Dead ball
-
కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
న్యూజిలాండ్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా జూలై 12న(మంగళవారం) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే అదే మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కివీస్ సీమర్ బ్లెయిర్ టిక్నర్ గుడ్‌లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ అవతల బంతిని విసిరాడు. క్రీజులో ఉన్న సిమీ సింగ్ థర్డ్‌మన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ టాప్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్ పాల్ రెనాల్డ్స్ మొదట ఔట్ అంటూ వేలెత్తాడు. అయితే మరుక్షణమే ఔట్ కాదంటూ డెడ్‌బాల్‌గా పరిగణించాడు. అంపైర్ నిర్ణయంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. వెంటనే టామ్ లాథమ్ ఎందుకు ఔట్ కాదంటూ అంపైర్ వద్దకు వచ్చాడు. కాగా టిక్నర్ బంతి విడుదల చేయడానికి ముందు అతని టవల్ పిచ్‌పై పడింది. ఇది నిబంధనలకు విరుద్దమని.. ఈ చర్య వల్ల బ్యాట్స్‌మన్ ఏకాగ్రత దెబ్బతిని ఔటయ్యే ప్రమాదం ఉందని.. అందుకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డెడ్‌బాల్‌గా ప్రకటించినట్లు తెలిపాడు. దీంతో లాథమ్ అసలు టవల్ వల్ల బ్యాటర్ ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగలేదని వివరించినప్పటికి పాల్ రెనాల్డ్స్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. ఇక చేసేదేం లేక టామ్ లాథమ్ నిరాశగా వెనుదిరిగాడు. అలా ఔట్ నుంచి బయటపడ్డ సిమీ సింగ్ 25 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. మరి క్రికెట్లో చట్టాలు అమలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ఏం చెబుతుందంటే.. ►ఎంసీసీ లా ఆఫ్ క్రికెట్ ప్రకారం లా 20.4.2.6 కింద ఏవైనా శబ్దాలు.. ఏదైనా కదలిక.. ఇంకా ఇతరత్రా చర్యలు స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ ఏకాగ్రతకు భంగం కలిగిస్తే ఫీల్డ్ అంపైర్‌కు ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించే అధికారం ఉంటుంది. ఇది మ్యాచ్ జరుగుతున్న మైదానంలో కావొచ్చు.. లేదా మైదానం బయట ప్రేక్షకుల స్టాండ్స్‌లో జరిగినా కూడా అంపైర్ డెడ్‌బాల్‌గా పరిగణిస్తాడు. ►లా 20.4.2.7 ప్రకారం స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ దృష్టి మరల్చడానికి లా 41.4 (ఉద్దేశపూర్వక ప్రయత్నం) లేదా లా 41.5 (ఉద్దేశపూర్వకంగా మోసం లేదా బ్యాటర్‌ను అడ్డుకోవడం) కిందకు వస్తుంది. టిక్నర్ తన తప్పు లేకున్నప్పటికి అతని టవల్ బంతి విడవడానికి ముందే పిచ్‌పై పడడంతో అంపైర్ పాల్ రెనాల్డ్స్ పై రెండు నిబంధన ప్రకారం డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. pic.twitter.com/lmFW1uEnwr — ParthJindalClub (@ClubJindal) July 13, 2022 -
'అందుకే అనేది బట్లర్ మామూలోడూ కాదని'
ఇంగ్లండ్ వన్డే వైస్ కెప్టెన్ జాస్ బట్లర్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. బంతి దొరికిందే ఆలస్యం అన్నట్లుగా బట్లర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. డెడ్ బాల్, వైడ్ బాల్, నో బాల్ అనే లెక్క లేకుండా భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. మొన్నటివరకు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున వరుస సెంచరీలతో హోరెత్తించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న బట్లర్ అదే టెంపోనూ కొనసాగిస్తున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ 498 పరుగులు అత్యధిక వన్డే స్కోరును అందుకోవడంలో బట్లర్ పాత్ర కీలకం. 162 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తాజాగా మూడో వన్డేలో 86 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్‌తో మెరిసిన బట్లర్ జట్టుకు విజయాన్ని అందించి 3-0తో నెదర్లాండ్స్ క్లీన్‌స్వీప్ అయ్యేలా చేశాడు. 64 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 86 పరుగులు సాధించాడు. కాగా బుధవారం జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో బట్లర్ కొట్టిన ఒక సిక్స్ హైలైట్‌గా నిలిచింది. మాములుగానే అతను కొట్టే సిక్సర్లు హైలైట్ అవుతాయి.. కానీ ఇది అంతకుమించి అనే చెప్పొచ్చు. ఇన్నింగ్స్ 29వ ఓవర్ నెదర్లాండ్స్ బౌలర్ పాల్ వాన్ మీక్రిన్ వేశాడు. అప్పటికే బట్లర్ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఓవర్ ఐదో బంతిని పాల్ వాన్ షార్ట్ పిచ్ వేసే ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి స్లో అయ్యి క్రీజు పక్కకు పోయింది. బంతిని వదిలేద్దామన్న దయ, జాలీ ఏ కోశానా బట్లర్‌లో కనబడలేదు. ఎందుకు వదలడం అనుకున్నాడో కానీ.. రెండుసార్లు పిచ్‌పై పడిన బంతిని బట్లర్ క్రీజు నుంచి మొత్తం పక్కకు జరిగి భారీ సిక్సర్ కొట్టాడు. అంపైర్ డెడ్ బాల్‌గా పరిగణించడంతో పాటు నో బాల్ ఇచ్చి ఫ్రీ హిట్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్రీ హిట్‌ను కూడా బట్లర్ సిక్సర్‌గా మలవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నెదర్లాండ్స్ విధించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 30.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్ జేసన్ రాయ్(86 బంతుల్లో 101 నాటౌట్, 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. బట్లర్ 86 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకముందు నెదర్లాండ్స్ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. సెంచరీతో మెరిసిన రాయ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాగా.. సిరీస్‌లో 248 పరుగులు చేసిన బట్లర్‌కే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/SYVCmHr2iD — Sachin (@Sachin72342594) June 22, 2022 చదవండి: T20 Blast 2022: విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో వైరల్ -
ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య మంగళవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పటికే టీమిండియా ఓటమి ఖాయమైన నేపథ్యంలో ఆ సన్నివేశం నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 57వ ఓవర్లో ఇషాంత్ శర్మ క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ షార్ట్ పిచ్ బంతిని సంధించగా.. దానిని హిట్ చేసేందుకు ఇషాంత్ ప్రయత్నించాడు. అయితే అదనపు బౌన్స్ కారణంగా బంతి అతని బ్యాట్‌ను తాకకుండా శరీరాన్ని తాకి వికెట్లకి అతి సమీపంలో పడింది. అప్పటికే ఆఫ్ స్టంప్‌పై ఉన్న బెయిల్ కింద పడడంతో స్టంప్‌కి ఇషాంత్ పాదం తాకినట్లు భావించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు హిట్ వికెట్ కోసం అప్పీల్ చేశారు. మరోవైపు ఇషాంత్ తన పాదం తాకుకుండానే బెయిల్ ఎలా కింద పడిందో అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే ఈ విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌ని ఆశ్రయించాడు. దాంతో.. రిప్లేని పరిశీలించిన థర్డ్ అంపైర్ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. బౌలర్ జోప్రా ఆర్చర్ బంతిని రిలీజ్ చేయకముందే ఆఫ్ స్టంప్‌పై నుంచి బెయిల్ దానంతట అదే కింద పడడం రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే షార్ట్ లెగ్‌లో ఉన్న రోరీ బర్న్స్ బెయిల్ కింద పడడం చూసి కూడా హిట్ వికెట్ కోసం అప్పీల్ చేయడం ఇక్కడ విశేషం.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మరో 8 బంతులు మాత్రమే ఆడిన టీమిండియా బుమ్రా రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయి 227 పరుగులు తేడాతో పరాజయం చవిచూసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 13 నుంచి చెన్నై వేదికగానే జరగనుంది. చదవండి: ఐసీసీపై విరాట్ కోహ్లి ఆగ్రహం 'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి' pic.twitter.com/x8L1KJVzZH — Sandybatsman (@sandybatsman) February 9, 2021 -
రస్సెల్ రైటా? రాంగా?
రాజస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వాట్సన్ బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ రస్సెల్ పరిగెడుతూ వచ్చి ఆగిపోయినట్లుగా కనిపించి, మళ్లీ బంతి వేశాడు. రస్సెల్ ఆగాడని అనుకుని వాట్సన్ ఆడకుండా బంతిని వదిలేశాడు. మామూలుగా అయితే దీనిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి. ఇదే విషయం వాట్సన్ అంపైర్‌ను అడిగాడు కూడా. అయితే తన వెనక బౌలర్ ఏం చేశాడో తనకు తెలియదని చెప్పిన అంపైర్ బంతిని లెక్కించారు. రస్సెల్ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్దమనే విమర్శలు వచ్చాయి. దీనిపై విపరీతమైన చర్చ జరిగింది. ‘బ్యాట్స్‌మెన్ స్విచ్ హిట్లు కొడుతున్నప్పుడు, బౌలర్ కూడా అలాంటి ప్రయోగం చేస్తే తప్పేంటి? క్రికెట్లో బౌలర్లు మాత్రం ప్రయోగాలు చేయకూడదా? బ్యాట్స్‌మన్‌ను అయోమయంలో పడేయటానికి ఇదో కొత్త పంథా’ అనే వ్యాఖ్య కూడా వినిపించింది. రస్సెల్ చేసింది రైటా? రాంగా? అనే అంశంపై క్రికెట్ పండితులు రెండుగా విడిపోయారు.