ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు ఒకవైపు... పుష్కర కాలం ప్రయత్నించినా కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరని జట్టు మరోవైపు... ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ అగ్రస్థానానికి చేరిన జట్టుకు, తడబడుతూనే చివరకు రెండో స్థానంలో నిలవగలిగిన టీమ్‌కు మధ్య కీలక మ్యాచ్... 56 మ్యాచ్‌ల లీగ్ దశ తర్వాత ఐపీఎల్‌లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. టైటిల్ పోరుకు అర్హత సాధించే తొలి జట్టు ఏదో తేల్చే మ్యాచ్‌లో నేడు ముంబై, ఢిల్లీ తలపడనున్నాయి. గెలిచిన టీమ్ ఫైనల్ చేరితే... ఓడిన జట్టుకు వెంటనే నిష్క్రమించకుండా ఆదివారం రెండో క్వాలిఫయర్‌లో ఆడే మరో అవకాశం మిగిలే ఉంటుంది.
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2020) లీగ్ దశను దాటి ప్లే ఆఫ్స్‌కు చేరింది. నేడు జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకసారి పరాజయం సహా ముంబై జట్టు ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఐదుసార్లు ఫైనల్ చేరగా... తొలి సీజన్ నుంచి ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్‌కే పరిమితమైంది. తాజా ఫామ్, బలాబలాలపరంగా చూస్తే ముంబైదే పైచేయిగా కనిపిస్తున్నా... లీగ్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఢిల్లీని కూడా తక్కువగా అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరం ఖాయం.
ఢిల్లీ క్యాపిటల్స్
టోర్నీలో ప్రదర్శన: సీజన్‌లో ఢిల్లీ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగింది. 14 లీగ్ మ్యాచ్‌లలో 8 గెలిచి, 6 ఓడింది. అయితే తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి ఊపు మీద కనిపించిన టీమ్ ఒక్కసారిగా తడబడింది. వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైన తర్వాత చివరకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటి ముందంజ వేసింది.
బలం: తొలి మ్యాచ్ నుంచి కూడా ఢిల్లీ సమష్టి ప్రదర్శనతోనే నెగ్గింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ప్రధాన ఆటగాళ్లంతా తమ వంతు పాత్ర పోషించారు. 525 పరుగులతో ధావన్ అగ్రస్థానంలో నిలవగా, వేర్వేరు మ్యాచ్‌లలో అయ్యర్, స్టొయినిస్, పంత్ సహకరించారు. బౌలింగ్‌లో రబడ, నోర్జే ప్రదర్శన జట్టుకు విజయాలు అందించాయి. రబడ 25 వికెట్లతో టోర్నీలోనే టాపర్‌గా ఉన్నాడు. అక్షర్ పటేల్ లీగ్‌లో అత్యంత పొదుపైన బౌలర్లలో ఒకడిగా నిలవగా, సీనియర్ అశ్విన్ ఏ రోజైనా తన అనుభవంతో ప్రత్యర్థిని పడగొట్టగలడు.
బలహీనత: నాలుగు వరుస పరాజయాలు ఢిల్లీ బ్యాటింగ్ బలహీనతను చూపించాయి. ప్రత్యర్థిపై ఒక్కసారిగా విరుచుకుపడే విధ్వంసక ఆటగాళ్లు జట్టులో లేరు. ముఖ్యంగా టోర్నీ ఆసాంతం ఓపెనింగ్ పేలవంగా సాగింది. పంత్, పృథ్వీ షా అనుకున్న స్థాయిలో ఆడకపోగా, స్టొయినిస్ ఆరంభ మ్యాచ్‌ల తర్వాత వరుస వైఫల్యాలు కొనసాగించాడు. వికెట్లు తీసినా, రబడ బౌలింగ్‌లో భారీగా పరుగులు కూడా వచ్చాయి. రహానే స్ట్రయిక్‌రేట్ మరీ పేలవంగా ఉండటంతో జట్టు అతడిని నమ్మలేని పరిస్థితి.
తుది జట్టు (అంచనా):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, ధావన్, రహానే, పంత్, స్టొయినిస్, అక్షర్, అశ్విన్, స్యామ్స్/హెట్‌మైర్, రబడ, నోర్జే.
ముంబై ఇండియన్స్
టోర్నీలో ప్రదర్శన: 14 లీగ్ మ్యాచ్‌లలో 9 గెలిచి, 5 ఓడింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చివరి మ్యాచ్‌లో ఎదురైన పరాజయాన్ని తప్పిస్తే... ముంబై రెండుసార్లు సూపర్ ఓవర్‌లోనే ఓటమి పాలైంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో కూడా ఆ జట్టు మెరుగైన స్కోర్లే సాధించింది.
బలం: పటిష్టమైన బ్యాటింగ్ లైనప్... ప్రధాన ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకొని భారీ స్కోరు అందించగలరు. డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లపై ప్రధానంగా జట్టు ఆధారపడుతోంది. ఈ ముగ్గురు టోర్నీలో 400కు పైగా పరుగులు సాధించారు. చివర్లో అలవోకగా సిక్సర్లు బాదే పొలార్డ్, హార్దిక్ పాండ్యా చెలరేగిపోతే తిరుగుండదు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌ల ఎనిమిది ఓవర్లను ఎదుర్కోవడం ఎలాంటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. వీరిద్దరిని మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పేయగల సమర్థులు. బుమ్రా 23 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్‌కు 20 వికెట్లు దక్కాయి.
బలహీనత: నిజానికి ముంబై జట్టును టోర్నీలో ఇబ్బంది పెట్టిన బలహీనతలు పెద్దగా ఏమీ లేవు. కొన్ని లోపాలు కనిపించినా... ఓవరాల్ ప్రదర్శనతో జట్టు వాటి ప్రభావం కనపడకుండా చేసింది. అయితే రోహిత్ శర్మ ఇప్పటి వరకు తన స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. రోహిత్ ‘టచ్’ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడని, దీనిని తాము అనుకూలంగా మలచుకుంటామని ధావన్ చెప్పడం మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నమే. అన్ని మ్యాచ్‌లు ఆడిన కృనాల్ ఒక్కసారి కూడా ప్రభావం చూపలేకపోయాడు.
తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, ప్యాటిన్సన్, రాహుల్ చహర్, బుమ్రా, బౌల్ట్.
ముఖాముఖి
ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై జట్టే విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ 162 పరుగులు చేయగా... ముంబై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. గత శనివారం జరిగిన తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ పేలవంగా ఆడి 110 పరుగులు చేయగా, ముంబై 14.2 ఓవర్లలోనే గెలిచింది.
రబడ, ధావన్, ఇషాన్ కిషన్, డికాక్, బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment