చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కింగ్స్ టాప్-4 రేసు నుంచి నిష్క్రమించగా.. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సీఎస్‌కేపై తాజా విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆశలను సజీవం చేసుకున్నాయి.
మరోవైపు ఈ రెండు జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్‌పై కన్నేశాయి. ఇక ఇప్పటికే రన్‌రేటు పరంగా అన్ని జట్ల కంటే పటిష్ట స్థితిలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్(16 పాయింట్లు) రెండో స్థానం ఆక్రమించింది.
మూడో స్థానం కోసం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్(12 పాయింట్లు)ను వెనక్కి నెట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్(14 పాయింట్లు) ముందుకు దూసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌నకు సంబంధించిన కొన్ని సమీకరణలు ఇలా ఉన్నాయి.
కేకేఆర్.. టాప్
ఇప్పటికే టాప్-1లో ఉన్న కేకేఆర్ శనివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. సొంతమైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సేన ముంబైని ఓడించిందంటే మరో రెండు పాయింట్లు ఖాతాలో పడతాయి.
ఫలితంగా 18 పాయింట్లతో కేకేఆర్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలా కాక ముంబైతో కాకుండా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్‌తో మిగిలిన మ్యాచ్‌లలో ఏ ఒక్కటి గెలిచినా బెర్తు ఖాయమే!
అయితే, ఇక్కడో మెలిక ఉంది. రాజస్తాన్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ లేదా లక్నో ఈ జట్లలో మూడు 18 పాయింట్లు సాధిస్తేనే కేకేఆర్ ప్రయాణం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ముంబైతో మ్యాచ్‌లో ఓడినా రాజస్తాన్‌పై మాత్రం కచ్చితంగా గెలవాలి.
రాజస్తాన్.. రైట్ రైట్
చెన్నై, పంజాబ్, కేకేఆర్ రూపంలో రాజస్తాన్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి గెలిచినా, కేకేఆర్, సీఎస్‌కే, లక్నో/సన్‌రైజర్స్‌లలో ఏ జట్టు 18 పాయింట్లు సాధించినా రాజస్తాన్ బెర్త్ ఖరారవుతుంది.టాప్-2లో నిలవాలంటే కేకేఆర్‌ను మాత్రం ఓడించడం తప్పనిసరి.
సన్‌రైజర్స్ రైజ్ అవ్వాలంటే!
సన్‌రైజర్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌ల రూపంలో ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నాయి.
ఈ రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ గెలిస్తే సన్‌రైజర్స్ టాప్-4కు అర్హత సాధిస్తుంది. ఏ ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పని దుస్థితి ఎదురవుతుంది.
చెన్నై చమక్ అనాలంటే!
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత పడుతూ లేస్తూ ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్‌కే కాస్త డీలా పడింది. ప్రస్తుతం సీఎస్‌కేకు రాజస్తాన్, ఆర్సీబీలతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
ఈ రెండింటిలోనూ గెలిస్తేనే సీఎస్‌కే ప్రయాణా సాఫీగా సాగుతుంది. లేదంటే.. లేదంటే ఢిల్లీ, లక్నోతో సీఎస్‌కే పోటీపడాల్సి ఉంటుంది. అయితే, రన్‌రేటు పరంగా సీఎస్‌కే ప్రస్తుతం ఆ రెండు జట్ల కంటే మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం.
ఢిల్లీ దబాంగ్ అనిపించుకోవాలంటే..
ఆరంభంలో అపజయాలు ఎదురైనా తిరిగి పుంజుకుని ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మిగిలిన మ్యాచ్‌లలో గెలవడం సహా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే..
ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో లక్నో హ్యాట్రిక్ కొట్టాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో చెన్నై, ఢిల్లీతో సమానంగా ఉన్నా రన్‌రేటు పరంగా వెనుకబడి ఉంది రాహుల్ సేన.
కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవడంతో పాటు ప్రస్తుతం టాప్-4లో ఉన్న కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్, చెన్నై వీలైనన్ని మ్యాచ్‌లు ఓడిపోతేనే లక్నో ఆశలు సజీవంగా ఉంటాయి.
ఆర్సీబీ, గుజరాత్ పరిస్థితి ఇదీ!
ఆర్సీబీకి ఢిల్లీ, సీఎస్‌కేలతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండూ కచ్చితంగా గెలిచి.. నెట్ రన్‌రేటు పరంగా మిగతా జట్ల కంటే మెరుగపడటం సహా ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే!
గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. కేకేఆర్, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లలో ఏ ఒక్కటి ఓడినా ప్రయాణం ముగిసినట్లే. రెండూ గెలిస్తే అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేటు తదితర అంశాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment