జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’
జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’
Published Wed, Apr 23 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM
క్రీడలు
మొదలైన ఐపీఎల్ -7
దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-7 పోటీలు ఏప్రిల్ 16న ప్రారంభమయ్యాయి. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం ప్రైజ్ మనీ: రూ.30 కోట్లు (అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ టోర్నీలోనూ ఇంత ప్రై జ్‌మనీ లేదు; విజేతకు ప్రైజ్ మనీ: రూ. 13 కోట్లు, రన్నరప్‌కు: రూ. 8 కోట్లు).
ఆసియా క్రీడలను నిర్వహించలేమన్న వియత్నాం
2019లో జరిగే 18వ ఆసియా క్రీడల నిర్వహణ నుంచి వైదొలుగుతున్నట్లు వియత్నాం ప్రకటించింది. ఇలాంటి పెద్ద ఈవెంట్స్‌ను గతంలో నిర్వహించిన అనుభవం లేకపోవడంతో పాటు, దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వియత్నాం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
రిచ్‌మండ్ ఓపెన్‌టోర్నీ విజేత జోష్నా
అమెరికాలో జరిగిన రిచ్‌మండ్ ఓపెన్‌టోర్నీలో భారత క్రీడాకారిణి జోష్నా చినప్ప విజేతగా నిలిచింది. ఏప్రిల్ 19న జరిగిన ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ రాచల్ గ్రిన్‌హమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో జోష్నా తొమ్మిదో సారి మహిళల స్వ్కాష్ అసోసియేషన్ టూర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
వావ్రింకాకు మోంటెకార్లో మాస్టర్స్ టైటిల్
మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు వావ్రింకా గెలుచుకున్నాడు. ఏప్రిల్ 20న జరిగిన ఫైనల్లో తన దేశానికే చెందిన రోజర్‌ఫెదరర్‌ను ఓడించాడు. మాస్టర్స్‌సిరీస్‌ను గెలుచుకోవడం వావ్రింకాకు ఇది మొదటిసారి. టోర్నీలో డబుల్స్ విభాగంలో బ్రయాన్ సోదరులు (మైక్ బ్రయాన్, బాబ్ బ్రయాన్) విజేతలుగా నిలిచారు. కాగా వీరిలో మైక్ బ్రయాన్‌కు ఇది 100వ టైటిల్. తద్వారా డబుల్స్ ఈవెంట్స్‌లో వంద టైటిల్స్ నెగ్గిన తొలి క్రీడాకారుడిగా మైక్ గుర్తింపు పొందాడు.
చైనాగ్రాండ్ ప్రి విజేత హామిల్టన్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములా వన్ చైనా గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. షాంఘైలో ఏప్రిల్ 20న జరిగిన పోటీలో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, మరో మెర్సిడెస్ డ్రైవర్ రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కు ఇది వరుసగా మూడో విజయం. ఇదివరకే మలేసియా, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలను కైవసం చేసుకున్నాడు.
ఆసియా బ్లిట్జ్ చెస్‌లో హారిక, హరికృష్ణలకు రజతాలు
ఆసియా బ్లిట్జ్‌చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారికలు రజత పతకాలను సాధించారు. ఏప్రిల్ 19 న షార్జాలో జరిగిన టోర్నీ ఓపెన్ విభాగంలో యూయాంగ్వీ (చైనా) తొలి స్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా, హరికష్ణ రెండోస్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో టాన్‌జోంగ్యీ (చైనా)కు స్వర్ణం లభించగా, హారిక రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
జాతీయం
హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తించిన సుప్రీం కోర్టు
హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఏప్రిల్ 15న తీర్పు ఇచ్చింది. వారిని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పరిగణించాలని, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు తోడ్పడే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొంది. హిజ్రాలు శస్త్ర చికిత్స ద్వారా స్త్రీ లేదా పురుషునిగా మారినప్పుడు కూడా వారికి తగిన గుర్తింపు పొందే హక్కును కూడా కల్పిస్తున్నట్లు సుప్రీం తీర్పునిచ్చింది.
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా అరవింద్
కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా అరవింద్ మాయారాం ఏప్రిల్ 15న నియమితులయ్యారు. ఈయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మార్చి 31న పదవీ విరమణ చేసిన సుమిత్ బోస్ స్థానంలో అరవింద్ బాధ్యతలు చేపట్టారు.
నావికాదళ అధిపతిగా రాబిన్ కే ధోవన్ భారత నావికాదళ అధిపతిగా అడ్మిరల్ రాబిన్ కే ధోవన్ ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు. డి.కె. జోషి స్థానంలో 22వ నావికాదళ అధిపతిగా ధోవన్ నియమితులయ్యారు. ఇటీవలి కాలంలో నౌకాదళంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ జోషి ఫిబ్రవరి 26న రాజీనామా చేశారు. ధోవన్ 25 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
జాతీయ చలన చిత్ర అవార్డులు
2013 సంవత్సరానికి 61వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డు విజేతలను ఎంపిక చేసింది. వివరాలు
ఉత్తమ చిత్రం: షిప్ ఆఫ్ థీసీయస్ (హిందీ-ఇంగ్లీష్); ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా (షాహిద్ - హిందీ); ఉత్తమ నటుడు (ఇద్దరికి సంయుక్తంగా): రాజ్‌కుమార్ రావ్ (షాహిద్ - హిందీ), సూరజ్ వెంజారమూడు (పెరారియావతర్ - మలయాళం); ఉత్తమనటి: గీతాంజలి థాపా (లయర్‌స డైస్ - హిందీ); ఉత్తమ సామాజికాంశ చిత్రం: గులాబ్ గ్యాంగ్ (హిందీ); ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: భాగ్ మిల్కా భాగ్ (హిందీ); ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం (నర్గీస్ దత్ అవార్డు): బాలు మహేంద్ర (తలైమురైగల్ - తమిళం); ఉత్తమ బాలల చిత్రం: కపాల్ (హిందీ); ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్ ఎల్ బీ; ఉత్తమ నేపథ్య గాయకుడు:
రూపాంకర్ (జాతీశ్వర్ - బెంగాలీ); ఉత్తమ నేపథ్య గాయనీ: బెలా షిండే (తుహ్యా ధర్మ కొంచా - మరాఠీ); ఉత్తమ మాటల రచయిత: సుమిత్రాభావే (అస్తు - మరాఠీ); ఉత్తమ పాటల రచయిత: ఎన్ ఎ ముత్తుకుమార్ (తంగా మింకాల్ - తమిళం); ఉత్తమ నృత్య దర్శకత్వం: గణేశ్ ఆచార్య (భాగ్ మిల్కాభాగ్- హిందీ); ఉత్తమ సంగీత దర్శకత్వం: కబీర్ సుమన్ (జాతీశ్వర్ - బెంగాలీ). అవార్డులు పొందిన తెలుగు చిత్రాలు: ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: నాబంగారు తల్లి; ఉత్తమ నేపథ్య సంగీతం: శంతనూ మొయిత్రా (నా బంగారు తల్లి); స్పెషల్ జూరీ పురస్కారం: అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి); ఉత్తమ సినిమా పుస్తకం: సినిమాగా సినిమా (నందగోపాల్-తెలుగు)
ముంబైలో డబుల్ డెక్కర్ ఫైల ఓవర్ ప్రారంభం
దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫైలఓవర్ ముంబైలో ఏప్రిల్ 18న ప్రారంభమైంది. సాంతాక్రజ్- చెంబూర్ లింక్‌రోడ్ (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రాజెక్ట్ ముంబై తూర్పు-పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. దీంతో ఈ ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి పట్టే సమయం 90 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుంది. ఆరున్నర కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి రూ. 454 కోట్లు ఖర్చయింది.
అంతర్జాతీయం
ఉక్రెయిన్ సంక్షోభం నివారణకు ఒప్పందం
ఉక్రెయిన్ సంక్షోభం నివారణకు రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్‌లు ఏప్రిల్ 17న ఒక అంగీకారానికి వచ్చాయి. జెనీవాలో సమావేశమైన ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఉక్రెయిన్ సంక్షోభాన్ని రాజ్యాంగ సంస్కరణల ద్వారా పరిష్కరించే ప్రణాళికకు అంగీకరించారు. ఆ ప్రణాళిక ప్రకారం రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలకు అధిక అధికారాలను కల్పిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న దళాల నిరాయుధీకరణ, ఉక్రెయిన్‌లో ఆక్రమించిన భవనాలను ఖాళీ చేయించడం జరుగుతుంది. తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి తప్ప మిగిలిన నిరసనకారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు. రాజ్యాంగ సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ను, రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్ కోరాయి.
దక్షిణ కొరియా నౌక ప్రమాదంలో 300 మంది గల్లంతు
దక్షిణ కొరియా దక్షిణ తీరంలో ఏప్రిల్ 16న నౌక మునిగిపోవడంతో 300 మంది గల్లంతయ్యారు. మొత్తం 459 మంది నౌకలో ప్రయాణిస్తున్నారు. అందులోని వారంతా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు. 6,825 టన్నుల బరువు, 146 మీటర్ల పొడవైన ఎంవీసీవోల్ అనే ఈ ఓడ దక్షిణ కొరియా వాయవ్య ప్రాంతంలోని ఇంచియాన్ నుంచి పర్యాటక ప్రాంతమైన జెజు దీవి మధ్య ప్రయాణిస్తుంది. ఇందుకు 14 గంటల సమయం పడుతుంది. మరో మూడు గంటల్లో గమ్యాన్ని చేరుతుందనగా బ్యాంగ్‌పుంగ్ దీవికి సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది.
రాజేంద్ర సింగ్‌కు ‘సోలార్ చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’
ఇండో-అమెరికన్ రాజేంద్ర సింగ్‌కు ‘సోలార్ చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ పురస్కారం దక్కింది. సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నందుకుగాను అమెరికా ప్రభుత్వం రాజేంద్ర సింగ్‌ను ఈ అవార్డుతో గౌరవించింది. రాజేంద్ర సింగ్ క్లెమ్సన్ యూనివర్సిటీలో సిలికాన్ నానోఎలక్ట్రానిక్స్ విభాగానికి డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో సోలార్ విద్యుత్ విస్తరణకు కృషి చేసిన 10 మందిని ఆ దేశ ప్రభుత్వం ప్రతి ఏటా ‘సోలార్ చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ పురస్కారంతో సత్కరిస్తుంది.
నాలుగోసారి అల్జీరియా అధ్యక్షుడిగా
ఎన్నికైన బౌటెఫ్లికా
అల్జీరియా అధ్యక్షుడిగా అబ్దెలాజిజ్ బౌటెఫ్లికా (నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీ) నాలుగోసారి ఎన్నికయ్యారు. ఏప్రిల్ 18న ప్రకటించిన ఫలితాల్లో 81.53 శాతం ఓట్లను ఆయన సాధించాడు. ప్రత్యర్థి అలీ బెన్‌ఫ్లిస్‌కు 12.18 శాతం ఓట్లు దక్కాయి. మిలటరీ, ఇస్లామిస్ట్ మిలిటెంట్లకు మధ్య చెలరేగిన అంతర్యుద్ధం కాలంలో (1999) బౌటెఫ్లికా మొదటి సారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
భూమిలాంటి గ్రహం కెప్లర్-186ఎఫ్
జీవం ఉనికి ఉండే భూమి పరిమాణంలోని మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘గోల్డ్‌లాక్స్ జోన్’లో ఉన్న ఈ గ్రహంలో ద్రవ రూపంలో నీరు, జీవం ఉనికికి కావాల్సిన వాతావరణం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ గ్రహాన్ని నాసాకు చెందిన కెప్లర్ స్పేస్ టెలీస్కోప్‌తో గుర్తించారు. దీన్ని కెప్లర్-186ఎఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఇది భూమి నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలోని ‘హంసరాశి’లో ఉంది. సౌరమండలంలో కాకుండా విశ్వంలో మరో చోట భూమి పరిమాణంలో ఓ గ్రహం ఉన్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. గతంలో విశ్వంలో భూమిని పోలిన అనేక గ్రహాలను గుర్తించినప్పటికీ భూమి కంటే అవన్నీ దాదాపు 40 శాతం పెద్దగా ఉన్నట్లు తేలింది. తాము గుర్తించిన కెప్లర్-186ఎఫ్ గ్రహం భూమితో అనేక రకాల పోలికలు కలిగిఉందని పరిశోధకులు చెబుతున్నారు. భూమిలాంటి గ్రహాల ఉనికిని కనుగొనడంలో ఈ కొత్తగ్రహం ఆవిష్కరణ ముఖ్యమైన ముందడుగుగా వారు పేర్కొన్నారు.
వార్తల్లో వ్యక్తులు
ఎన్‌ఎండీసీ సీఎండీగా నరేంద్ర కొఠారి
ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా నరేంద్ర కొఠారి ఏప్రిల్ 21న బాధ్యతలు స్వీకరించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) లో పలు హోదాల్లో ఈయన పనిచేశారు.
బీఈఎంఎల్‌కు కొత్త డెరైక్టర్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బెమెల్ డెరైక్టర్ (రైల్ అండ్ మెట్రో)గా అనిరుధ్ కుమార్ ఏప్రిల్ 21న బాధ్యతలు చేపట్టారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సిస్టమ్‌లో ఎం.టెక్ చేసిన ఆయనకు ప్రణాళిక, ఉత్పత్తి విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా పని చేసిన అనుభవం ఉంది.
మయన్మార్ ప్రజాస్వామ్య పోరాట యోధుడు విన్‌టిన్ మృతి
మయన్మార్ ప్రజాస్వామ్య పోరాట ఉద్యమ స్థాపకుల్లో ఒకరైన విన్‌టిన్ (84) యాంగూన్‌లో ఏప్రిల్ 21న మరణించారు. ఈయన అత్యధిక కాలం బందీగా ఉన్న రాజకీయ ఖైదీ. సైనిక పాలన నుంచి దేశానికి స్వేచ్ఛ కల్పించేందుకు దశాబ్దాల పాటు పోరాడారు. రెండు దశాబ్దాల జైలు జీవితం గడిపారు. 1988లో అంగ్‌సాన్ సూకీతో కలసి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) ని స్థాపించారు.
నోబెల్ అవార్డు గ్రహీత, రచయిత గార్షియా మార్క్వెజ్ మృతి
నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ (87) మెక్సికో సిటీలో ఏప్రిల్ 17న మరణించారు. ప్రేమ, కుటుంబం, నియంతృత్వం వంటి అంశాలపై ఆయన చేసిన రచనలు విశేష ఆదరణ పొందాయి. ప్రపంచ సాహిత్యంలో మార్క్వెజ్ గాబోగా సుపరిచితులు. వన్ హండ్రెడ్ ఇయర్‌స ఆఫ్ సాలిట్యూడ్, ఇన్ ఈవిల్ అవర్, లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా వంటి రచనలతో ఖ్యాతి పొందారు. సాహిత్యంలో 1982లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
Advertisement