కోల్‌కతాలో ‘కింగ్స్’ నిలిచేనా! | IPL 7 Qualifier: Kolkata Knight Riders vs Kings XI Punjab in Derby Clash | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో ‘కింగ్స్’ నిలిచేనా!

Published Tue, May 27 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

కోల్‌కతాలో ‘కింగ్స్’ నిలిచేనా!

కోల్‌కతాలో ‘కింగ్స్’ నిలిచేనా!

ఐపీఎల్-7 ఆరంభం నుంచి ఒకే తరహా దూకుడుతో అద్భుత ఫలితాలు సాధించిన జట్టు ఒకవైపు...తడబడుతూ ప్రయాణం సాగించినా, పట్టుదలతో పోరాడి దూసుకొచ్చిన జట్టు మరోవైపు... ఒకరికి బ్యాటింగ్ అపార బలమైతే, మరొకరి బౌలింగ్ ప్రత్యర్థులను కట్టి పడేసింది. లీగ్ దశలోనూ సమఉజ్జీలుగా నిలిచిన ఈ రెండు జట్లు మరో కీలక సమరానికి సై అంటున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి ఫైనల్‌పై కన్నేయగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ గతంలో ఒకసారి ఫైనల్ చేరి విజేతగా నిలిచింది.
 
 నేడు తొలి క్వాలిఫయర్
- నైట్‌రైడర్స్‌తో పంజాబ్ పోరు
- అద్భుత ఫామ్‌లో ఇరు జట్లు
- గంభీర్ సేనకు ఈడెన్ అనుకూలత

 
కోల్‌కతా: అనూహ్య మలుపులు తిరుగుతూ, అద్భుత ప్రదర్శనలతో అభిమానులకు ఆకట్టుకున్న ఐపీఎల్-7 తుది దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌ల అనంతరం కీలకమైన తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, కోల్‌కతా జట్లు మంగళవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి.

అద్భుతమైన తమ బ్యాటింగ్ లైనప్‌పై కింగ్స్ ఎలెవన్ ఆధార పడుతుండగా... బౌలింగ్‌తోపాటు సొంతగడ్డ బలాన్ని నైట్‌రైడర్స్ నమ్ముకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్ర్కమించదు. శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఈ జట్టు మరోసారి పోటీ పడుతుంది.

సూపర్ సీజన్...
- ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ అందరికంటే వేగంగా పరుగులు చేసింది. టోర్నీలో ఆ జట్టు రన్‌రేట్ 9.03 కావడం విశేషం.
- పంజాబ్ ఆరుసార్లు 190కి పైగా పరుగులు చేసింది. అందులో మూడు సార్లు లక్ష్యఛేదనలోనే కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేస్తూ కింగ్స్ ఎలెవన్ రెండు సార్లు మాత్రం 150కంటే తక్కువ స్కోరు నమోదు చేయగా... ఛేజింగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
- వరుసగా నాలుగు అద్భుత ప్రదర్శనతో టోర్నీలో సంచలనం రేపిన మ్యాక్స్‌వెల్ జోరు గత కొన్ని మ్యాచ్‌లుగా తగ్గడం పంజాబ్‌కు ఆందోళన కలిగించే అంశం. కోల్‌కతాలో ఆడిన రెండు మ్యాచుల్లో అతను 15, 14 పరుగులే చేశాడు. అయితే మిల్లర్, సెహ్వాగ్, బెయిలీ, మానన్ వోహ్రా, వృద్ధిమాన్ సాహాలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది.
- బౌలింగ్‌లో పేసర్ సందీప్ శర్మ కీలకం కానున్నాడు. అతను తీసిన 17 వికెట్లలో 12 పవర్ ప్లేలో రావడం చూస్తే జట్టుకు శుభారంభం ఇస్తున్నాడని అర్థమవుతోంది. మరో వైపు మిచెల్ జాన్సన్ తన పదునైన బౌలింగ్‌ను ప్రదర్శిస్తే కోల్‌కతాకు కష్టాలు తప్పవు.

మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగు...
- లీగ్‌లో తొలి 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి ఒక దశలో పేలవంగా కనిపించిన నైట్‌రైడర్స్ ఆ తర్వాత వరుసగా 7 మ్యాచ్‌లు గెలవడం జట్టు ఫామ్‌ను సూచిస్తోంది.
- అద్భుత ఫామ్‌తో ‘ఆరెంజ్ క్యాప్’ను అట్టి పెట్టుకున్న రాబిన్ ఉతప్ప వరుసగా 9 ఇన్నింగ్స్‌లలో 40కు పైగా స్కోర్లు చేయడం విశేషం. ఇక గత మ్యాచ్‌లో 22 బంతుల్లో 72 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్‌పైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. అతను మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడితే రైడర్స్ పని సులువవుతుంది. బ్యాటింగ్‌లో  గంభీర్‌తో పాటు మనీశ్ పాండే, డస్కటే, షకీబ్, సూర్యకుమార్‌లపై జట్టు ఆధారపడింది.
- రెండేళ్ల క్రితం అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాను విజేతగా నిలిపిన సునీల్ నరైన్ ఇప్పుడు మరోసారి జట్టు భారాన్ని మోస్తున్నాడు. అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న అతను పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలడు. మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్ పేస్ భారాన్ని మోస్తుండగా, పిచ్ స్లో బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో షకీబ్, పీయూష్ చావ్లా పాత్ర కూడా కీలకం కానుంది.
- ఇక ఈడెన్ గార్డెన్స్‌లో భారీ సంఖ్యలో జట్టుకు అభిమానుల అండ ఉండటం ఇలాంటి కీలక మ్యాచ్‌లో అదనపు బలం కానుంది.
- జట్ల వివరాలు (అంచనా): పంజాబ్: బెయిలీ (కెప్టెన్), సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్‌వెల్, మిల్లర్, సాహా, అక్షర్ పటేల్, రిషి ధావన్, శివమ్ శర్మ, సందీప్ శర్మ, మిచెల్ జాన్సన్.
- కోల్‌కతా: గంభీర్ (కెప్టెన్), ఉతప్ప, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, డస్కటే, షకీబ్, సూర్య కుమార్, మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్, నరైన్, వినయ్ కుమార్/చావ్లా.
 
మ్యాచ్‌కు వర్షం గండం!

క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్‌కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మైదానం నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. వర్షం వస్తూ, పోతూ అవాంతరం కలిగిస్తే కనీసం ఐదేసి ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. పూర్తిగా సాధ్యం కాకపోతే ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకుంటుంది.
 
‘తుది జట్టును ఎంపిక చేసుకోవడంలో మేం తీసుకుంటున్న జాగ్రత్తలే ఈ విజయాలు అందించాయి. స్థానం దక్కకపోయినా షాన్ మార్ష్‌లాంటి ఆటగాళ్లు మద్దతుగా నిలిచారు. వ్యూహాల్లో పాలుపంచుకొని పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు’
 - సంజయ్ బంగర్ (పంజాబ్ కోచ్)
‘తొలి దశతో పోలిస్తే కుదురుకోవడానికి సమయం తీసుకున్నాం. అయితే యువ ఆటగాళ్లతో పాటు అనుభవం ఉండటంతో మేము సాధించగలమనే నమ్మకం కలిగింది. ఫలితమే ఈ వరుస విజయాలు దక్కాయి’     - యూసుఫ్ పఠాన్, కోల్‌కతా ఆటగాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement