ఎదురులేని ‘కింగ్స్’ | Kings XI Punjab vs Royal Challengers Bangalore | Sakshi
Sakshi News home page

ఎదురులేని ‘కింగ్స్’

Published Tue, Apr 29 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

ఎదురులేని ‘కింగ్స్’

ఎదురులేని ‘కింగ్స్’

ఐపీఎల్-7లో పంజాబ్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. తొలి మూడు మ్యాచ్‌లను బ్యాట్స్‌మెన్ గెలిపిస్తే... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు చెలరేగారు. వెరసి దుబాయ్‌లో తొలి విడత టోర్నీలో భాగంగా తాము ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి... అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా సగర్వంగా భారత్‌లో అడుగుపెడుతోంది.

- పంజాబ్ ఖాతాలో వరుసగా ఐదో విజయం
- బెంగళూరుపై ఐదు వికెట్లతో గెలుపు


దుబాయ్: గేల్, కోహ్లి, డివిలియర్స్, యువరాజ్, ఆల్బీమోర్కెల్... ఇంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు ఏదో ఒక మ్యాచ్‌లో విఫలమైతే తడబాటు అనుకోవచ్చు. కానీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పోటీపడి బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కడితే..? బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌పై పేలవంగా అవుటైతే..? ఫలితాన్ని ఊహించడం కష్టమేం కాదు. సోమవారం కూడా అదే జరిగింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అత్యంత ఘోరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఖాతాలో హ్యాట్రిక్ ఓటమిని చేర్చుకుంది. సందీప్ శర్మ (3/15) అద్భుతమైన బౌలింగ్‌తో... బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.


 టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా... బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేసింది. గేల్ (7 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (4), పార్థివ్ (2)ల వికెట్లతో టాప్ ఆర్డర్‌ను కూల్చి సందీప్ ఆరంభంలోనే చాలెంజర్స్‌ను దెబ్బతీయగా... జాన్సన్ (2/19), రిషి ధావన్ (2/14)లు రెండేసి వికెట్లతో చెలరేగారు. 35 పరుగులతో యువరాజ్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులతో ఛేదించింది. మ్యాక్స్‌వెల్ (6) విఫలమైనా... సెహ్వాగ్ (26 బంతుల్లో 32, 4 ఫోర్లు), మిల్లర్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు), చివర్లో రిషి ధావన్ (22 బంతుల్లో 23 నాటౌట్)లు సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు. సందీప్‌శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
ఒక్క ఓవర్ మెరుపులు
 సీజన్‌లో తొలిసారిగా బరిలోకి దిగిన క్రిస్ గేల్ క్రీజులోకి అడుగు పెడుతూనే చెలరేగిపోయాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఏకంగా 20 పరుగులు బాదాడు. కానీ రెండో ఓవర్లో సందీప్.. గేల్‌తో పాటు కోహ్లిని కూడా అవుట్ చేశాడు. ఇదే జోరులో పార్థీవ్‌నూ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడింది. యువరాజ్, డివిలియర్స్, ఆల్బీ మోర్కెల్ కొద్దిసేపు పోరాడినా బాధ్యతగా ఆడలేదు. దీంతో బెంగళూరు చాలా తక్కువ స్కోరు చేసింది. చివరి ఏడు ఓవర్లలో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా బౌండరీ కొట్టకపోవడం విశేషం.
 
బాధ్యతాయుతంగా సెహ్వాగ్
 స్టార్క్ రెండు సంచలన క్యాచ్‌లు అందుకోవడంతో పాటు బెంగళూరు బౌలర్లు నిలకడగా బంతులు వేయడంతో పంజాబ్ కూడా తడబడింది. 40 పరుగులకే మ్యాక్స్‌వెల్‌తో సహా మూడు వికెట్లు కోల్పోయింది. అయితే సెహ్వాగ్ బాధ్యతాయుతంగా ఆడాడు. మిల్లర్‌తో కలిసి కీలక భాగస్వామ్యంతో జట్టును సరైన దిశలో నడిపించాడు. కానీ ఒకే ఓవర్లో మిల్లర్, వీరూ అవుట్ కావడంతో మ్యాచ్‌లో ఆసక్తి పెరిగింది. కానీ కెప్టెన్ బెయిలీ, ఆల్‌రౌండర్ రిషీ ధావన్ కలిసి జాగ్రత్తగా ఆడి విజయాన్ని పూర్తి చేశారు.
 
 స్కోరు వివరాలు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) సందీప్ శర్మ 20, పార్థివ్ (సి) సాహా (బి) సందీప్ శర్మ 2, కోహ్లి ఎల్బీడబ్ల్యూ (బి) సందీప్ శర్మ 4, తకవాలే (సి) సాహా (బి) జాన్సన్ 0, డివిలియర్స్ (సి) మాక్స్‌వెల్ (బి) రిషి ధావన్ 17, యువరాజ్ (సి) మిల్లర్ (బి) రిషి ధావన్ 35, ఆల్బీ మోర్కెల్ (బి) బాలాజీ 15, స్టార్క్ (బి) జాన్సన్ 8, ఆరోన్ నాటౌట్ 11, దిండా నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124.
 వికెట్ల పతనం: 1-21, 2-25, 3-26, 4-26, 5-67, 6-93, 7-97, 8-120.
 బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 3-0-39-0, సందీప్ శర్మ 3-1-15-3, జాన్సన్ 4-0-19-2, బాలాజీ 4-0-17-1, పటేల్ 2-0-11-0, రిషి ధావన్ 4-0-14-2.
 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: పుజారా (సి) పార్థివ్ (బి) దిండా 10, సెహ్వాగ్ (సి) పార్థివ్ (బి) చహల్ 32, సాహా (సి) స్టార్క్ (బి) ఆరోన్ 2, మ్యాక్స్‌వెల్ (సి) స్టార్క్ (బి) ఆరోన్ 6, మిల్లర్ (సి) పార్థివ్ (బి) చహల్ 26, బెయిలీ నాటౌట్ 16, రిషి ధావన్ నాటౌట్ 23, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం: (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 127.వికెట్ల పతనం: 1-22, 2-33, 3-40, 4-85, 5-88.
బౌలింగ్: స్టార్క్ 4-0-15-0, మోర్కెల్ 2-0-24-0, ఆరోన్ 3.5-0-29-2, దిండా 3-0-19-1, చహల్ 4-0-23-2, యువరాజ్ 2-0-13-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement