first qualifier
-
IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
అహ్మదాబాద్: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 17వ సీజన్ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండుసార్లు (2012, 2014) చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. 2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్ ప్రస్తుత సీజన్లో భీకరమైన ఫామ్ దృష్ట్యా టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది. సన్ తుఫాన్‌కు ఎదురేది? సన్‌రైజర్స్ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్ హెడ్ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది. ఫైట్ రైడర్స్ ఫిల్ సాల్ట్–సునీల్ నరైన్ ఓపెనింగ్ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కోల్‌కతా. ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు నైట్‌రైడర్స్ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! జట్లు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్. కోల్‌కతా: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్, అనుకుల్/వైభవ్. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్ (గుజరాత్ 89 ఆలౌట్; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.26: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101. -
IPL 2023 CSK Vs GT : ‘ఫైనల్’కు ముందెవరు?
చెన్నై: ఐపీఎల్లో రెండు దీటైన జట్ల మధ్య ఢీ అంటే ఢీ అనే మ్యాచ్‌కు నేడు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. చెన్నై వేదికగా మ్యాచ్ జరగడం ధోని సేనకు అనుకూలత అయినప్పటికీ... ఈ జట్టుపై ఓటమి ఎరుగని గుజరాత్ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు సమఉజ్జీల మధ్య ఆసక్తికర సమరం గ్యారంటీ! దీంతో ప్రేక్షకులకు టి20 మెరుపులు, ఆఖరి ఓవర్ డ్రామాకు కొదవుండదు. ఇక చెన్నైలో గెలిచినా... ఓడినా... చివరి మజిలీ మాత్రం అహ్మదాబాదే! నెగ్గితే నేరుగా ఒక జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు మరో ప్రయత్నంగా రెండో క్వాలిఫయర్‌లో ఆడుతుంది. ఈ రెండూ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగనున్నాయి. చెన్నై చెలరేగితే... బరిలోకి దిగే రెండు జట్లు బలమైన ప్రత్యర్థులు. చెన్నై ఐపీఎల్ ఆరంభం నుంచే లీగ్ ఫేవరేట్లలో ఒకటిగా ఎదిగింది. ధోని నాయకత్వంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎన్నోసార్లు నిరూపించుకుంది. ఈ సీజన్లోనూ సూపర్‌కింగ్స్ ఆట మేటిగానే ఉంది. టాపార్డర్ లో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, శివమ్ దూబే ధనాధన్ షోకు శ్రీకారం చుడితే ప్రత్యర్థికి చుక్కలే! వెటరన్ ధోని బ్యాటింగ్‌లో వెనుకబడొచ్చేమో కానీ... జట్టును నడిపించడంలో ఎప్పటికీ క్రికెట్ మేధావే. మిడిలార్డర్లో అంబటి రాయుడు నుంచి ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బహుశా ఈ మ్యాచ్‌లో ఆ వెలతి తీర్చుకుంటాడేమో చూడాలి. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ... ఇక బౌలింగ్ దళంలో దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే పవర్ ప్లేలో పరుగులిస్తున్నప్పటికీ వికెట్లను మాత్రం పడగొట్టేస్తున్నారు. తీక్షణ, పతిరణల వైవిధ్యం కూడా జట్టుకు కీలక సమయాల్లో ఉపయోగపడుతుంది. టైటాన్స్ ‘టాప్’షో టోర్నీ మొదలైన మ్యాచ్‌లోనే చెన్నైపై గెలిచిన గుజరాత్ టైటాన్స్ లీగ్‌లో ఘనమైన ఆరంభమిచ్చింది. బెంగళూరుతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ టైటాన్స్‌దే ఆధిపత్యం. సొంతగడ్డపై బెంగళూరు భారీస్కోరు చేసినా ఛేదించి మరీ నెగ్గింది. పాయింట్ల పట్టికైనా... ఆటలోనైనా... డిఫెండింగ్ చాంపియన్‌కు లీగ్ దశలో అయితే ఎదురే లేకపోయింది. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌ను పాండ్యా సేన సమర్థంగా సరైన దిశలో వినియోగించుకుంటుంది. శుబ్‌మన్ గిల్ లేదంటే విజయ్ శంకర్ల ‘ఇంపాక్ట్’ జట్టుకు అదనపు పరుగుల్ని కట్టబెడుతోంది. జట్టులో వీళ్లిద్దరే కాదు... సాహా నుంచి రషీద్ ఖాన్ దాకా ఇలా ఎనిమిదో వరుస బ్యాటర్ కూడా బాదేయగలడు. షనక, మిల్లర్, రాహుల్ తెవాటియాలు ధాటిగా ఆడగల సమర్థులు. దీంతో పరుగులకు, మెరుపులకు ఏ లోటు లేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, షమీ, రషీద్ ఖాన్ కలిసొచ్చే పిచ్‌పై మ్యాచ్‌నే మలుపుతిప్పే బౌలర్లు. ఏ రకంగా చూసుకున్నా ఎవరికీ ఎవరు తీసిపోరు కాబట్టి హేమాహేమీల మధ్య వార్ వన్‌సైడ్ అయితే కానే కాదు! తుది జట్లు (అంచనా) గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాహా, గిల్, విజయ్ శంకర్, షనక, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ/యశ్ దయాళ్. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రుతురాజ్, కాన్వే, దూబే/పతిరణ, జడేజా, రహానే, మొయిన్ , రాయుడు, దీపక్ చహర్, తుషార్, తీక్షణ. పిచ్, వాతావరణం ఎప్పట్లాగే చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశముంది. అయితే రాత్రయ్యేకొద్దీ తేమ కారణంగా బౌలర్లకు కష్టాలు తప్పవు. టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపువచ్చు. వర్ష సూచన లేదు. 3: ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా... మూడింటిలోనూ గుజరాత్ జట్టే గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై నిర్దేశించిన లక్ష్యాలను గుజరాత్ ఛేదించింది. అయితే చెన్నై వేదికగా మాత్రం ఈ రెండు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. 43: ఐపీఎల్ టోర్నీలో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం 61 మ్యాచ్‌లు ఆడింది. 43 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 18 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 24: ఐపీఎల్ టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో చెన్నై మొత్తం 24 మ్యాచ్‌లు ఆడింది. 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. (తొలుత బ్యాటింగ్ చేసినపుడు 7 సార్లు... ఛేజింగ్ లో 8 సార్లు). మిగతా 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. -
CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్ వైపు
ఐపీఎల్లో ఇది 14వ సీజన్. ఇందులో రెండు సీజన్లు నిషేధంతో చెన్నై బరిలోకే దిగలేదు. అంటే ఆడింది 12 సీజన్లే కానీ తొమ్మిదోసారి ఫైనల్ చేరింది. చెన్నై మళ్లీ సూపర్ కింగ్స్‌లా ఆడింది. ఆఖరి దశకు చేరేకొద్దీ శివాలెత్తే చెన్నై ఇప్పుడు కూడా అదే చేసింది. లీగ్ టాపర్‌ను కొట్టి మరీ తొలి క్వాలిఫయర్‌తోనే ఫైనల్ చేరింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్‌లాగే తొలి క్వాలిఫయర్‌లో ఓడి ఫైనల్లో బెర్త్ కోసం రెండో క్వాలిఫయర్ ఆడేందుకు సిద్ధమైంది. దుబాయ్: గతేడాది యూఏఈలో చెత్తగా ఆడి లీగ్‌లోనే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఈసారి గొప్పగా ఆడి ఫైనల్ చేరింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రిషభ్ పంత్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కెపె్టన్ ధోని (6 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో చెన్నైను విజయతీరానికి చేర్చాడు. పృథ్వీ ‘షో’... పృథ్వీ షా దూకుడుతో ఢిల్లీ చకచకా పరుగులు సాధించింది. హాజల్‌వుడ్ రెండో ఓవర్లో 4, 6 కొట్టిన షా... దీపక్ చహర్ మూడో ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు కొట్టాడు. కానీ ధావన్ (7) నిరాశపరిచాడు. మరోవైపు శార్దుల్ వేసిన ఐదో ఓవర్లో పృథ్వీ రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. 4.5 ఓవర్లలో జట్టు 50 పరుగులు పూర్తయ్యాయి. ఇందులో పృథ్వీ ఒక్కడివే 42 పరుగులు! తర్వాత ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ (1) చెత్తషాట్ ఆడి రుతురాజ్ చేతికి చిక్కాడు. ఈ రెండు వికెట్లు హాజల్వుడ్కే దక్కాయి. అక్షర్ పటేల్ రాగా... పృథ్వీ 27 బంతుల్లో ఫిఫ్టీ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. కాసేపు ఓపిగ్గా ఆడిన అక్షర్ పటేల్ (10) మొయిన్ అలీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యతి్నంచి డగౌట్ చేరాడు. 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 79/3. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాతి ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జడేజా పృథ్వీ ‘షో’కు తెరదించాడు. అనంతరం పంత్, హెట్‌మైర్ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో ఢిల్లీ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఉతప్ప, రుతురాజ్ దూకుడు లక్ష్యఛేదనకు దిగిన చెన్నై తొలి ఓవర్లోనే ఓపెనర్ డుప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయింది. నోర్జే అతన్ని బౌల్డ్ చేశాడు. కానీ ఢిల్లీకి ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. మరో ఓపెనర్, సూపర్ ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌కు జతయిన వెటరన్ రాబిన్ ఉతప్ప చెలరేగాడు. అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో ఉతప్ప 6, 4, 0, 6, 4తో 20 పరుగులు పిండు కున్నాడు. పవర్ ప్లేలో చెన్నై 59/1 స్కోరు చేసింది. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో ఢిల్లీకి కష్టాలు తప్పలేదు. ఉతప్ప 35 బంతుల్లో అర్ధసెంచరీ (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) పూర్తి చేసుకోగా... చెన్నై 12.1 ఓవర్లలో వంద పరుగులకు చేరుకుంది. 14వ ఓవర్ వేసిన టామ్ కరన్... ఉతప్పను బోల్తా కొట్టించి రెండో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అదే ఓవర్లో శార్దుల్ ఠాకూర్ (0)ను డకౌట్ చేశాడు. మరుసటి ఓవర్లో రాయుడు (1) రనౌటయ్యాడు. 15 ఓవర్లకు చెన్నై స్కోరు 121/4. విజయానికి ఆఖరి 30 బంతుల్లో 52 పరుగులు చేయాలి. 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొన్న రుతురాజ్ జట్టును నడిపించాడు. 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో రుతురాజ్ ఔటవ్వడం చెన్నైని ఆందోళనలో పడేసింది. ఉత్కంఠ పెరిగిన ఈ దశలో ధోని తానే రంగంలోకి దిని లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఆఖరి ఓవర్లో మొయిన్ అలీ (16) ఔటైనా... ఇంకో రెండు బంతులు మిగిలుండగానే ధోని మూడు బౌండరీలతో ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డుప్లెసిస్ (బి) జడేజా 60; ధావన్ (సి) ధోని (బి) హాజల్‌వుడ్ 7; శ్రేయస్ (సి) రుతురాజ్ (బి) హాజల్‌వుడ్ 1; అక్షర్ (సి) సబ్–సాన్‌ట్నర్ (బి) అలీ 10; పంత్ (నాటౌట్) 51; హెట్‌మైర్ (సి) జడేజా (బి) బ్రావో 37; టామ్ కరన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–36, 2–50, 3–77, 4–80, 5–163. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–26–0, హాజల్‌వుడ్ 4–0–29–2, శార్దుల్ 3–0–36–0, జడేజా 3–0–23–1, మొయిన్ అలీ 4–0–27–1, బ్రావో 3–0–31–1. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) అక్షర్ (బి) అవేశ్ ఖాన్ 70; డుప్లెసిస్ (బి) నోర్జే 1; ఉతప్ప (సి) శ్రేయస్ (బి) టామ్ కరన్ 63; శార్దుల్ (సి) శ్రేయస్ (బి) టామ్ కరన్ 0; రాయుడు (రనౌట్) 1; మొయిన్ అలీ (సి) రబడ (బి) టామ్ కరన్ 16; ధోని (నాటౌట్) 18; జడేజా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–3. 2–113, 3–117, 4–119, 5–149, 6–160. బౌలింగ్: నోర్జే 4–0–31–1, అవేశ్ ఖాన్ 4–0– 47–1, రబడ 3–0–23–0, అక్షర్ 3–0–23–0, టామ్ కరన్ 3.4–0–29–3, అశ్విన్ 2–0–19–0. Pure joy of #Yellove 🥺💛#DCvCSK #WhistlePodupic.twitter.com/3esen8fPyz — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 10, 2021 -
DC vs CSK: ‘ఫైనల్’ వేటలో...
గత రెండేళ్లుగా పురోగతి సాధిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం ఈ సారి టైటిలే! 2019లో ప్లే ఆఫ్స్‌కు చేరి మూడో స్థానంలో నిలిచిన జట్టు గతేడాది ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పుడూ ఫైనల్ చేరి ఆపై లక్ష్యాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చెన్నై ప్లే ఆఫ్స్ కొత్త కాదు. మూడు సార్లు చాంపియన్. అయితే గతేడాది లీగ్‌లోనే ని్రష్కమించిన చేదుఅనుభవాన్ని ఈసారి టైటిల్‌తో చెరిపేయాలని చూస్తోంది. ఈ క్రమంలో మొదటి అడుగు ఫైనల్‌పై దృష్టి పెట్టింది. దుబాయ్: ముందుగా ప్లే ఆఫ్స్ చేరుకున్న జట్ల మధ్య ముందుగా ఫైనల్ తేల్చుకునే మ్యాచ్ నేడు జరుగనుంది. ఆదివారం తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు తలపడనుంది. లీగ్ దశలో ఢిల్లీనే టాపర్. ఏ జట్టూ గెలవనన్ని మ్యాచ్‌లు గెలిచింది. క్యాపిటల్స్ జట్టు ఆల్‌రౌండ్ సత్తాతో దూసుకొచి్చంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో నేరుగా ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు చెన్నై టాపార్డర్తోనే నెట్టుకొచి్చంది. అనుభవజ్ఞులకు కొదవలేకపోయినా... ఈ సీజన్లో ఆ ప్రభావం కనిపించలేదు. ఇప్పుడు అసలైన సమరం మొదలు కావడంతో తప్పకుండా ధోని సేన సిసలైన ఆటతీరును ప్రదర్శించడం ఖాయం. కాబట్టి చెన్నై కూడా మరో మ్యాచ్ దాకా వేచి చూడకుండా ఈ విజయంతోనే తుది పోరుకు చేరేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. అక్కడ... ఇక్కడ... ఢిల్లీదే పైచేయి ఈ సీజన్లో ఢిల్లీ దూసుకెళ్తోంది. కోచ్ రికీ పాంటింగ్ ప్రణాళికలు గత రెండు సీజన్లుగా మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. నిలకడైన బ్యాటింగ్, కట్టడి చేసే బౌలింగ్ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తొలి దశ పోటీలు జరిగిన భారత్‌లో, రెండో అంచె జరుగుతున్న యూఏఈలో చెన్నై సూపర్ కింగ్స్‌పై క్యాపిటల్స్‌దే పైచేయి. ముంబైలో చెన్నైని ఓడించిన పంత్ సేన ఇక్కడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఓపెనింగ్‌లో పృథ్వీ షా, శిఖర్ ధావన్ శుభారంభం అందిస్తే... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను మెరుపు వేగంతో చక్కబెట్టేందుకు కెపె్టన్ పంత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఆ తర్వాత స్లాగ్ ఓవర్లలో హెట్‌మైర్, స్టొయినిస్ మెరుపులు జట్టుకు భారీస్కోరును కట్టబెడతాయి. ఇక బౌలింగ్‌లో రబడ, నోర్జేలిద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదకరంగా మారారు. కుర్రాడు అవేశ్ ఖాన్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. స్పిన్నర్లలో అనుభవజు్ఞడైన అశ్విన్, అక్షర్ పటేల్‌లు అవసరమైనపుడు బ్యాట్లతోనూ ఇన్నింగ్స్‌ను నడిపించడం ఢిల్లీకి అదనపు బలం. ఓపెనర్లపైనే భారం మరోవైపు చెన్నై బ్యాటింగ్ బలంతో ముందడుగేసింది. సింహ భాగం మ్యాచ్‌ల్లో జట్టు భారమంతా రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ మోశారు. అడపాదడపా రాయుడు, మొయిన్ అలీ మెరిపిస్తున్నాడు. అనుభవజు్ఞడైన సురేశ్ రైనా వైఫల్యం వల్ల రాబిన్ ఉతప్పకు అవకాశమిచ్చారు. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో మళ్లీ రైనాను తుది జట్టులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ధోని మార్క్ ఇన్నింగ్స్ ఈ సీజన్లో ఇంకా బాకీ ఉంది. ఈ మ్యాచ్‌లో అతని నుంచి ‘విజిల్ పొడు’చే ఇన్నింగ్స్ ఆవిష్కృతమైతే తప్పకుండా చెన్నై అభిమానులకు పండగే! బ్రావో ‘ఎక్స్ట్రా’ల బౌలింగ్ జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా ఇటీవలి మ్యాచ్‌ల్లో బ్రావో ధారాళంగా పరుగులు సమరి్పంచుకోవడంతో పాటు ఎక్స్‌ట్రాల రూపంలో విరివిగా పరుగులు సమరి్పంచుకుంటున్నాడు. శార్దుల్ ఠాకూర్, హాజల్‌వుడ్‌లు ఆరంభ ఓవర్లలో కట్టడి చేయగలిగితే స్పిన్‌తో జడేజా మాయచేసేందుకు అవకాశముంటుంది. ఢిల్లీ ఎంత బలంగా ఉన్నా... మాజీ చాంపియన్ చెన్నై వీరంగం చేస్తే కష్టాలు తప్పవు. జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, హెట్‌మైర్, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబడ, నోర్జే, అవేశ్ ఖాన్. చెన్నై సూపర్‌కింగ్స్: ధోని (కెపె్టన్), రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప/సురేశ్ రైనా, జడేజా, బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, హాజల్‌వుడ్. -
ముంబై వేట.. ఆరో సారి ఫైనల్‌కు
డిఫెండింగ్ చాంపియన్ ముంబై టైటిల్ వేటలో పడితే ఆ ఆట రూటే వేరని మరోసారి నిరూపించింది. తొలి క్వాలిఫయర్‌లో రోహిత్ సేన ఢిల్లీని ఒక ఆటాడుకుంది. కసిదీరా బ్యాట్‌తో, బంతితో వెంటాడింది. విజయంతో ఫైనల్‌కు బాట వేసుకుంది. 13 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఆరోసారి ముంబై ఫైనల్లోకి ప్రవేశించింది. రోహిత్ సేన బ్యాటింగ్‌కు చెల్లాచెదురైన ఢిల్లీ బౌలింగ్... ప్రత్యర్థి బౌలింగ్ మొదలుకాగానే విలవిలలాడింది. అయ్యర్ సేన ఇప్పుడు ఫైనల్ కోసం మరో పోరాటం చేయాల్సి వుంది. దుబాయ్: ముంబై క్వాలిటీ‘ఫైట్’ ముందు ఢిల్లీ భీతిల్లింది. ఐపీఎల్లో అత్యధిక టైటిళ్ల విజేత ముంబై ఇండియన్సే మరో ఫైనల్స్‌కు సిద్ధమైంది. తొలి క్వాలిఫయర్‌లో ఎదురు పడిన ఢిల్లీని చితగ్గొట్టి, పడగొట్టి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్ యాదవ్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు) విధ్వంస రచన చేశాడు. వీరి ప్రతాపానికి అశ్విన్ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. స్టొయినిస్ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బుమ్రా (4/14) పొట్టి ఫార్మాట్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. డికాక్ ధనాధన్‌తో మొదలై... టాస్ నెగ్గిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఆట ధాటిగా మొదలైంది. ఫోర్‌తో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన డికాక్ తొలి ఓవర్లో 3 బౌండరీలు బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ (0) డకౌటయ్యాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్ వేగంగా పరుగులు జతచేశాడు. నోర్జే, రబడా బౌలింగ్‌లను ఇద్దరు అవలీలగా ఎదుర్కొన్నారు. ఫోర్లు, సిక్సర్లతో రన్‌రేట్‌ను అమాంతం పెంచేశారు. సగటున ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సాగిపోతున్న ముంబైకి మళ్లీ అశ్వినే షాకిచ్చాడు. డికాక్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్)ను పెవిలియన్ చేర్చాడు. సూర్య, ఇషాన్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ఆ తర్వాత కూడా 10 ఓవర్ల దాకా ముంబై 93/2 స్కోరుతో పటిష్టంగా ఉంది. కానీ తర్వాత ఓవర్లలో వేగం మారి వికెట్ల పతనం ముంబై జోరును కిందకు దించింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీతో అర్ధసెంచరీ (36 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పూర్తి చేసుకున్నాడు. నోర్జే వేసిన ఈ ఓవర్లో తను మరో షాట్‌కు ప్రయత్నించి లాంగ్ లెగ్‌లో సామ్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 100 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది. ఆ తర్వాతి ఓవర్లో అశ్విన్ మరో దెబ్బ తీశాడు. ప్రమాదకర బ్యాట్స్‌మన్ పొలార్డ్ (0)ను కూడా ఖాతా తెరవనీయలేదు. వచ్చీ రాగానే షాట్ ఆడిన ఈ హిట్టర్... లాంగాన్‌లో రబడ క్యాచ్ పట్టడంతో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో రన్‌రేట్ పూర్తిగా మందగించింది. 11వ ఓవర్ నుంచి 14వ ఓవర్ వరకు ముంబై చేసింది 15 పరుగులే కాగా... విలువైన 2 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ బ్యాట్ ఝళిపించడంతో ముంబై ఇన్నింగ్స్ రాకెట్ వేగం అందుకుంది. రబడా వేసిన 15వ ఓవర్ వరుస బంతుల్లో ఇషాన్ మిడ్‌వికెట్ దిశగా బౌండరీ, డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. నోర్జే వేసిన మరుసటి ఓవర్లో ఇషాన్ 2 ఫోర్లు, కృనాల్ పాండ్యా సిక్సర్ బాదాడు. దీంతో ముంబై ఈ రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టింది. హార్దిక్ సిక్సర్లు కాసేపటికే కృనాల్ (13)ను స్టొయినిస్ ఔట్ చేసినా... సోదరుడు హార్దిక్ పాండ్యా ఆలస్యం చేయకుండానే ఇషాన్ కిషన్‌ను అనుసరించాడు. సామ్స్ 18వ ఓవర్లో ఇద్దరు చెరో సిక్సర్ బాదడంతో 17 పరుగులొచ్చాయి. రబడా 18వ ఓవర్‌ను హార్దిక్ చితగ్గొట్టాడు. తొలి బంతిని లాంగాన్‌లో భారీ సిక్సర్ బాదిన అతను మిడ్‌వికెట్ మీదుగా ఫ్లాట్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లోనూ 18 పరుగులు రావడంతో ముంబై స్కోరు 180కి చేరింది. పాండ్యా ఆఖరి ఓవర్లో నోర్జేను ఆడుకున్నాడు. అతను 2 సిక్సర్లు కొడితే ఇషాన్ కిషన్ మరో సిక్సర్ బాదాడు. దీంతో 20 పరుగులు రావడంతో ముంబై స్కోరు 200 పరుగులకు చేరింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 92 పరుగులు సాధించడం విశేషం. ఢిల్లీ 0, 0, 0... కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ బ్యాటింగ్ మొదలు పెట్టగానే కుదేలైంది. ఓపెనర్లు, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఇలా టాపార్డర్ ఖాతానే తెరువకుండా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన బౌల్ట్ రెండో బంతికి పృథ్వీ షా(0)ను, ఐదో బంతికి రహానే (0)ను డకౌట్ చేశాడు. 0కే 2 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్‌ను బుమ్రా మరో దెబ్బ తీశాడు. ధావన్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. పరుగు చేయకుండానే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఒక్కసారిగా సాగిలపడిపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (12) కూడా ఎక్కువసేపు నిలువకుండా బుమ్రానే పెవిలియన్ చేర్చాడు. రిషబ్ పంత్ (3)ను కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. దీంతో ఢిల్లీ 41 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. స్టొయినిస్ అర్ధసెంచరీ ఇక చేయాల్సిన లక్ష్యానికి జట్టు దూరమైన సమయంలో స్టొయినిస్, అక్షర్ పటేల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు. ఇద్దరు క్రీజులో నిలిచాక ధాటిగా ఆడటం మొదలుపెట్టారు. అక్షర్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ను తలపించేలా ఆడగా... స్టొయినిస్ తన సహజసిద్ధమైన ఆటతో ఆకట్టుకున్నాడు. అతను 36 బంతుల్లో ఫిఫ్టీ (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటక బుమ్రా... స్టొయినిస్ ఆట కట్టించాడు. అద్భుతమైన డెలివరీతో అతని బౌల్డ్ చేశాడు. రెండు బంతుల వ్యవధిలోనే సామ్స్ (0)ను కూడా కీపర్ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. దీంతో అక్షర్ పటేల్ మెరుపులు 20 ఓవర్ల కోటా పూర్తిచేసేందుకు పనికొచ్చాయి. బుమ్రాకు దీటుగా చక్కని స్పెల్ వేసిన బౌల్ట్ (2–1–9– 2) గాయంతో తన కోటా పూర్తిచేయలేకపోయాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) ధావన్ (బి) అశ్విన్ 40; రోహిత్ (ఎల్బీ) (బి) అశ్విన్ 0; సూర్య కుమార్ (సి) స్యామ్స్ (బి) నోర్జే 51; ఇషాన్ కిషన్ (నాటౌట్) 55; పొలార్డ్ (సి) రబడ (బి) అశ్విన్ 0; కృనాల్ (సి) స్యామ్స్ (బి) స్టొయినిస్ 13; హార్దిక్ (నాటౌట్) 37; ఎక్స్ట్రా లు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–16, 2–78, 3–100, 4–101, 5–140. బౌలింగ్: స్యామ్స్ 4–0–44–0, అశ్విన్ 4–0–29–3, రబడ 4–0–42–0, అక్షర్ 3–0–27–0, నోర్జే 4–0–50–1, స్టొయినిస్ 1–0–5–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డికాక్ (బి) బౌల్ట్ 0; ధావన్ (బి) బుమ్రా 0; రహానే (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; శ్రేయస్ (సి) రోహిత్ శర్మ (బి) బుమ్రా 12; స్టొయినిస్ (బి) బుమ్రా 65; పంత్ (సి) సూర్య కుమార్ (బి) కృనాల్ 3; అక్షర్ (సి) చహర్ (బి) పొలార్డ్ 42; స్యామ్స్ (సి) డికాక్ (బి) బుమ్రా 0; రబడ (నాటౌట్) 15; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–0, 4–20, 5–41, 6–112, 7–112, 8–141. బౌలింగ్: బౌల్ట్ 2–1–9–2, బుమ్రా 4–1–14–4, కృనాల్ 4–0–22–1, కూల్టర్‌నైల్ 4–0–27–0, పొలార్డ్ 4–0–36–1, రాహుల్ చహర్ 2–0–35–0. -
ఐపీఎల్ 2020: ఫైనల్ దారిలో...
ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు ఒకవైపు... పుష్కర కాలం ప్రయత్నించినా కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరని జట్టు మరోవైపు... ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ అగ్రస్థానానికి చేరిన జట్టుకు, తడబడుతూనే చివరకు రెండో స్థానంలో నిలవగలిగిన టీమ్‌కు మధ్య కీలక మ్యాచ్... 56 మ్యాచ్‌ల లీగ్ దశ తర్వాత ఐపీఎల్లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. టైటిల్ పోరుకు అర్హత సాధించే తొలి జట్టు ఏదో తేల్చే మ్యాచ్‌లో నేడు ముంబై, ఢిల్లీ తలపడనున్నాయి. గెలిచిన టీమ్ ఫైనల్ చేరితే... ఓడిన జట్టుకు వెంటనే నిష్క్రమించకుండా ఆదివారం రెండో క్వాలిఫయర్‌లో ఆడే మరో అవకాశం మిగిలే ఉంటుంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2020) లీగ్ దశను దాటి ప్లే ఆఫ్స్‌కు చేరింది. నేడు జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకసారి పరాజయం సహా ముంబై జట్టు ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐదుసార్లు ఫైనల్ చేరగా... తొలి సీజన్ నుంచి ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్‌కే పరిమితమైంది. తాజా ఫామ్, బలాబలాలపరంగా చూస్తే ముంబైదే పైచేయిగా కనిపిస్తున్నా... లీగ్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఢిల్లీని కూడా తక్కువగా అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరం ఖాయం. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ప్రదర్శన: సీజన్లో ఢిల్లీ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగింది. 14 లీగ్ మ్యాచ్‌లలో 8 గెలిచి, 6 ఓడింది. అయితే తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి ఊపు మీద కనిపించిన టీమ్ ఒక్కసారిగా తడబడింది. వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైన తర్వాత చివరకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటి ముందంజ వేసింది. బలం: తొలి మ్యాచ్ నుంచి కూడా ఢిల్లీ సమష్టి ప్రదర్శనతోనే నెగ్గింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ప్రధాన ఆటగాళ్లంతా తమ వంతు పాత్ర పోషించారు. 525 పరుగులతో ధావన్ అగ్రస్థానంలో నిలవగా, వేర్వేరు మ్యాచ్‌లలో అయ్యర్, స్టొయినిస్, పంత్ సహకరించారు. బౌలింగ్‌లో రబడ, నోర్జే ప్రదర్శన జట్టుకు విజయాలు అందించాయి. రబడ 25 వికెట్లతో టోర్నీలోనే టాపర్‌గా ఉన్నాడు. అక్షర్ పటేల్ లీగ్‌లో అత్యంత పొదుపైన బౌలర్లలో ఒకడిగా నిలవగా, సీనియర్ అశ్విన్ ఏ రోజైనా తన అనుభవంతో ప్రత్యర్థిని పడగొట్టగలడు. బలహీనత: నాలుగు వరుస పరాజయాలు ఢిల్లీ బ్యాటింగ్ బలహీనతను చూపించాయి. ప్రత్యర్థిపై ఒక్కసారిగా విరుచుకుపడే విధ్వంసక ఆటగాళ్లు జట్టులో లేరు. ముఖ్యంగా టోర్నీ ఆసాంతం ఓపెనింగ్ పేలవంగా సాగింది. పంత్, పృథ్వీ షా అనుకున్న స్థాయిలో ఆడకపోగా, స్టొయినిస్ ఆరంభ మ్యాచ్‌ల తర్వాత వరుస వైఫల్యాలు కొనసాగించాడు. వికెట్లు తీసినా, రబడ బౌలింగ్‌లో భారీగా పరుగులు కూడా వచ్చాయి. రహానే స్ట్రయిక్‌రేట్ మరీ పేలవంగా ఉండటంతో జట్టు అతడిని నమ్మలేని పరిస్థితి. తుది జట్టు (అంచనా): శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, ధావన్, రహానే, పంత్, స్టొయినిస్, అక్షర్, అశ్విన్, స్యామ్స్/హెట్‌మైర్, రబడ, నోర్జే. ముంబై ఇండియన్స్ టోర్నీలో ప్రదర్శన: 14 లీగ్ మ్యాచ్‌లలో 9 గెలిచి, 5 ఓడింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చివరి మ్యాచ్‌లో ఎదురైన పరాజయాన్ని తప్పిస్తే... ముంబై రెండుసార్లు సూపర్ ఓవర్లోనే ఓటమి పాలైంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో కూడా ఆ జట్టు మెరుగైన స్కోర్లే సాధించింది. బలం: పటిష్టమైన బ్యాటింగ్ లైనప్... ప్రధాన ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకొని భారీ స్కోరు అందించగలరు. డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్లపై ప్రధానంగా జట్టు ఆధారపడుతోంది. ఈ ముగ్గురు టోర్నీలో 400కు పైగా పరుగులు సాధించారు. చివర్లో అలవోకగా సిక్సర్లు బాదే పొలార్డ్, హార్దిక్ పాండ్యా చెలరేగిపోతే తిరుగుండదు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌ల ఎనిమిది ఓవర్లను ఎదుర్కోవడం ఎలాంటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. వీరిద్దరిని మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పేయగల సమర్థులు. బుమ్రా 23 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్‌కు 20 వికెట్లు దక్కాయి. బలహీనత: నిజానికి ముంబై జట్టును టోర్నీలో ఇబ్బంది పెట్టిన బలహీనతలు పెద్దగా ఏమీ లేవు. కొన్ని లోపాలు కనిపించినా... ఓవరాల్ ప్రదర్శనతో జట్టు వాటి ప్రభావం కనపడకుండా చేసింది. అయితే రోహిత్ శర్మ ఇప్పటి వరకు తన స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. రోహిత్ ‘టచ్’ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడని, దీనిని తాము అనుకూలంగా మలచుకుంటామని ధావన్ చెప్పడం మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నమే. అన్ని మ్యాచ్‌లు ఆడిన కృనాల్ ఒక్కసారి కూడా ప్రభావం చూపలేకపోయాడు. తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, ప్యాటిన్సన్, రాహుల్ చహర్, బుమ్రా, బౌల్ట్. ముఖాముఖి ఈ సీజన్లో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై జట్టే విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ 162 పరుగులు చేయగా... ముంబై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. గత శనివారం జరిగిన తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ పేలవంగా ఆడి 110 పరుగులు చేయగా, ముంబై 14.2 ఓవర్లలోనే గెలిచింది. రబడ, ధావన్, ఇషాన్ కిషన్, డికాక్, బుమ్రా -
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి
-
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి
కోల్ కతా: ఐపీఎల్ 7 లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ - కోల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్‌కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడటంతో మ్యాచ్ ను రేపటికి వాయిదా వేశారు. ఈడెన్ గార్డెన్ నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. ఈ రోజు ఆట సాధ్యం కాకపోవడంతో ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ నిర్వహిస్తామన్నారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. -
కోల్‌కతాలో ‘కింగ్స్’ నిలిచేనా!
ఐపీఎల్-7 ఆరంభం నుంచి ఒకే తరహా దూకుడుతో అద్భుత ఫలితాలు సాధించిన జట్టు ఒకవైపు...తడబడుతూ ప్రయాణం సాగించినా, పట్టుదలతో పోరాడి దూసుకొచ్చిన జట్టు మరోవైపు... ఒకరికి బ్యాటింగ్ అపార బలమైతే, మరొకరి బౌలింగ్ ప్రత్యర్థులను కట్టి పడేసింది. లీగ్ దశలోనూ సమఉజ్జీలుగా నిలిచిన ఈ రెండు జట్లు మరో కీలక సమరానికి సై అంటున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి ఫైనల్‌పై కన్నేయగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ గతంలో ఒకసారి ఫైనల్ చేరి విజేతగా నిలిచింది. నేడు తొలి క్వాలిఫయర్ - నైట్‌రైడర్స్‌తో పంజాబ్ పోరు - అద్భుత ఫామ్‌లో ఇరు జట్లు - గంభీర్ సేనకు ఈడెన్ అనుకూలత కోల్‌కతా: అనూహ్య మలుపులు తిరుగుతూ, అద్భుత ప్రదర్శనలతో అభిమానులకు ఆకట్టుకున్న ఐపీఎల్-7 తుది దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌ల అనంతరం కీలకమైన తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, కోల్‌కతా జట్లు మంగళవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి. అద్భుతమైన తమ బ్యాటింగ్ లైనప్‌పై కింగ్స్ ఎలెవన్ ఆధార పడుతుండగా... బౌలింగ్‌తోపాటు సొంతగడ్డ బలాన్ని నైట్‌రైడర్స్ నమ్ముకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్ర్కమించదు. శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఈ జట్టు మరోసారి పోటీ పడుతుంది. సూపర్ సీజన్... - ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ అందరికంటే వేగంగా పరుగులు చేసింది. టోర్నీలో ఆ జట్టు రన్‌రేట్ 9.03 కావడం విశేషం. - పంజాబ్ ఆరుసార్లు 190కి పైగా పరుగులు చేసింది. అందులో మూడు సార్లు లక్ష్యఛేదనలోనే కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేస్తూ కింగ్స్ ఎలెవన్ రెండు సార్లు మాత్రం 150కంటే తక్కువ స్కోరు నమోదు చేయగా... ఛేజింగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. - వరుసగా నాలుగు అద్భుత ప్రదర్శనతో టోర్నీలో సంచలనం రేపిన మ్యాక్స్‌వెల్ జోరు గత కొన్ని మ్యాచ్‌లుగా తగ్గడం పంజాబ్‌కు ఆందోళన కలిగించే అంశం. కోల్‌కతాలో ఆడిన రెండు మ్యాచుల్లో అతను 15, 14 పరుగులే చేశాడు. అయితే మిల్లర్, సెహ్వాగ్, బెయిలీ, మానన్ వోహ్రా, వృద్ధిమాన్ సాహాలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. - బౌలింగ్‌లో పేసర్ సందీప్ శర్మ కీలకం కానున్నాడు. అతను తీసిన 17 వికెట్లలో 12 పవర్ ప్లేలో రావడం చూస్తే జట్టుకు శుభారంభం ఇస్తున్నాడని అర్థమవుతోంది. మరో వైపు మిచెల్ జాన్సన్ తన పదునైన బౌలింగ్‌ను ప్రదర్శిస్తే కోల్‌కతాకు కష్టాలు తప్పవు. మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగు... - లీగ్‌లో తొలి 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి ఒక దశలో పేలవంగా కనిపించిన నైట్‌రైడర్స్ ఆ తర్వాత వరుసగా 7 మ్యాచ్‌లు గెలవడం జట్టు ఫామ్‌ను సూచిస్తోంది. - అద్భుత ఫామ్‌తో ‘ఆరెంజ్ క్యాప్’ను అట్టి పెట్టుకున్న రాబిన్ ఉతప్ప వరుసగా 9 ఇన్నింగ్స్‌లలో 40కు పైగా స్కోర్లు చేయడం విశేషం. ఇక గత మ్యాచ్‌లో 22 బంతుల్లో 72 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్‌పైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. అతను మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడితే రైడర్స్ పని సులువవుతుంది. బ్యాటింగ్‌లో గంభీర్‌తో పాటు మనీశ్ పాండే, డస్కటే, షకీబ్, సూర్యకుమార్‌లపై జట్టు ఆధారపడింది. - రెండేళ్ల క్రితం అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాను విజేతగా నిలిపిన సునీల్ నరైన్ ఇప్పుడు మరోసారి జట్టు భారాన్ని మోస్తున్నాడు. అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న అతను పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలడు. మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్ పేస్ భారాన్ని మోస్తుండగా, పిచ్ స్లో బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో షకీబ్, పీయూష్ చావ్లా పాత్ర కూడా కీలకం కానుంది. - ఇక ఈడెన్ గార్డెన్స్‌లో భారీ సంఖ్యలో జట్టుకు అభిమానుల అండ ఉండటం ఇలాంటి కీలక మ్యాచ్‌లో అదనపు బలం కానుంది. - జట్ల వివరాలు (అంచనా): పంజాబ్: బెయిలీ (కెప్టెన్), సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్‌వెల్, మిల్లర్, సాహా, అక్షర్ పటేల్, రిషి ధావన్, శివమ్ శర్మ, సందీప్ శర్మ, మిచెల్ జాన్సన్. - కోల్‌కతా: గంభీర్ (కెప్టెన్), ఉతప్ప, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, డస్కటే, షకీబ్, సూర్య కుమార్, మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్, నరైన్, వినయ్ కుమార్/చావ్లా. మ్యాచ్‌కు వర్షం గండం! క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్‌కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మైదానం నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. వర్షం వస్తూ, పోతూ అవాంతరం కలిగిస్తే కనీసం ఐదేసి ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. పూర్తిగా సాధ్యం కాకపోతే ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకుంటుంది. ‘తుది జట్టును ఎంపిక చేసుకోవడంలో మేం తీసుకుంటున్న జాగ్రత్తలే ఈ విజయాలు అందించాయి. స్థానం దక్కకపోయినా షాన్ మార్ష్లాంటి ఆటగాళ్లు మద్దతుగా నిలిచారు. వ్యూహాల్లో పాలుపంచుకొని పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు’ - సంజయ్ బంగర్ (పంజాబ్ కోచ్) ‘తొలి దశతో పోలిస్తే కుదురుకోవడానికి సమయం తీసుకున్నాం. అయితే యువ ఆటగాళ్లతో పాటు అనుభవం ఉండటంతో మేము సాధించగలమనే నమ్మకం కలిగింది. ఫలితమే ఈ వరుస విజయాలు దక్కాయి’ - యూసుఫ్ పఠాన్, కోల్‌కతా ఆటగాడు