ఈసీకి హైకోర్టు నోటీసు | Sakshi
Sakshi News home page

ఈసీకి హైకోర్టు నోటీసు

Published Fri, Mar 28 2014 11:26 PM

High Court notice to EC

టీనగర్, న్యూస్‌లైన్: ఎన్నికల చిహ్నం కోరుతూ మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు పంపింది. మద్రాసు హైకోర్టులో మనిదనేయ మక్కల్ కట్చి అధ్యక్షుడు జేఎస్ రిపాయి దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ విధంగా తెలిపారు. భారత ఎన్నికల కమిషన్‌లో తమ పార్టీ 2009లో నమోదైందని ఆనాటి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నామని తెలిపారు.
 
ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ 24న జరగనున్నాయని ఈ ఎన్నికలలో డీఎంకే, వీసీకే పార్టీలతో తమ పార్టీ కూటమి ఏర్పాటు చేసుకుని మైలాడుదురై పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తోందన్నారు. ఈ నియోజకవర్గంలో తమ పార్టీ తరపున సీనియర్ నేత ఎస్ హైదర్ అలీ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి కొవ్వొత్తి చిహ్నం కేటాయించారన్నారు.
 
అందువల్ల జరగనున్న పార్లమెంటు ఎన్నికలల్లోనూ అదే చిహ్నాన్ని కేటాయించాలంటూ భారత ఎన్నికల కమిషన్‌కు గత 17వ తేదీ విజ్ఞప్తి చేసింది. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువల్ల తమ పార్టీకి కొవ్వొత్తి చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎన్.పాల్ వసంతకుమార్, ఎం.సత్యనారాయణన్ ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తులు ఈ పిటిషన్‌కు వచ్చే ఏప్రిల్ 1వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలంటూ భారత ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇచ్చారు.
 
అలాగే తెన్‌కాశి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పుదియ తమిళగం పార్టీకి టెలివిజన్ చిహ్నం కేటాయించాలంటూ ఆ పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, సత్యనారాయణన్, ఏప్రిల్ 1వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలంటూ భారత ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement
Advertisement