రస్సెల్ రైటా? రాంగా?
రాజస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వాట్సన్ బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ రస్సెల్ పరిగెడుతూ వచ్చి ఆగిపోయినట్లుగా కనిపించి, మళ్లీ బంతి వేశాడు. రస్సెల్ ఆగాడని అనుకుని వాట్సన్ ఆడకుండా బంతిని వదిలేశాడు. మామూలుగా అయితే దీనిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి. ఇదే విషయం వాట్సన్ అంపైర్‌ను అడిగాడు కూడా. అయితే తన వెనక బౌలర్ ఏం చేశాడో తనకు తెలియదని చెప్పిన అంపైర్ బంతిని లెక్కించారు.
రస్సెల్ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్దమనే విమర్శలు వచ్చాయి. దీనిపై విపరీతమైన చర్చ జరిగింది. ‘బ్యాట్స్‌మెన్ స్విచ్ హిట్‌లు కొడుతున్నప్పుడు, బౌలర్ కూడా అలాంటి ప్రయోగం చేస్తే తప్పేంటి? క్రికెట్‌లో బౌలర్లు మాత్రం ప్రయోగాలు చేయకూడదా? బ్యాట్స్‌మన్‌ను అయోమయంలో పడేయటానికి ఇదో కొత్త పంథా’ అనే వ్యాఖ్య కూడా వినిపించింది. రస్సెల్ చేసింది రైటా? రాంగా? అనే అంశంపై క్రికెట్ పండితులు రెండుగా విడిపోయారు.