ఐపీఎల్‌లో ఇది 14వ సీజన్. ఇందులో రెండు సీజన్లు నిషేధంతో చెన్నై బరిలోకే దిగలేదు. అంటే ఆడింది 12 సీజన్లే కానీ తొమ్మిదోసారి ఫైనల్ చేరింది. చెన్నై మళ్లీ సూపర్ కింగ్స్‌లా ఆడింది. ఆఖరి దశకు చేరేకొద్దీ శివాలెత్తే చెన్నై ఇప్పుడు కూడా అదే చేసింది. లీగ్ టాపర్‌ను కొట్టి మరీ తొలి క్వాలిఫయర్‌తోనే ఫైనల్ చేరింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్‌లాగే తొలి క్వాలిఫయర్‌లో ఓడి ఫైనల్లో బెర్త్ కోసం రెండో క్వాలిఫయర్ ఆడేందుకు సిద్ధమైంది.
దుబాయ్: గతేడాది యూఏఈలో చెత్తగా ఆడి లీగ్‌లోనే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఈసారి గొప్పగా ఆడి ఫైనల్ చేరింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రిషభ్ పంత్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కెపె్టన్ ధోని (6 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో చెన్నైను విజయతీరానికి చేర్చాడు.
పృథ్వీ ‘షో’...
పృథ్వీ షా దూకుడుతో ఢిల్లీ చకచకా పరుగులు సాధించింది. హాజల్‌వుడ్ రెండో ఓవర్లో 4, 6 కొట్టిన షా... దీపక్ చహర్ మూడో ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు కొట్టాడు. కానీ ధావన్ (7) నిరాశపరిచాడు. మరోవైపు శార్దుల్ వేసిన ఐదో ఓవర్లో పృథ్వీ రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. 4.5 ఓవర్లలో జట్టు 50 పరుగులు పూర్తయ్యాయి. ఇందులో పృథ్వీ ఒక్కడివే 42 పరుగులు! తర్వాత ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ (1) చెత్తషాట్ ఆడి రుతురాజ్ చేతికి చిక్కాడు. ఈ రెండు వికెట్లు హాజల్‌వుడ్‌కే దక్కాయి. అక్షర్ పటేల్ రాగా... పృథ్వీ 27 బంతుల్లో ఫిఫ్టీ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. కాసేపు ఓపిగ్గా ఆడిన అక్షర్ పటేల్ (10) మొయిన్ అలీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యతి్నంచి డగౌట్ చేరాడు. 10 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 79/3. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాతి ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జడేజా పృథ్వీ ‘షో’కు తెరదించాడు. అనంతరం పంత్, హెట్‌మైర్ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో ఢిల్లీ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
ఉతప్ప, రుతురాజ్ దూకుడు
లక్ష్యఛేదనకు దిగిన చెన్నై తొలి ఓవర్లోనే ఓపెనర్ డుప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయింది. నోర్జే అతన్ని బౌల్డ్ చేశాడు. కానీ ఢిల్లీకి ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. మరో ఓపెనర్, సూపర్ ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌కు జతయిన వెటరన్ రాబిన్ ఉతప్ప చెలరేగాడు. అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో ఉతప్ప 6, 4, 0, 6, 4తో 20 పరుగులు పిండు కున్నాడు. పవర్ ప్లేలో చెన్నై 59/1 స్కోరు చేసింది. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో ఢిల్లీకి కష్టాలు తప్పలేదు. ఉతప్ప 35 బంతుల్లో అర్ధసెంచరీ (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) పూర్తి చేసుకోగా... చెన్నై 12.1 ఓవర్లలో వంద పరుగులకు చేరుకుంది.
14వ ఓవర్ వేసిన టామ్ కరన్... ఉతప్పను బోల్తా కొట్టించి రెండో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అదే ఓవర్లో శార్దుల్ ఠాకూర్ (0)ను డకౌట్ చేశాడు. మరుసటి ఓవర్లో రాయుడు (1) రనౌటయ్యాడు. 15 ఓవర్లకు చెన్నై స్కోరు 121/4. విజయానికి ఆఖరి 30 బంతుల్లో 52 పరుగులు చేయాలి. 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొన్న రుతురాజ్ జట్టును నడిపించాడు. 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో రుతురాజ్ ఔటవ్వడం చెన్నైని ఆందోళనలో పడేసింది. ఉత్కంఠ పెరిగిన ఈ దశలో ధోని తానే రంగంలోకి దిని లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఆఖరి ఓవర్లో మొయిన్ అలీ (16) ఔటైనా... ఇంకో రెండు బంతులు మిగిలుండగానే ధోని మూడు బౌండరీలతో ముగించాడు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డుప్లెసిస్ (బి) జడేజా 60; ధావన్ (సి) ధోని (బి) హాజల్‌వుడ్ 7; శ్రేయస్ (సి) రుతురాజ్ (బి) హాజల్‌వుడ్ 1; అక్షర్ (సి) సబ్–సాన్‌ట్నర్ (బి) అలీ 10; పంత్ (నాటౌట్) 51; హెట్‌మైర్ (సి) జడేజా (బి) బ్రావో 37; టామ్ కరన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1–36, 2–50, 3–77, 4–80, 5–163.
బౌలింగ్: దీపక్ చహర్ 3–0–26–0, హాజల్‌వుడ్ 4–0–29–2, శార్దుల్ 3–0–36–0, జడేజా 3–0–23–1, మొయిన్ అలీ 4–0–27–1, బ్రావో 3–0–31–1.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) అక్షర్ (బి) అవేశ్ ఖాన్ 70; డుప్లెసిస్ (బి) నోర్జే 1; ఉతప్ప (సి) శ్రేయస్ (బి) టామ్ కరన్ 63; శార్దుల్ (సి) శ్రేయస్ (బి) టామ్ కరన్ 0; రాయుడు (రనౌట్) 1; మొయిన్ అలీ (సి) రబడ (బి) టామ్ కరన్ 16; ధోని (నాటౌట్) 18; జడేజా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 173.
వికెట్ల పతనం: 1–3. 2–113, 3–117, 4–119, 5–149, 6–160.
బౌలింగ్: నోర్జే 4–0–31–1, అవేశ్ ఖాన్ 4–0– 47–1, రబడ 3–0–23–0, అక్షర్ 3–0–23–0, టామ్ కరన్ 3.4–0–29–3, అశ్విన్ 2–0–19–0.
Pure joy of #Yellove 🥺💛#DCvCSK #WhistlePodupic.twitter.com/3esen8fPyz
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 10, 2021
Comments
Please login to add a commentAdd a comment