రాయల్స్‌కు ముంబై బ్రేక్ | RR vs MI: Mumbai Indians Register 25-Run Win to Keep Playoff Hopes Alive | Sakshi
Sakshi News home page

రాయల్స్‌కు ముంబై బ్రేక్

Published Tue, May 20 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

రాయల్స్‌కు ముంబై బ్రేక్

రాయల్స్‌కు ముంబై బ్రేక్

పొలార్డ్.. వండర్ క్యాచ్
ముంబై ఆటగాడు పొలార్డ్ ఫీల్డింగ్‌లో అద్భుతం సృష్టించాడు. హర్భజన్ బౌలింగ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ కూపర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద పొలార్డ్ నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. లాంగ్ ఆన్‌లో కూపర్ ఆడిన భారీ షాట్‌కు సిక్సర్ దిశగా అంతెత్తున దూసుకెళ్తున్న బంతిని ఒంటి చేత్తో అందుకున్న పొలార్డ్.. తనను తాను నియంత్రించుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటాడు. అయితే రెండు కాళ్లూ గాల్లో ఉండగానే బంతిని పైకి విసిరి, ఆపై మళ్లీ మైదానంలోకి దూకి బంతిని అందుకున్నాడు. గతంలోనూ పొలార్డ్ ఇలాంటి అద్భుతాలు చేసినా... ఈ మ్యాచ్‌లో పట్టిన క్యాచ్ నమ్మశక్యం కాని రీతిలో ఉంది.
 
- కీలక మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్ 

- 25 పరుగులతో రోహిత్ సేన అద్భుత విజయం
 
అహ్మదాబాద్: ప్లే ఆఫ్‌కు చేరువయ్యామన్న అతివిశ్వాసమో లేక ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌ను తక్కువగా అంచనా వేశారో గానీ.. కీలక మ్యాచ్‌లో నలుగురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రాజస్థాన్ తగిన మూల్యం చెల్లించుకుంది. ముంబై చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు ఇప్పటికే ‘తుది నాలుగు’లో ఆశలు దాదాపు అడుగంటిన ముంబై.. ఇక పోయేదేమీ లేదన్నట్లుగా పోరాడి రాజస్థాన్ దూకుడుకు బ్రేక్ వేసింది.

 సోమవారం ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మైక్ హస్సీ (39 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సిమ్మన్స్ (51 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు అర్ధసెంచరీలతో శుభారంభాన్నివ్వగా... చివర్లో రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

అనంతరం లక్ష్యఛేదనలో విఫలమైన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ కరుణ్ నాయర్ (24 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టెయిలెండర్లు హాడ్జ్ (30 బంతుల్లో 40; 3 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (21 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు రాణించినా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
ఎట్టకేలకు హస్సీ...
ఏడు మ్యాచ్‌ల తరువాత తిరిగి తుదిజట్టులోకి వచ్చిన ముంబై ఓపెనర్ మైక్ హస్సీ సత్తా చాటాడు. సిమ్మన్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులతో అద్భుత ఆరంభాన్నిచ్చాడు. ఈ క్రమంలో పవర్‌ప్లేలో 42 పరుగులు చేసిన ముంబై.. 10 ఓవర్లకు 76 పరుగులు చేసింది. ఆ తరువాత దూకుడు పెంచి అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న హస్సీ, సిమ్మన్స్ ఇద్దరూ ఒకే ఓవర్లో (15వ) అవుటయ్యారు. అయితే ఆ తరువాత పొలార్డ్ సహకారంతో కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. దీంతో చివరి పది ఓవర్లలో 102 పరుగులు రాబట్టుకున్న ముంబై.. రాజస్థాన్‌కు సవాలు విసిరే స్కోరును సాధించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రోహిత్ రనౌటయ్యాడు.
 
వరుస విరామాల్లో వికెట్లు
భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ముంబై బౌలర్లు ఆరంభంలోనే ముకుతాడు వేశారు. మూడో ఓవర్లో ఉన్ముక్త్ చంద్ (2)ను అవుట్ చేసిన ప్రజ్ఞాన్ ఓజా.. తన మరుసటి ఓవర్లో వాట్సన్ (5)నూ వెనక్కి పంపాడు. ఆ వెంటనే శామ్సన్ (2)ను సాంటొకీ డగౌట్‌కు చేర్చాడు. అయితే వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు నుంచి కరుణ్ నాయర్ ఏమాత్రం వెరవకుండా ధాటిగా ఆడడంతో పవర్ ప్లేలో 47 పరుగులు వచ్చాయి.

హర్భజన్ వేసిన 8వ ఓవర్లో పొలార్డ్ అందుకున్న అద్భుత క్యాచ్‌తో కూపర్ (5) వెనుదిరగడం, ఆపై గోపాల్ తన వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్ మరింత ఇక్కట్లలో పడింది. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగి పోతుండడంతో భారీషాట్‌కు యత్నించి నాయర్ కూడా అవుటయ్యాడు. దీంతో 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాయల్స్.. గెలుపుపై ఆశలు కోల్పోయింది. చివర్లో హాడ్జ్, ఫాల్క్‌నర్‌లు ఎదురుదాడికి దిగి భారీషాట్లు ఆడినా అప్పటికే ఆలస్యమైంది.
 
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్: మైక్ హస్సీ (సి) కూపర్ (బి) అంకిత్ శర్మ 56; సిమ్మన్స్ (సి) కూపర్ (బి) అంకిత్ శర్మ 62; పొలార్డ్ (నాటౌట్) 14; రోహిత్ శర్మ (రనౌట్) 40; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1-120; 2-122; 3-178.
బౌలింగ్: అంకిత్ శర్మ 4-0-23-2; కులకర్ణి 4-0-27-0; ఫాల్క్‌నర్ 4-0-47-0; కూపర్ 3-0-27-0; బిన్నీ 1-0-12-0; భాటియా 4-0-39-0.

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: కరుణ్ నాయర్ (సి) సాంటొకీ (బి) హర్భజన్ 48; ఉన్ముక్త్ (సి) హస్సీ (బి) ఓజా 2; వాట్సన్ (సి) రాయుడు (బి) ఓజా 5; శామ్సన్ (సి) రాయుడు (బి) సాంటొకీ 2; కూపర్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 5; అంకిత్ శర్మ (సి) రాయుడు (బి) గోపాల్ 4; బిన్నీ (స్టంప్డ్) తారే (బి) గోపాల్ 2; హాడ్జ్ (సి) రోహిత్ (బి) సాంటొకీ 40; ఫాల్క్‌నర్ (నాటౌట్) 31; భాటియా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153.
 వికెట్ల పతనం: 1-17; 2-38; 3-42; 4-61; 5-66; 6-69; 7-75; 8-144.
 బౌలింగ్: బుమ్రాహ్ 3-0-23-0; సాంటొకీ 4-0-50-2; ఓజా 4-0-30-2; పొలార్డ్ 1-0-11-0; హర్భజన్ 4-0-13-2; గోపాల్ 4-0-25-2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement