స్థలం కానీ కొనేటప్పుడు అమ్మే వ్యక్తి అసలు పత్రాల్ని చూపించమనండి. ఏదో ఒక సాకు చెప్పి.. పత్రాలు ప్రస్తుతం లేవని చెబితే కచ్చితంగా అనుమానించాల్సిందే. ఫ్లాట్ అమ్మే వ్యక్తికి ఆ ఆస్తిపై క్లియర్ టైటిల్ లేకపోవడమో, ఆస్తి పత్రాల్ని ఎక్కడైనా తాకట్టు పెట్టడమో జరిగిందని దానర్థం. కాబట్టి అసలు పత్రాల్ని చూశాకే అంతిమ నిర్ణయానికి రావాలి.

 స్థిరాస్తిని ఎవరి వద్ద కొనుగోలు చేశారన్న విషయాన్ని నిర్ణయించే యాజమాన్య హక్కుకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్ల పత్రాలు జిరాక్స్ కాపీలను ఇవ్వాలని కోరండి. అనుభవమున్న న్యాయవాదికి ఆ పత్రాలను చూపించి సలహా తీసుకోవటం మంచిది.

 ఇంతకుమందే ఆ స్థిరాస్తిపై రుణాలు తీసుకొని ఉంటే, వాటిని తీర్చేయమనండి. ఆ తర్వాతే కొనుగోలు చేయండి. అమ్మే వ్యక్తికి యాజమాన్య హక్కుపై ఎలాంటి వివాదాలు లేవని తెలిశాకే ముందడుగు వేయాలి.

 స్థానిక సంస్థల నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టారా అనేది తెలుసుకోవాలి. కట్టిన ఇంటినే విక్రయిస్తుంటే ఎన్ని అంతస్తులకు అనుమతి పొందారో కనుక్కోండి. నిర్మాణ నిబంధనల్ని అతిక్రమించి కట్టాడా అన్న విషయాన్ని తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

 అపార్ట్‌మెంట్ అయితే ఎత్తు, సెట్‌బ్యాక్, సైడ్ బ్యాక్ విషయాల్ని నిర్మాణ నిబంధనలను అనుగుణంగా వదిలేశారా లేదా చూడండి.

 స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు బదిలీ రుసుం, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించండి. అదేవిధంగా అమ్మకందారులు ఆస్తి పన్ను, విద్యుత్, నీటి చార్జీలు, సొసైటీ చార్జీలు, నిర్వహణ రుసుం చెల్లించారా లేదా నిర్ధారణ చేసుకోవాలి.

 అసలు క్రయ ఒప్పంద పత్రం (సేల్ అగ్రిమెంట్)లో ఫ్లాట్ మున్సిపల్ అప్రూవ్డ్ ప్లాన్, ఫ్లాట్ విస్తీర్ణం, ఉమ్మడి స్థలాల వివరాలు, ఫ్లాట్ మొత్తం ధర వంటి వివరాలన్నీ ఉండాలి.

 మీరు కొనబోయే ఫ్లాట్ సహకార సంఘం పరిధిలో ఉంటే అసలు వాటా పత్రాలను పరిశీలించండి. వాటి ద్వారానే ఆ స్థిరాస్తి అసలు యజమాని ఎవరో తెలిసిపోతుంది.

 స్థిరాస్తికి సంబంధించి అసలు పత్రాలను తీసుకోవటం మరవొద్దు.

 బిల్డర్ పేరు ప్రఖ్యాతలనూ పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో అతను చేపట్టిన నిర్మాణాల గురించి  తెలుసుకోవాలి.

 స్థిరాస్తి మొత్తం విలువను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అసలు ధరతో పాటూ స్టాంపు రుసుం, రిజిస్ట్రేషన్ చార్జీలు, బదిలీ రుసుం, సొసైటీ చార్జీలు, సదుపాయాలకు చెల్లించే మొత్తం ఇలా అనేక అంశాలను ముందే తెలుసుకోవటం ఉత్తమం.

 సదుపాయాల విషయానికొస్తే కావాల్సినంత నీటి సరఫరా, విద్యుత్తు, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకోవటం ముఖ్యం. వాస్తు వంటి అంశాలపై మీకు నమ్మకం ఉంటే ఫ్లాట్/ప్లాట్ కొనుగోలుకు ముందే నిపుణులతో పరిశీలింపజేసి నిర్మాణం అందుకు అనుగుణంగా ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోండి.

మొక్కలకు పోసే నీరు రూఫ్ డెక్ సమీపంలోకి రాకుండా నిర్మించే డ్రైనేజీని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకోవాలి. ఈ డ్రైనేజీలో నీరు నిలిచినా, అది కిందికి ఇంకకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ కాంక్రీట్ లేయర్‌ను నిర్మించాలి.

 
Advertisement
 
Advertisement