IPL -7
-
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి
-
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి
కోల్ కతా: ఐపీఎల్ 7 లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ - కోల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్‌కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడటంతో మ్యాచ్ ను రేపటికి వాయిదా వేశారు. ఈడెన్ గార్డెన్ నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. ఈ రోజు ఆట సాధ్యం కాకపోవడంతో ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ నిర్వహిస్తామన్నారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. -
కోల్‌కతాలో ‘కింగ్స్’ నిలిచేనా!
ఐపీఎల్-7 ఆరంభం నుంచి ఒకే తరహా దూకుడుతో అద్భుత ఫలితాలు సాధించిన జట్టు ఒకవైపు...తడబడుతూ ప్రయాణం సాగించినా, పట్టుదలతో పోరాడి దూసుకొచ్చిన జట్టు మరోవైపు... ఒకరికి బ్యాటింగ్ అపార బలమైతే, మరొకరి బౌలింగ్ ప్రత్యర్థులను కట్టి పడేసింది. లీగ్ దశలోనూ సమఉజ్జీలుగా నిలిచిన ఈ రెండు జట్లు మరో కీలక సమరానికి సై అంటున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి ఫైనల్‌పై కన్నేయగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ గతంలో ఒకసారి ఫైనల్ చేరి విజేతగా నిలిచింది. నేడు తొలి క్వాలిఫయర్ - నైట్‌రైడర్స్‌తో పంజాబ్ పోరు - అద్భుత ఫామ్‌లో ఇరు జట్లు - గంభీర్ సేనకు ఈడెన్ అనుకూలత కోల్‌కతా: అనూహ్య మలుపులు తిరుగుతూ, అద్భుత ప్రదర్శనలతో అభిమానులకు ఆకట్టుకున్న ఐపీఎల్-7 తుది దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌ల అనంతరం కీలకమైన తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, కోల్‌కతా జట్లు మంగళవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి. అద్భుతమైన తమ బ్యాటింగ్ లైనప్‌పై కింగ్స్ ఎలెవన్ ఆధార పడుతుండగా... బౌలింగ్‌తోపాటు సొంతగడ్డ బలాన్ని నైట్‌రైడర్స్ నమ్ముకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్ర్కమించదు. శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఈ జట్టు మరోసారి పోటీ పడుతుంది. సూపర్ సీజన్... - ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ అందరికంటే వేగంగా పరుగులు చేసింది. టోర్నీలో ఆ జట్టు రన్‌రేట్ 9.03 కావడం విశేషం. - పంజాబ్ ఆరుసార్లు 190కి పైగా పరుగులు చేసింది. అందులో మూడు సార్లు లక్ష్యఛేదనలోనే కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేస్తూ కింగ్స్ ఎలెవన్ రెండు సార్లు మాత్రం 150కంటే తక్కువ స్కోరు నమోదు చేయగా... ఛేజింగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. - వరుసగా నాలుగు అద్భుత ప్రదర్శనతో టోర్నీలో సంచలనం రేపిన మ్యాక్స్‌వెల్ జోరు గత కొన్ని మ్యాచ్‌లుగా తగ్గడం పంజాబ్‌కు ఆందోళన కలిగించే అంశం. కోల్‌కతాలో ఆడిన రెండు మ్యాచుల్లో అతను 15, 14 పరుగులే చేశాడు. అయితే మిల్లర్, సెహ్వాగ్, బెయిలీ, మానన్ వోహ్రా, వృద్ధిమాన్ సాహాలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. - బౌలింగ్‌లో పేసర్ సందీప్ శర్మ కీలకం కానున్నాడు. అతను తీసిన 17 వికెట్లలో 12 పవర్ ప్లేలో రావడం చూస్తే జట్టుకు శుభారంభం ఇస్తున్నాడని అర్థమవుతోంది. మరో వైపు మిచెల్ జాన్సన్ తన పదునైన బౌలింగ్‌ను ప్రదర్శిస్తే కోల్‌కతాకు కష్టాలు తప్పవు. మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగు... - లీగ్‌లో తొలి 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి ఒక దశలో పేలవంగా కనిపించిన నైట్‌రైడర్స్ ఆ తర్వాత వరుసగా 7 మ్యాచ్‌లు గెలవడం జట్టు ఫామ్‌ను సూచిస్తోంది. - అద్భుత ఫామ్‌తో ‘ఆరెంజ్ క్యాప్’ను అట్టి పెట్టుకున్న రాబిన్ ఉతప్ప వరుసగా 9 ఇన్నింగ్స్‌లలో 40కు పైగా స్కోర్లు చేయడం విశేషం. ఇక గత మ్యాచ్‌లో 22 బంతుల్లో 72 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్‌పైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. అతను మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడితే రైడర్స్ పని సులువవుతుంది. బ్యాటింగ్‌లో గంభీర్‌తో పాటు మనీశ్ పాండే, డస్కటే, షకీబ్, సూర్యకుమార్‌లపై జట్టు ఆధారపడింది. - రెండేళ్ల క్రితం అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాను విజేతగా నిలిపిన సునీల్ నరైన్ ఇప్పుడు మరోసారి జట్టు భారాన్ని మోస్తున్నాడు. అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న అతను పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలడు. మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్ పేస్ భారాన్ని మోస్తుండగా, పిచ్ స్లో బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో షకీబ్, పీయూష్ చావ్లా పాత్ర కూడా కీలకం కానుంది. - ఇక ఈడెన్ గార్డెన్స్‌లో భారీ సంఖ్యలో జట్టుకు అభిమానుల అండ ఉండటం ఇలాంటి కీలక మ్యాచ్‌లో అదనపు బలం కానుంది. - జట్ల వివరాలు (అంచనా): పంజాబ్: బెయిలీ (కెప్టెన్), సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్‌వెల్, మిల్లర్, సాహా, అక్షర్ పటేల్, రిషి ధావన్, శివమ్ శర్మ, సందీప్ శర్మ, మిచెల్ జాన్సన్. - కోల్‌కతా: గంభీర్ (కెప్టెన్), ఉతప్ప, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, డస్కటే, షకీబ్, సూర్య కుమార్, మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్, నరైన్, వినయ్ కుమార్/చావ్లా. మ్యాచ్‌కు వర్షం గండం! క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్‌కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మైదానం నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. వర్షం వస్తూ, పోతూ అవాంతరం కలిగిస్తే కనీసం ఐదేసి ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. పూర్తిగా సాధ్యం కాకపోతే ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకుంటుంది. ‘తుది జట్టును ఎంపిక చేసుకోవడంలో మేం తీసుకుంటున్న జాగ్రత్తలే ఈ విజయాలు అందించాయి. స్థానం దక్కకపోయినా షాన్ మార్ష్లాంటి ఆటగాళ్లు మద్దతుగా నిలిచారు. వ్యూహాల్లో పాలుపంచుకొని పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు’ - సంజయ్ బంగర్ (పంజాబ్ కోచ్) ‘తొలి దశతో పోలిస్తే కుదురుకోవడానికి సమయం తీసుకున్నాం. అయితే యువ ఆటగాళ్లతో పాటు అనుభవం ఉండటంతో మేము సాధించగలమనే నమ్మకం కలిగింది. ఫలితమే ఈ వరుస విజయాలు దక్కాయి’ - యూసుఫ్ పఠాన్, కోల్‌కతా ఆటగాడు -
ఈ ఒక్కటైనా గెలుస్తారా!
నేడు బెంగళూరుతో హైదరాబాద్ పోరు - ప్రత్యర్థి దూకుడును అడ్డుకునేనా! - ఓడితే కథ ముగిసినట్లే సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై వరుసగా ఓడటం గతంలో డెక్కన్ చార్జర్స్‌కు అలవాటుగా ఉండేది. తొలి సీజన్లో అన్ని మ్యాచ్‌లు ఓడిన ఆ జట్టు ఆ తర్వాత చాన్నాళ్లకు తొలి విజయం నమోదు చేసింది. ఇప్పుడు సన్‌రైజర్స్‌గా మారిన హైదరాబాద్ జట్టు ఈ సారి అదే తరహాలో పరాజయాల బాట పట్టింది. ఉప్పల్‌లోని ఆడిన మూడు మ్యాచ్‌లూ ఓడి అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది. సీజన్లో ఇక్కడ మిగిలిన ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తారా అనేది చూడాలి. పటిష్టమైన బెంగళూరును ఓడిస్తే ఫ్యాన్స్‌కు సంతృప్తి దక్కవచ్చు. ఐపీఎల్లో గత మ్యాచ్ పరాజయంనుంచి కోలుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న హైదరాబాద్, ఈ మ్యాచ్‌లో ఓడితే ఈ ఏడాది లీగ్‌లో ముందంజ వేసే అవకాశానికి తెర పడినట్లే. మరో వైపు రైజర్స్‌ను ఓడిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు ఉండటంతో ఆర్సీబీ గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పేలవ ప్రదర్శన ఐపీఎల్-7లో ఆరంభంనుంచి కూడా ఏ ఒక్క మ్యాచ్‌లోనూ హైదరాబాద్ జట్టు తనదైన ముద్ర వేయలేకపోయింది. బ్యాటింగ్‌లో జట్టు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండు సార్లు భారీ స్కోర్లు నమోదు చేసినా అవి పరాజయానికే పనికొచ్చాయి. వ్యక్తిగతంగా చూస్తే డేవిడ్ వార్నర్ ఒక్కడే టి20 తరహా క్రికెట్ ఆడుతున్నాడు. 4 అర్ధ సెంచరీలు సహా అతను 375 పరుగులు చేశాడు. ఫించ్ రెండు హాఫ్ సెంచరీలు చేసినా ఆ రెండు సార్లూ టీమ్ ఓడింది. స్యామీ కూడా ఒక్క మెరుపు ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక భారత క్రికెటర్లు మాత్రం ఒక్కటీ చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోతున్నారు. కెప్టెన్సీనుంచి తప్పించినా గత మ్యాచ్‌లో ధావన్ బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. బౌలింగ్‌లో భువనేశ్వర్ మెరుగ్గా ఉన్నా...చివరి ఓవర్లలో అతనూ తేలిపోతున్నాడు. జట్టు బలమైన స్టెయిన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం రైజర్స్ కష్టాలు పెంచింది. వ్యక్తిగతంగా, జట్టుగా రైజర్స్ సర్వ శక్తులూ ఒడ్డి అసాధారణ ప్రదర్శన కనబరిస్తేనే విజయావకాశాలు ఉన్నాయి. టాపార్డర్ కీలకం చెన్నైతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గెలుపుతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు కాపాడుకుంది. గత మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లు గేల్, డివిలియర్స్ చక్కటి ఇన్నింగ్స్ ఆడి గెలిపించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కోహ్లి మంచి ఫామ్‌లో లేకపోయినా...యువరాజ్ కూడా నిలదొక్కుకోవడంతో చాలెంజర్స్ పటిష్టంగా కనిపిస్తోంది. వీరందరూ సమష్టిగా రాణిస్తే బెంగళూరుకు భారీ స్కోరుకు అవకాశాలున్నాయి. బౌలింగ్‌లో స్టార్క్, ఆరోన్ మెరుగ్గా రాణిస్తున్నారు. భారత దేశవాళీ క్రికెటర్లలో ఈ సారి చక్కటి గుర్తింపు తెచ్చుకున్న లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. -
రాయల్స్‌కు ముంబై బ్రేక్
పొలార్డ్.. వండర్ క్యాచ్ ముంబై ఆటగాడు పొలార్డ్ ఫీల్డింగ్‌లో అద్భుతం సృష్టించాడు. హర్భజన్ బౌలింగ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ కూపర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద పొలార్డ్ నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. లాంగ్ ఆన్‌లో కూపర్ ఆడిన భారీ షాట్‌కు సిక్సర్ దిశగా అంతెత్తున దూసుకెళ్తున్న బంతిని ఒంటి చేత్తో అందుకున్న పొలార్డ్.. తనను తాను నియంత్రించుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటాడు. అయితే రెండు కాళ్లూ గాల్లో ఉండగానే బంతిని పైకి విసిరి, ఆపై మళ్లీ మైదానంలోకి దూకి బంతిని అందుకున్నాడు. గతంలోనూ పొలార్డ్ ఇలాంటి అద్భుతాలు చేసినా... ఈ మ్యాచ్‌లో పట్టిన క్యాచ్ నమ్మశక్యం కాని రీతిలో ఉంది. - కీలక మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్ - 25 పరుగులతో రోహిత్ సేన అద్భుత విజయం అహ్మదాబాద్: ప్లే ఆఫ్‌కు చేరువయ్యామన్న అతివిశ్వాసమో లేక ఈ సీజన్లో అంతగా రాణించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌ను తక్కువగా అంచనా వేశారో గానీ.. కీలక మ్యాచ్‌లో నలుగురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రాజస్థాన్ తగిన మూల్యం చెల్లించుకుంది. ముంబై చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు ఇప్పటికే ‘తుది నాలుగు’లో ఆశలు దాదాపు అడుగంటిన ముంబై.. ఇక పోయేదేమీ లేదన్నట్లుగా పోరాడి రాజస్థాన్ దూకుడుకు బ్రేక్ వేసింది. సోమవారం ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మైక్ హస్సీ (39 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సిమ్మన్స్ (51 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు అర్ధసెంచరీలతో శుభారంభాన్నివ్వగా... చివర్లో రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో విఫలమైన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ కరుణ్ నాయర్ (24 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టెయిలెండర్లు హాడ్జ్ (30 బంతుల్లో 40; 3 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (21 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు రాణించినా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎట్టకేలకు హస్సీ... ఏడు మ్యాచ్‌ల తరువాత తిరిగి తుదిజట్టులోకి వచ్చిన ముంబై ఓపెనర్ మైక్ హస్సీ సత్తా చాటాడు. సిమ్మన్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులతో అద్భుత ఆరంభాన్నిచ్చాడు. ఈ క్రమంలో పవర్‌ప్లేలో 42 పరుగులు చేసిన ముంబై.. 10 ఓవర్లకు 76 పరుగులు చేసింది. ఆ తరువాత దూకుడు పెంచి అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న హస్సీ, సిమ్మన్స్ ఇద్దరూ ఒకే ఓవర్లో (15వ) అవుటయ్యారు. అయితే ఆ తరువాత పొలార్డ్ సహకారంతో కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. దీంతో చివరి పది ఓవర్లలో 102 పరుగులు రాబట్టుకున్న ముంబై.. రాజస్థాన్‌కు సవాలు విసిరే స్కోరును సాధించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రోహిత్ రనౌటయ్యాడు. వరుస విరామాల్లో వికెట్లు భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ముంబై బౌలర్లు ఆరంభంలోనే ముకుతాడు వేశారు. మూడో ఓవర్లో ఉన్ముక్త్ చంద్ (2)ను అవుట్ చేసిన ప్రజ్ఞాన్ ఓజా.. తన మరుసటి ఓవర్లో వాట్సన్ (5)నూ వెనక్కి పంపాడు. ఆ వెంటనే శామ్సన్ (2)ను సాంటొకీ డగౌట్‌కు చేర్చాడు. అయితే వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు నుంచి కరుణ్ నాయర్ ఏమాత్రం వెరవకుండా ధాటిగా ఆడడంతో పవర్ ప్లేలో 47 పరుగులు వచ్చాయి. హర్భజన్ వేసిన 8వ ఓవర్లో పొలార్డ్ అందుకున్న అద్భుత క్యాచ్‌తో కూపర్ (5) వెనుదిరగడం, ఆపై గోపాల్ తన వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్ మరింత ఇక్కట్లలో పడింది. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగి పోతుండడంతో భారీషాట్‌కు యత్నించి నాయర్ కూడా అవుటయ్యాడు. దీంతో 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాయల్స్.. గెలుపుపై ఆశలు కోల్పోయింది. చివర్లో హాడ్జ్, ఫాల్క్‌నర్‌లు ఎదురుదాడికి దిగి భారీషాట్లు ఆడినా అప్పటికే ఆలస్యమైంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్: మైక్ హస్సీ (సి) కూపర్ (బి) అంకిత్ శర్మ 56; సిమ్మన్స్ (సి) కూపర్ (బి) అంకిత్ శర్మ 62; పొలార్డ్ (నాటౌట్) 14; రోహిత్ శర్మ (రనౌట్) 40; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-120; 2-122; 3-178. బౌలింగ్: అంకిత్ శర్మ 4-0-23-2; కులకర్ణి 4-0-27-0; ఫాల్క్‌నర్ 4-0-47-0; కూపర్ 3-0-27-0; బిన్నీ 1-0-12-0; భాటియా 4-0-39-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: కరుణ్ నాయర్ (సి) సాంటొకీ (బి) హర్భజన్ 48; ఉన్ముక్త్ (సి) హస్సీ (బి) ఓజా 2; వాట్సన్ (సి) రాయుడు (బి) ఓజా 5; శామ్సన్ (సి) రాయుడు (బి) సాంటొకీ 2; కూపర్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 5; అంకిత్ శర్మ (సి) రాయుడు (బి) గోపాల్ 4; బిన్నీ (స్టంప్డ్) తారే (బి) గోపాల్ 2; హాడ్జ్ (సి) రోహిత్ (బి) సాంటొకీ 40; ఫాల్క్‌నర్ (నాటౌట్) 31; భాటియా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-17; 2-38; 3-42; 4-61; 5-66; 6-69; 7-75; 8-144. బౌలింగ్: బుమ్రాహ్ 3-0-23-0; సాంటొకీ 4-0-50-2; ఓజా 4-0-30-2; పొలార్డ్ 1-0-11-0; హర్భజన్ 4-0-13-2; గోపాల్ 4-0-25-2. -
చెన్నై 'చమక్'
పంజాబ్, బెంగళూరు లాంటి రెండు బలమైన జట్లపై నెగ్గి దూకుడు మీద ఉన్న ముంబై ఇండియన్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ నేలకు దించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో వాంఖడే మైదానంలో బోణీ చేసింది. గతంలో ఈ మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన చెన్నై... ఈసారి మాత్రం గెలిచింది. వాంఖడేలో వరుసగా పది విజయాల తర్వాత ముంబై ఓటమిని రుచి చూసింది. * వాంఖడేలో తొలిసారి గెలిచిన సూపర్ కింగ్స్ * ఉత్కంఠ పోరులో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ * రాణించిన డ్వేన్ స్మిత్ * ధోని సూపర్ ఫినిషింగ్ ముంబై: ఐపీఎల్లో హై ప్రొఫైల్ జట్లు చెన్నై, ముంబైల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్కంఠ. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడ్డా ఆఖరి బంతి దాకా పోరాడి నాణ్యమైన వినోదాన్ని అందిస్తాయి. శనివారం కూడా అదే జరిగింది. రెండు జట్లూ చివరి వరకూ పోరాడినా... ధోని సూపర్ ఫినిషింగ్‌తో చెన్నై గట్టెక్కింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనిసేన నాలుగు వికెట్ల తేడాతో రోహిత్ బృందంపై నెగ్గింది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా... ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. రాయుడు (43 బంతుల్లో 59; 2 ఫోర్లు; 4 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన లెండిల్ సిమ్మన్స్ (38 బంతుల్లో 38; 3 ఫోర్లు; 2 సిక్స్) రాణించాడు. చివర్లో అండర్సన్ (6 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్స్) మెరిశాడు. అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డ్వేన్ స్మిత్ (51 బంతుల్లో 57; 5 ఫోర్లు; 3 సిక్స్) మరోమారు తన సత్తా ప్రదర్శించాడు. డు ప్లెసిస్ (24 బంతుల్లో 31; 2 ఫోర్లు; 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో స్టార్ ఫినిషర్ కెప్టెన్ ధోని (12 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) తన మార్కును ప్రదర్శించాడు. ముంబై బౌలర్లలో ప్రవీణ్ కుమార్, మలింగ రెండేసి వికెట్లు తీశారు. చెన్నై ఓపెనర్ డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మెరుపుల్లేవు * ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బద్రీ బౌలింగ్‌లో గౌతమ్ (8 బంతుల్లో 9; 2 ఫోర్లు) అవుటయ్యాడు. అయితే టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ బ్యాట్‌ను ఝుళిపించాడు. బద్రీ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదగా.. వన్‌డౌన్‌లో దిగిన అంబటి రాయుడు కూడా జోరుగా ఆడడంతో స్కోరులో వేగం పెరిగి పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. * అడపాదడపా బౌండరీలు సాధిస్తూ కుదురుకుంటున్న దశలో ఈ జోడిని అశ్విన్ విడదీశాడు. జోరు మీదున్న సిమ్మన్స్ లాంగ్ ఆన్‌లో ఆడిన షాట్‌ను డు ప్లెసిస్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు కెప్టెన్ రోహిత్ (19 బంతుల్లో 19; 1 ఫోర్)తో కలిసి రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 38 బంతుల్లో రాయుడు ఈ సీజన్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. * మెరుపులు లేకుండా నిదానంగా సాగుతున్న ముంబై ఇన్నింగ్స్‌ను 18వ ఓవర్లో అశ్విన్ గట్టి దెబ్బే తీశాడు. రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్లో రైనా ఎడమవైపునకు పరిగెత్తి అద్భుతంగా పట్టగా చివరి బంతికి పొలార్డ్‌ను డకౌట్ చేసి చెన్నై శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికి రాయుడు.. మోహిత్ శర్మ వేసిన స్లోబాల్‌కు దొరికిపోయాడు. చివరి ఓవర్లో అండర్సన్ రెండు సిక్స్‌లతో రెచ్చిపోవడంతో ముంబైకి గౌరవప్రదమైన స్కోరు లభించింది. స్మిత్ జోరు * చెన్నైకి ఓపెనర్ డ్వేన్ స్మిత్ 12 పరుగులతో తొలి ఓవర్లోనే దూకుడైన ఆరంభాన్నిచ్చాడు. అటు నాలుగో ఓవర్లో వరుసగా 6, 4 బాదిన మెకల్లమ్‌ను మరుసటి ఓవర్లో ప్రవీణ్ ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ తర్వాత రైనా, స్మిత్ భారీ షాట్లకు వెళ్లకపోవడంతో తొలి పవర్‌ప్లేలో చెన్నై 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. * ఈ దశలో రైనా స్టంప్ అవుట్ అయ్యాడు. రీప్లేలో అనేకమార్లు చూసిన థర్డ్ అంపైర్ చివరకు అవుట్‌గా ప్రకటించారు. జోరు పెంచిన స్మిత్... పొలార్డ్ వేసిన పదో ఓవర్లో 4, 4, 6తో రెచ్చిపోయాడు. ఇదే ఊపులో 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన అనంతరం.... సిక్స్ బాదినా ఆ వెంటనే ప్రవీణ్ బౌలింగ్‌లో సిమ్మన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. * 19 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో క్రీజులో కుదురుకున్న డు ప్లెసిస్‌ను మలింగ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్ (19వ)లో జడేజా (7 బంతుల్లో 6; 1 ఫోర్)ను కూడా బౌల్డ్ చేయడంతో పాటు మన్హాస్ రనౌట్ కావడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సిన దశలో కెప్టెన్ ధోని ఓ సిక్స్, ఫోర్ బాది విజయాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) డు ప్లెసిస్ (బి) అశ్విన్ 38; గౌతమ్ (సి) మెకల్లమ్ (బి) బద్రీ 9; రాయుడు (సి) జడేజా (బి) మోహిత్ 59; రోహిత్ (సి) రైనా (బి) అశ్విన్ 19; పొలార్డ్ (సి) రైనా (బి) అశ్విన్ 0; అండర్సన్ నాటౌట్ 18; తారే (సి) డు ప్లెసిస్ (బి) పాండే 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-16; 2-77; 3-122; 4-129; 5-129; 6-157. బౌలింగ్: బద్రీ 4-0-34-1; పాండే 4-0-34-1; జడేజా 4-0-33-0; మోహిత్ 4-0-26-1; అశ్విన్ 4-0-30-3. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) సిమ్మన్స్ (బి) ప్రవీణ్ 57; మెకల్లమ్ ఎల్బీడబ్ల్యు (బి) ప్రవీణ్ 13; రైనా (స్టంప్డ్) గౌతమ్ (బి) పొలార్డ్ 19; డు ప్లెసిస్ (బి) మలింగ 31; ధోని నాటౌట్ 22; జడేజా (బి) మలింగ 6; మన్హాస్ (రనౌట్) 1; అశ్విన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1-29; 2-56; 3-119; 4-129; 5-146; 6-147. బౌలింగ్: ప్రవీణ్ 4-0-31-2; మలింగ 4-0-15-2; బుమ్రా 4-0-33-0; హర్భజన్ 4-0-22-0; పొలార్డ్ 2.3-0-42-1; అండర్సన్ 1-0-11-0. -
చెన్నై సూపర్ ‘సిక్స్’
మళ్లీ అదే పునరావృతం... ఓపెనర్ స్మిత్ అద్భుత ఇన్నింగ్స్...సూపర్ కింగ్స్ గెలుపు...ఐపీఎల్లో తమకు అలవాటైన రీతిలో ధోని బృందం మరో అలవోక విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ఆ జట్టు ముందు అది చిన్నదైపోయింది. ఫలితంగా సొంత గడ్డపై డేర్‌డెవిల్స్‌కు వరుసగా రెండో పరాజయం తప్పలేదు. ఈ సీజన్లో చెన్నైకి ఇది వరుసగా ఆరో విజయం. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీపై కూడా ఇది వరుసగా ఆరో గెలుపు కావడం విశేషం. - ధోనిసేన ఖాతాలో మరో విజయం - 8 వికెట్లతో ఢిల్లీపై గెలుపు - చెలరేగిన స్మిత్, రైనా న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించి జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (51 బంతుల్లో 79; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), రైనా (27 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైని గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 44 బంతుల్లోనే 86 పరుగులు జోడించడం విశేషం. స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చెలరేగిన కార్తీక్ ఓపెనర్లు విజయ్ (30 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), డి కాక్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించి ఢిల్లీ జట్టుకు శుభారంభం అందించారు. అయితే అనవసరపు పరుగుకు ప్రయత్నించి డి కాక్ రనౌట్ కాగా, మోహిత్ బౌలింగ్‌లో కెప్టెన్ పీటర్సన్ (0) తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే దినేశ్ కార్తీక్ ఆరంభంనుంచి చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ వేగం పెంచాడు. ముఖ్యంగా మోహిత్, జడేజాల బౌలింగ్‌లో చెలరేగిన అతను 35 బంతుల్లో టోర్నీలో రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తక్కువ వ్యవధిలోనే కార్తీక్‌తో పాటు శుక్లా, విజయ్ వెనుదిరిగారు. ఈ దశలో డుమిని (17 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు), కేదార్ జాదవ్ (18 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించారు. మోహిత్ వేసిన 18వ ఓవర్లో డుమిని వరుసగా 4 ఫోర్లు కొట్టగా, 20వ ఓవర్లో జాదవ్ వరుసగా 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో విరుచుకు పడ్డాడు. ఆఖరి 5 ఓవర్లలో ఢిల్లీ 56 పరుగులు చేసింది. మెరుపు ఆరంభం... ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ (35 బంతుల్లో 32; 5 ఫోర్లు) మరోసారి దూకుడు ప్రదర్శించారు. ఉనాద్కట్ వేసిన నాలుగో ఓవర్లో స్మిత్ వరుసగా 3 సిక్సర్లు బాదడంతో చెన్నై పవర్‌ప్లేలో 49 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం మెకల్లమ్ వెనుదిరిగాడు.మరో వైపు స్మిత్ జోరు మాత్రం తగ్గలేదు. భారీ సిక్సర్లతో చెలరేగిన అతను 38 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సీజన్లో అతనికి ఇది నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. స్మిత్‌కు రైనా జత కలిసిన తర్వాత సూపర్ కింగ్స్ మరింత వేగంగా లక్ష్యం వైపు దూసుకుపోయింది. చివర్లో స్మిత్ అవుటైనా, ధోని (12 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (రనౌట్) 24; విజయ్ (సి) డు ప్లెసిస్ (బి) జడేజా 35; పీటర్సన్ (బి) మోహిత్ 0; కార్తీక్ (సి) మోహిత్ (బి) హిల్ఫెన్హాస్ 51; శుక్లా (సి) పాండే (బి) అశ్విన్ 0; డుమిని (నాటౌట్) 28; జాదవ్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-36; 2-37; 3-108; 4-119; 5-120. బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-34-1; పాండే 3-1-26-0; మోహిత్ 4-0-51-1; జడేజా 4-0-23-1; అశ్విన్ 4-0-29-1; స్మిత్ 1-0-9-0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) విజయ్ (బి) పార్నెల్ 79; మెకల్లమ్ (సి) విజయ్ (బి) శుక్లా 32; రైనా (నాటౌట్) 47; ధోని (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో 2 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1-82; 2-168. బౌలింగ్: షమీ 4-0-42-0; పార్నెల్ 4-0-25-1; ఉనాద్కట్ 3.4-0- 47-0; నదీమ్ 4-0-27-0; శుక్లా 4-0-31-1. -
రస్సెల్ రైటా? రాంగా?
రాజస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వాట్సన్ బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ రస్సెల్ పరిగెడుతూ వచ్చి ఆగిపోయినట్లుగా కనిపించి, మళ్లీ బంతి వేశాడు. రస్సెల్ ఆగాడని అనుకుని వాట్సన్ ఆడకుండా బంతిని వదిలేశాడు. మామూలుగా అయితే దీనిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి. ఇదే విషయం వాట్సన్ అంపైర్‌ను అడిగాడు కూడా. అయితే తన వెనక బౌలర్ ఏం చేశాడో తనకు తెలియదని చెప్పిన అంపైర్ బంతిని లెక్కించారు. రస్సెల్ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్దమనే విమర్శలు వచ్చాయి. దీనిపై విపరీతమైన చర్చ జరిగింది. ‘బ్యాట్స్‌మెన్ స్విచ్ హిట్లు కొడుతున్నప్పుడు, బౌలర్ కూడా అలాంటి ప్రయోగం చేస్తే తప్పేంటి? క్రికెట్లో బౌలర్లు మాత్రం ప్రయోగాలు చేయకూడదా? బ్యాట్స్‌మన్‌ను అయోమయంలో పడేయటానికి ఇదో కొత్త పంథా’ అనే వ్యాఖ్య కూడా వినిపించింది. రస్సెల్ చేసింది రైటా? రాంగా? అనే అంశంపై క్రికెట్ పండితులు రెండుగా విడిపోయారు. -
ముంబై రాత మారేనా!
ముంబై: ఒక జట్టేమో వరుసగా ఐదు విజయాలతో ఊపు మీదుంది. మరో జట్టేమో సరిగ్గా వ్యతిరేకంగా ఐదు పరాజయాలు సాధించి అట్టడుగున నిలిచింది. ఇప్పుడు ఈ రెండు టీమ్‌లు ఐపీఎల్-7లో తొలిసారి ప్రత్యర్థులుగా తలపడనున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య శనివారం ఈ కీలక పోరు జరగనుంది. బోణీ చేస్తుందా... తొలి ఐపీఎల్లో మాత్రమే ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా తొలి నాలుగు మ్యాచుల్లో ఓడింది. అయితే ఈ సారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆ టీమ్ తమ చెత్త రికార్డు మరింత సవరిస్తూ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి మూటగట్టుకుంది. యూఏఈలో జరిగిన తొలి దశనుంచి రిక్త హస్తాలతో వెనుదిరిగిన ముంబై, స్వదేశంలోనైనా ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. సొంత గడ్డపై ముంబైలో ఈ మ్యాచ్ ఆడనుండటం జట్టుకు అనుకూలాంశం. ‘తప్పులు పునరావృతం చేడయమే మా పరాజయాలకు కారణం. రెండో దశను కొత్త ఆరంభంగా భావిస్తున్నాం. వాటిని సరిదిద్దుకుంటాం. ముంబై పిచ్‌పై అవగాహన ఉంది. గత ఏడాది ఇక్కడ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లూ గెలిచిన రికార్డు మాకుంది’ అని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. సచిన్ లేని లోటు తెలుస్తోందని, అయితే దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదన్న రోహిత్ శర్మ...యూఏఈ గడ్డపై తమ జట్టు పరాజయాలకు సాకులు చెప్పనని అన్నాడు. జోరు మీదున్న టీమ్... పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ ఇప్పుడు భారత్‌లోనూ తమ జోరు కొనసాగించాలని భావిస్తోంది. అయితే టి20ల్లో ప్రతీ మ్యాచ్ నెగ్గడం అంత సులువు కాదని జట్టు కెప్టెన్ జార్జ్ బెయిలీ అభిప్రాయ పడ్డాడు. ‘ఇంత మంచి స్థితిలో భారత్‌లో మ్యాచ్‌లు ప్రారంభించడం సంతోషకరం. అయితే ఇదే ఊపును కొనసాగించాల్సిన ఒత్తిడి మాపై ఉంది. కొన్ని సార్లు ఒక్క ఇన్నింగ్స్ మాకు విజయాన్ని దూరం చేయవచ్చు. కాబట్టి అలసత్వం రానీకుండా జాగ్రత్త పడతాం’ అని బెయిలీ అన్నాడు. వేలంలో పలికిన మొత్తాన్ని బట్టి ఆటగాళ్ల విలువను లెక్కించడం సరైంది కాదన్న బెయిలీ...సహచరుడు మ్యాక్స్‌వెల్ మిగిలిన సీజన్లో మరింతగా శ్రమించాల్సి ఉంటుందన్నాడు. -
అరేబియన్ నైట్స్... సూపర్ హిట్
యూఏఈలో ఐపీఎల్ విజయవంతం అన్ని వేదికల్లో అభిమానుల ఆదరణ ఆసక్తికర మ్యాచ్‌లకూ కొదవ లేదు యూఏఈలో జరిగిన ఐపీఎల్-7 తొలి దశ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సక్సెస్...సూపర్ హిట్... టోర్నీ ప్రారంభానికి ముందు ఉన్న అన్ని విఘ్నాలను దాటి ఈ ఏడాది లీగ్ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. ప్రేక్షకుల ఆదరణ మొదలు ఆటగాళ్ల చక్కటి ప్రదర్శన, వివాదరహితంగా నిలపడం వరకు అన్ని చోట్లా ఐపీఎల్‌కు ఫుల్ మార్కులు పడ్డాయి. ప్రత్యామ్నాయ వేదికగా ఎంపికైన అరబ్ దేశం లీగ్‌ను సమర్థంగా నిర్వహించి తమ ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇప్పుడు ఐపీఎల్ భారత్‌లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తొలి దశ ఐపీఎల్‌పై విశ్లేషణ... యూఏఈలో అడుగు పెట్టే సమయానికి ఐపీఎల్ గత ఏడాది వివాదాల బ్యాగేజిని కూడా మోసుకొచ్చింది. ముఖ్యంగా ఫిక్సింగ్‌కు అడ్డాగా గుర్తింపు తెచ్చుకున్న షార్జా లాంటి చోట్ల మ్యాచ్‌ల నిర్వహణ కత్తి మీద సాము అని తెలిసి కూడా బీసీసీఐ ధైర్యం చేసింది. తమ పరిధిలో అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మైదానం లోపల, బయట బుకీలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చింది. యూఏఈ క్రికెట్ బోర్డుతో పాటు అక్కడి ప్రభుత్వం కూడా అందుకు సహకరించింది. ఫలితంగా 20 మ్యాచ్‌లు జరిగినా...కనీసం చిన్నపాటి వివాదం, వార్త రాకపోవడం విశేషం. పంజాబ్ హవా జట్ల ప్రదర్శనను బట్టి చూస్తే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తిరుగు లేని ఆటను కనబర్చింది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ నెగ్గి అగ్రస్థానంతో స్వదేశం వచ్చింది. చెన్నై కూడా తొలి మ్యాచ్‌లో ఓడినా ఆ తర్వాత సాధికారిక విజయాలు సాధించింది. మరో వైపు డబ్బుకు తగిన విలువ...అనే సామెతకు బెంగళూరు జట్టు కొత్త అర్థం చెప్పింది. డబ్బులు తీసుకున్న బ్యాట్స్మెనేమో విఫలం కాగా... తక్కువ విలువ దక్కిన బౌలర్లు ఆ జట్టులో రాణించారు. ఫలింతగా ఈ స్టార్ జట్టు చెత్త ప్రదర్శన కనబర్చింది. ఇక పరాజయాల్లో ఢిల్లీ, కోల్‌కతా పోటీ పడగా, సన్‌రైజర్స్ కూడా వేడిలో విజయం కోసం విలవిల్లాడింది. అయితే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ పరిస్థితి మాత్రం మరీ ఘోరం. ఎడారిలో చుక్క నీటిని పొందేందుకు ఒయాసిస్సు కోసం వెతికినట్లుగా ఆ జట్టు అష్ట కష్టాలు పడ్డా ఖాతా తెరవలేకపోయింది. రాజస్థాన్ జట్టు సూపర్ ఓవర్ టై అయిన మ్యాచ్‌లో కోల్‌కతాపై నెగ్గడం ద్వారా సంతృప్తికరంగా భారత్‌కు వచ్చింది. అంతా సమానమే... యూఏఈలో జరిగిన ఐపీఎల్లో కనిపించిన ఒక ప్రధాన అంశం బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరాటం సాగడం. టి20 అంటే బ్యాట్స్‌మెన్ ఆట మాత్రమే అనుకునే వారికి ఇక్కడ తేడా స్పష్టంగా కనిపించింది. ఇక్కడి పిచ్‌లు స్వభావరీత్యా భారత్‌ను పోలి ఉన్నాయని వినిపించినా...వాస్తవానికి అవి ఇండియా పిచ్‌ల తరహాలో స్పందించలేదు. ఏకపక్షంగా బౌలర్లపై విరుచుకు పడి బ్యాట్స్‌మెన్ రికార్డులతో హోరెత్తించలేదు. భారీ హిట్టింగ్ చేయగల బ్యాట్స్‌మెన్ ఉన్నా కూడా జట్లు టి20ల్లో సాధారణంగా కనిపించే స్కోర్లకే పరిమితమయ్యాయి. చక్కటి నైపుణ్యం గల బౌలర్లు కాస్త తెలివిని జోడించి ప్రత్యర్థులను బోల్తా కొట్టించగలిగారు. ఎవరూ ధారాళంగా పరుగులు సమర్పించుకోలేదు. 40 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే 200 స్కోర్లు వచ్చాయి. అదే బౌలింగ్‌లో మాత్రం ఎన్నో చక్కటి ప్రదర్శనలు వచ్చాయి. ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు ఆరు సార్లు, 3 వికెట్లు 7 సార్లు పడగొట్టగా...బ్యాటింగ్‌లో 27 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. ఒక్క సెంచరీ కూడా బ్యాట్స్‌మెన్ నుంచి రాలేదు. ఆతిథ్యం బాగుంది క్రికెటర్ల కోణంలో చూస్తే ఈ కొత్త వేదికలో అభిమానుల ముందు ఆడటం, ఆదరణ వంటివాటిపై వారికి పెద్దగా అంచనాలు లేవు. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు మినహా గత దశాబ్దన్నరగా యూఏఈలో పెద్దగా క్రికెట్ ఆడని దేశాల ఆటగాళ్లు ఏ మాత్రం సర్దుకుపోతారో అని అనిపించింది. కానీ అక్కడి అభిమానుల ఆసక్తి క్రికెటర్ల ఉత్సాహాన్ని పెంచింది. భారత్, పాక్, శ్రీలంక తదితర ఆసియా దేశాలకు చెందిన అభిమానులతో పాటు స్థానిక ప్రేక్షకులు ప్రతీ మ్యాచ్‌కు పోటెత్తారు. షార్జా, దుబాయ్, అబుదాబిలు ఏ దశలోనూ పరాయి వేదికల్లాగా, తాత్కాలిక మైదానాల్లాగా కనిపించలేదు. యూఏఈ మంత్రి షేక్ నహయన్ మ్యాచ్‌లకు సంబంధించిన ఏర్పాట్లు చూశారు. ఆయన కూడా స్వయంగా అన్ని మ్యాచ్‌లకు వచ్చారు. వీరే హీరోలు తొలి దశను పండగలా మార్చుకున్న క్రికెటర్లు ఇప్పుడు అదే ఉత్సాహంతో ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా బాగా ఆడిన బ్యాట్స్‌మెన్ జాబితాలో విదేశీయులు ఎక్కువ మంది ఉండగా, బౌలింగ్‌లో మాత్రం భారతీయలే ఎక్కువ ప్రభావం చూపించగలిగారు. అత్యధిక పరుగుల జాబితాలో మ్యాక్స్‌వెల్ (300), డ్వేన్ స్మిత్ (240), బ్రెండన్ మెకల్లమ్ (193) సహా టాప్-10లో ఏడుగురు విదేశీయులే ఉన్నారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ తన తొలి మూడు ఇన్నింగ్స్‌లలో 95, 89. 95 పరుగులు చేయడం విశేషం. బౌలింగ్‌లో నరైన్ 9 వికెట్లు తీయగా, ఆరోన్, మోహిత్, బాలాజీ 8 చొప్పున వికెట్లు పడగొట్టారు. బౌలింగ్ ప్రదర్శనలు చూస్తే...బాలాజీ (4/13), మోహిత్ శర్మ (4/14), నరైన్ (4/20), తాంబే (4/20), మలింగ (4/23), జడేజా (4/33) ప్రదర్శనలు హైలైట్‌గా నిలిచాయి. సీనియర్లను మినహాయిస్తే మనీశ్ పాండే, సందీప్ శర్మ, యజువేంద్ర చహల్ ఆకట్టుకున్నారు. అయితే భారీ మొత్తాల బరువు నెత్తిన మోస్తున్న యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్‌లాంటి వాళ్లు మాత్రం తగిన న్యాయం చేయలేకపోయారు. ఇక మెరుపు వీరుడు గేల్ విన్యాసాలు చూసే అవకాశం పెద్దగా రాలేదు. మరి భారత్‌లో అతను ఏమైనా చెలరేగుతాడేమో చూడాలి. ఇక ఆరు ఐపీఎల్లలోనూ చూడని కొత్త ఫలితం ఈ సారి కనిపించింది. కోల్‌కతా-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ టై కాగా, అనంతరం సూపర్ ఓవర్ కూడా టై కావడం ఈ సారి విశేషంగా చెప్పవచ్చు. -
కోల్‌కతాపై రాజస్థాన్ 'బౌండరీ' విక్టరీ
అబుదాబి: ఐపీఎల్ 7లో అత్యంత ఉత్కంతభరితంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ విజయం సాధించింది. మ్యాచ్ టై అవడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడించారు. అయితే సూపర్ ఓవర్ కూడా టై గా ముగియడంతో బౌండరీ కౌంట్ ద్వారా రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులే చేసింది. అయితే మొత్తం మ్యాచ్‌లో రాజస్థాన్ 17 బౌండరీలు కొట్టగా, కోల్‌కతా 12 బౌండరీ సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రహానే అర్థ సెంచరీ(72)తో రాణించాడు. వాట్సన్ 33, శామస్సన్ 20, స్మిత్ 19 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులే చేసింది. గంభీర్(45) తొలిసారి రాణించినా కోల్‌కతాకు విజయం దక్కలేదు. -
ఎదురులేని ‘కింగ్స్’
ఐపీఎల్-7లో పంజాబ్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. తొలి మూడు మ్యాచ్‌లను బ్యాట్స్‌మెన్ గెలిపిస్తే... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు చెలరేగారు. వెరసి దుబాయ్‌లో తొలి విడత టోర్నీలో భాగంగా తాము ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి... అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా సగర్వంగా భారత్‌లో అడుగుపెడుతోంది. - పంజాబ్ ఖాతాలో వరుసగా ఐదో విజయం - బెంగళూరుపై ఐదు వికెట్లతో గెలుపు దుబాయ్: గేల్, కోహ్లి, డివిలియర్స్, యువరాజ్, ఆల్బీమోర్కెల్... ఇంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు ఏదో ఒక మ్యాచ్‌లో విఫలమైతే తడబాటు అనుకోవచ్చు. కానీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పోటీపడి బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కడితే..? బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌పై పేలవంగా అవుటైతే..? ఫలితాన్ని ఊహించడం కష్టమేం కాదు. సోమవారం కూడా అదే జరిగింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అత్యంత ఘోరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఖాతాలో హ్యాట్రిక్ ఓటమిని చేర్చుకుంది. సందీప్ శర్మ (3/15) అద్భుతమైన బౌలింగ్‌తో... బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా... బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేసింది. గేల్ (7 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (4), పార్థివ్ (2)ల వికెట్లతో టాప్ ఆర్డర్‌ను కూల్చి సందీప్ ఆరంభంలోనే చాలెంజర్స్‌ను దెబ్బతీయగా... జాన్సన్ (2/19), రిషి ధావన్ (2/14)లు రెండేసి వికెట్లతో చెలరేగారు. 35 పరుగులతో యువరాజ్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులతో ఛేదించింది. మ్యాక్స్‌వెల్ (6) విఫలమైనా... సెహ్వాగ్ (26 బంతుల్లో 32, 4 ఫోర్లు), మిల్లర్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు), చివర్లో రిషి ధావన్ (22 బంతుల్లో 23 నాటౌట్)లు సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు. సందీప్‌శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఒక్క ఓవర్ మెరుపులు సీజన్లో తొలిసారిగా బరిలోకి దిగిన క్రిస్ గేల్ క్రీజులోకి అడుగు పెడుతూనే చెలరేగిపోయాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఏకంగా 20 పరుగులు బాదాడు. కానీ రెండో ఓవర్లో సందీప్.. గేల్‌తో పాటు కోహ్లిని కూడా అవుట్ చేశాడు. ఇదే జోరులో పార్థీవ్నూ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడింది. యువరాజ్, డివిలియర్స్, ఆల్బీ మోర్కెల్ కొద్దిసేపు పోరాడినా బాధ్యతగా ఆడలేదు. దీంతో బెంగళూరు చాలా తక్కువ స్కోరు చేసింది. చివరి ఏడు ఓవర్లలో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా బౌండరీ కొట్టకపోవడం విశేషం. బాధ్యతాయుతంగా సెహ్వాగ్ స్టార్క్ రెండు సంచలన క్యాచ్‌లు అందుకోవడంతో పాటు బెంగళూరు బౌలర్లు నిలకడగా బంతులు వేయడంతో పంజాబ్ కూడా తడబడింది. 40 పరుగులకే మ్యాక్స్‌వెల్‌తో సహా మూడు వికెట్లు కోల్పోయింది. అయితే సెహ్వాగ్ బాధ్యతాయుతంగా ఆడాడు. మిల్లర్‌తో కలిసి కీలక భాగస్వామ్యంతో జట్టును సరైన దిశలో నడిపించాడు. కానీ ఒకే ఓవర్లో మిల్లర్, వీరూ అవుట్ కావడంతో మ్యాచ్‌లో ఆసక్తి పెరిగింది. కానీ కెప్టెన్ బెయిలీ, ఆల్‌రౌండర్ రిషీ ధావన్ కలిసి జాగ్రత్తగా ఆడి విజయాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) సందీప్ శర్మ 20, పార్థివ్ (సి) సాహా (బి) సందీప్ శర్మ 2, కోహ్లి ఎల్బీడబ్ల్యూ (బి) సందీప్ శర్మ 4, తకవాలే (సి) సాహా (బి) జాన్సన్ 0, డివిలియర్స్ (సి) మాక్స్వెల్ (బి) రిషి ధావన్ 17, యువరాజ్ (సి) మిల్లర్ (బి) రిషి ధావన్ 35, ఆల్బీ మోర్కెల్ (బి) బాలాజీ 15, స్టార్క్ (బి) జాన్సన్ 8, ఆరోన్ నాటౌట్ 11, దిండా నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1-21, 2-25, 3-26, 4-26, 5-67, 6-93, 7-97, 8-120. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 3-0-39-0, సందీప్ శర్మ 3-1-15-3, జాన్సన్ 4-0-19-2, బాలాజీ 4-0-17-1, పటేల్ 2-0-11-0, రిషి ధావన్ 4-0-14-2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: పుజారా (సి) పార్థివ్ (బి) దిండా 10, సెహ్వాగ్ (సి) పార్థివ్ (బి) చహల్ 32, సాహా (సి) స్టార్క్ (బి) ఆరోన్ 2, మ్యాక్స్‌వెల్ (సి) స్టార్క్ (బి) ఆరోన్ 6, మిల్లర్ (సి) పార్థివ్ (బి) చహల్ 26, బెయిలీ నాటౌట్ 16, రిషి ధావన్ నాటౌట్ 23, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం: (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 127.వికెట్ల పతనం: 1-22, 2-33, 3-40, 4-85, 5-88. బౌలింగ్: స్టార్క్ 4-0-15-0, మోర్కెల్ 2-0-24-0, ఆరోన్ 3.5-0-29-2, దిండా 3-0-19-1, చహల్ 4-0-23-2, యువరాజ్ 2-0-13-0. -
జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’
క్రీడలు మొదలైన ఐపీఎల్ -7 దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-7 పోటీలు ఏప్రిల్ 16న ప్రారంభమయ్యాయి. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం ప్రైజ్ మనీ: రూ.30 కోట్లు (అంతర్జాతీయ క్రికెట్లో ఏ టోర్నీలోనూ ఇంత ప్రై జ్‌మనీ లేదు; విజేతకు ప్రైజ్ మనీ: రూ. 13 కోట్లు, రన్నరప్‌కు: రూ. 8 కోట్లు). ఆసియా క్రీడలను నిర్వహించలేమన్న వియత్నాం 2019లో జరిగే 18వ ఆసియా క్రీడల నిర్వహణ నుంచి వైదొలుగుతున్నట్లు వియత్నాం ప్రకటించింది. ఇలాంటి పెద్ద ఈవెంట్స్‌ను గతంలో నిర్వహించిన అనుభవం లేకపోవడంతో పాటు, దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వియత్నాం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రిచ్మండ్ ఓపెన్టోర్నీ విజేత జోష్నా అమెరికాలో జరిగిన రిచ్మండ్ ఓపెన్‌టోర్నీలో భారత క్రీడాకారిణి జోష్నా చినప్ప విజేతగా నిలిచింది. ఏప్రిల్ 19న జరిగిన ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ రాచల్ గ్రిన్‌హమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో జోష్నా తొమ్మిదో సారి మహిళల స్వ్కాష్ అసోసియేషన్ టూర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. వావ్రింకాకు మోంటెకార్లో మాస్టర్స్ టైటిల్ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు వావ్రింకా గెలుచుకున్నాడు. ఏప్రిల్ 20న జరిగిన ఫైనల్లో తన దేశానికే చెందిన రోజర్‌ఫెదరర్‌ను ఓడించాడు. మాస్టర్స్‌సిరీస్‌ను గెలుచుకోవడం వావ్రింకాకు ఇది మొదటిసారి. టోర్నీలో డబుల్స్ విభాగంలో బ్రయాన్ సోదరులు (మైక్ బ్రయాన్, బాబ్ బ్రయాన్) విజేతలుగా నిలిచారు. కాగా వీరిలో మైక్ బ్రయాన్‌కు ఇది 100వ టైటిల్. తద్వారా డబుల్స్ ఈవెంట్స్‌లో వంద టైటిల్స్ నెగ్గిన తొలి క్రీడాకారుడిగా మైక్ గుర్తింపు పొందాడు. చైనాగ్రాండ్ ప్రి విజేత హామిల్టన్ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములా వన్ చైనా గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. షాంఘైలో ఏప్రిల్ 20న జరిగిన పోటీలో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, మరో మెర్సిడెస్ డ్రైవర్ రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కు ఇది వరుసగా మూడో విజయం. ఇదివరకే మలేసియా, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలను కైవసం చేసుకున్నాడు. ఆసియా బ్లిట్జ్ చెస్‌లో హారిక, హరికృష్ణలకు రజతాలు ఆసియా బ్లిట్జ్‌చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారికలు రజత పతకాలను సాధించారు. ఏప్రిల్ 19 న షార్జాలో జరిగిన టోర్నీ ఓపెన్ విభాగంలో యూయాంగ్వీ (చైనా) తొలి స్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా, హరికష్ణ రెండోస్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో టాన్‌జోంగ్యీ (చైనా)కు స్వర్ణం లభించగా, హారిక రజత పతకాన్ని కైవసం చేసుకుంది. జాతీయం హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తించిన సుప్రీం కోర్టు హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఏప్రిల్ 15న తీర్పు ఇచ్చింది. వారిని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పరిగణించాలని, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు తోడ్పడే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొంది. హిజ్రాలు శస్త్ర చికిత్స ద్వారా స్త్రీ లేదా పురుషునిగా మారినప్పుడు కూడా వారికి తగిన గుర్తింపు పొందే హక్కును కూడా కల్పిస్తున్నట్లు సుప్రీం తీర్పునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా అరవింద్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా అరవింద్ మాయారాం ఏప్రిల్ 15న నియమితులయ్యారు. ఈయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మార్చి 31న పదవీ విరమణ చేసిన సుమిత్ బోస్ స్థానంలో అరవింద్ బాధ్యతలు చేపట్టారు. నావికాదళ అధిపతిగా రాబిన్ కే ధోవన్ భారత నావికాదళ అధిపతిగా అడ్మిరల్ రాబిన్ కే ధోవన్ ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు. డి.కె. జోషి స్థానంలో 22వ నావికాదళ అధిపతిగా ధోవన్ నియమితులయ్యారు. ఇటీవలి కాలంలో నౌకాదళంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ జోషి ఫిబ్రవరి 26న రాజీనామా చేశారు. ధోవన్ 25 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. జాతీయ చలన చిత్ర అవార్డులు 2013 సంవత్సరానికి 61వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డు విజేతలను ఎంపిక చేసింది. వివరాలు ఉత్తమ చిత్రం: షిప్ ఆఫ్ థీసీయస్ (హిందీ-ఇంగ్లీష్); ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా (షాహిద్ - హిందీ); ఉత్తమ నటుడు (ఇద్దరికి సంయుక్తంగా): రాజ్‌కుమార్ రావ్ (షాహిద్ - హిందీ), సూరజ్ వెంజారమూడు (పెరారియావతర్ - మలయాళం); ఉత్తమనటి: గీతాంజలి థాపా (లయర్స డైస్ - హిందీ); ఉత్తమ సామాజికాంశ చిత్రం: గులాబ్ గ్యాంగ్ (హిందీ); ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: భాగ్ మిల్కా భాగ్ (హిందీ); ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం (నర్గీస్ దత్ అవార్డు): బాలు మహేంద్ర (తలైమురైగల్ - తమిళం); ఉత్తమ బాలల చిత్రం: కపాల్ (హిందీ); ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్ ఎల్ బీ; ఉత్తమ నేపథ్య గాయకుడు: రూపాంకర్ (జాతీశ్వర్ - బెంగాలీ); ఉత్తమ నేపథ్య గాయనీ: బెలా షిండే (తుహ్యా ధర్మ కొంచా - మరాఠీ); ఉత్తమ మాటల రచయిత: సుమిత్రాభావే (అస్తు - మరాఠీ); ఉత్తమ పాటల రచయిత: ఎన్ ఎ ముత్తుకుమార్ (తంగా మింకాల్ - తమిళం); ఉత్తమ నృత్య దర్శకత్వం: గణేశ్ ఆచార్య (భాగ్ మిల్కాభాగ్- హిందీ); ఉత్తమ సంగీత దర్శకత్వం: కబీర్ సుమన్ (జాతీశ్వర్ - బెంగాలీ). అవార్డులు పొందిన తెలుగు చిత్రాలు: ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: నాబంగారు తల్లి; ఉత్తమ నేపథ్య సంగీతం: శంతనూ మొయిత్రా (నా బంగారు తల్లి); స్పెషల్ జూరీ పురస్కారం: అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి); ఉత్తమ సినిమా పుస్తకం: సినిమాగా సినిమా (నందగోపాల్-తెలుగు) ముంబైలో డబుల్ డెక్కర్ ఫైల ఓవర్ ప్రారంభం దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫైలఓవర్ ముంబైలో ఏప్రిల్ 18న ప్రారంభమైంది. సాంతాక్రజ్- చెంబూర్ లింక్‌రోడ్ (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రాజెక్ట్ ముంబై తూర్పు-పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. దీంతో ఈ ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి పట్టే సమయం 90 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుంది. ఆరున్నర కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి రూ. 454 కోట్లు ఖర్చయింది. అంతర్జాతీయం ఉక్రెయిన్ సంక్షోభం నివారణకు ఒప్పందం ఉక్రెయిన్ సంక్షోభం నివారణకు రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్లు ఏప్రిల్ 17న ఒక అంగీకారానికి వచ్చాయి. జెనీవాలో సమావేశమైన ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఉక్రెయిన్ సంక్షోభాన్ని రాజ్యాంగ సంస్కరణల ద్వారా పరిష్కరించే ప్రణాళికకు అంగీకరించారు. ఆ ప్రణాళిక ప్రకారం రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలకు అధిక అధికారాలను కల్పిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న దళాల నిరాయుధీకరణ, ఉక్రెయిన్‌లో ఆక్రమించిన భవనాలను ఖాళీ చేయించడం జరుగుతుంది. తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి తప్ప మిగిలిన నిరసనకారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు. రాజ్యాంగ సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో చర్చలు జరపాలని ఉక్రెయిన్ను, రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్ కోరాయి. దక్షిణ కొరియా నౌక ప్రమాదంలో 300 మంది గల్లంతు దక్షిణ కొరియా దక్షిణ తీరంలో ఏప్రిల్ 16న నౌక మునిగిపోవడంతో 300 మంది గల్లంతయ్యారు. మొత్తం 459 మంది నౌకలో ప్రయాణిస్తున్నారు. అందులోని వారంతా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు. 6,825 టన్నుల బరువు, 146 మీటర్ల పొడవైన ఎంవీసీవోల్ అనే ఈ ఓడ దక్షిణ కొరియా వాయవ్య ప్రాంతంలోని ఇంచియాన్ నుంచి పర్యాటక ప్రాంతమైన జెజు దీవి మధ్య ప్రయాణిస్తుంది. ఇందుకు 14 గంటల సమయం పడుతుంది. మరో మూడు గంటల్లో గమ్యాన్ని చేరుతుందనగా బ్యాంగ్‌పుంగ్ దీవికి సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్ర సింగ్‌కు ‘సోలార్ చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ ఇండో-అమెరికన్ రాజేంద్ర సింగ్‌కు ‘సోలార్ చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ పురస్కారం దక్కింది. సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నందుకుగాను అమెరికా ప్రభుత్వం రాజేంద్ర సింగ్‌ను ఈ అవార్డుతో గౌరవించింది. రాజేంద్ర సింగ్ క్లెమ్సన్ యూనివర్సిటీలో సిలికాన్ నానోఎలక్ట్రానిక్స్ విభాగానికి డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో సోలార్ విద్యుత్ విస్తరణకు కృషి చేసిన 10 మందిని ఆ దేశ ప్రభుత్వం ప్రతి ఏటా ‘సోలార్ చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ పురస్కారంతో సత్కరిస్తుంది. నాలుగోసారి అల్జీరియా అధ్యక్షుడిగా ఎన్నికైన బౌటెఫ్లికా అల్జీరియా అధ్యక్షుడిగా అబ్దెలాజిజ్ బౌటెఫ్లికా (నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీ) నాలుగోసారి ఎన్నికయ్యారు. ఏప్రిల్ 18న ప్రకటించిన ఫలితాల్లో 81.53 శాతం ఓట్లను ఆయన సాధించాడు. ప్రత్యర్థి అలీ బెన్ఫ్లిస్కు 12.18 శాతం ఓట్లు దక్కాయి. మిలటరీ, ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు మధ్య చెలరేగిన అంతర్యుద్ధం కాలంలో (1999) బౌటెఫ్లికా మొదటి సారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. భూమిలాంటి గ్రహం కెప్లర్-186ఎఫ్ జీవం ఉనికి ఉండే భూమి పరిమాణంలోని మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘గోల్డ్‌లాక్స్ జోన్’లో ఉన్న ఈ గ్రహంలో ద్రవ రూపంలో నీరు, జీవం ఉనికికి కావాల్సిన వాతావరణం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ గ్రహాన్ని నాసాకు చెందిన కెప్లర్ స్పేస్ టెలీస్కోప్‌తో గుర్తించారు. దీన్ని కెప్లర్-186ఎఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఇది భూమి నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలోని ‘హంసరాశి’లో ఉంది. సౌరమండలంలో కాకుండా విశ్వంలో మరో చోట భూమి పరిమాణంలో ఓ గ్రహం ఉన్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. గతంలో విశ్వంలో భూమిని పోలిన అనేక గ్రహాలను గుర్తించినప్పటికీ భూమి కంటే అవన్నీ దాదాపు 40 శాతం పెద్దగా ఉన్నట్లు తేలింది. తాము గుర్తించిన కెప్లర్-186ఎఫ్ గ్రహం భూమితో అనేక రకాల పోలికలు కలిగిఉందని పరిశోధకులు చెబుతున్నారు. భూమిలాంటి గ్రహాల ఉనికిని కనుగొనడంలో ఈ కొత్తగ్రహం ఆవిష్కరణ ముఖ్యమైన ముందడుగుగా వారు పేర్కొన్నారు. వార్తల్లో వ్యక్తులు ఎన్ఎండీసీ సీఎండీగా నరేంద్ర కొఠారి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా నరేంద్ర కొఠారి ఏప్రిల్ 21న బాధ్యతలు స్వీకరించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) లో పలు హోదాల్లో ఈయన పనిచేశారు. బీఈఎంఎల్‌కు కొత్త డెరైక్టర్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బెమెల్ డెరైక్టర్ (రైల్ అండ్ మెట్రో)గా అనిరుధ్ కుమార్ ఏప్రిల్ 21న బాధ్యతలు చేపట్టారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సిస్టమ్‌లో ఎం.టెక్ చేసిన ఆయనకు ప్రణాళిక, ఉత్పత్తి విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా పని చేసిన అనుభవం ఉంది. మయన్మార్ ప్రజాస్వామ్య పోరాట యోధుడు విన్‌టిన్ మృతి మయన్మార్ ప్రజాస్వామ్య పోరాట ఉద్యమ స్థాపకుల్లో ఒకరైన విన్‌టిన్ (84) యాంగూన్‌లో ఏప్రిల్ 21న మరణించారు. ఈయన అత్యధిక కాలం బందీగా ఉన్న రాజకీయ ఖైదీ. సైనిక పాలన నుంచి దేశానికి స్వేచ్ఛ కల్పించేందుకు దశాబ్దాల పాటు పోరాడారు. రెండు దశాబ్దాల జైలు జీవితం గడిపారు. 1988లో అంగ్‌సాన్ సూకీతో కలసి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) ని స్థాపించారు. నోబెల్ అవార్డు గ్రహీత, రచయిత గార్షియా మార్క్వెజ్ మృతి నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ (87) మెక్సికో సిటీలో ఏప్రిల్ 17న మరణించారు. ప్రేమ, కుటుంబం, నియంతృత్వం వంటి అంశాలపై ఆయన చేసిన రచనలు విశేష ఆదరణ పొందాయి. ప్రపంచ సాహిత్యంలో మార్క్వెజ్ గాబోగా సుపరిచితులు. వన్ హండ్రెడ్ ఇయర్స ఆఫ్ సాలిట్యూడ్, ఇన్ ఈవిల్ అవర్, లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా వంటి రచనలతో ఖ్యాతి పొందారు. సాహిత్యంలో 1982లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.