నేడు తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతాతో హైదరాబాద్ ‘ఢీ’
గెలిస్తే నేరుగా టైటిల్ పోరుకు
ఓడినా... మరో అవకాశం
రాత్రి గం.7:30 నుంచి ‘స్టార్ స్పోర్ట్స్’, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
అహ్మదాబాద్: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 17వ సీజన్ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండుసార్లు (2012, 2014) చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది.
2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్ ప్రస్తుత సీజన్‌లో భీకరమైన ఫామ్ దృష్ట్యా టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది.
సన్ తుఫాన్‌కు ఎదురేది?
సన్‌రైజర్స్ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్ హెడ్ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది.
ఫైట్ రైడర్స్
ఫిల్ సాల్ట్–సునీల్ నరైన్ ఓపెనింగ్ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కోల్‌కతా.
ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు నైట్‌రైడర్స్ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ!
జట్లు (అంచనా)
హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్.
కోల్‌కతా: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్, అనుకుల్/వైభవ్.
పిచ్, వాతావరణం
నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్ (గుజరాత్ 89 ఆలౌట్; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.
26: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101.
Comments
Please login to add a commentAdd a comment