న్యూజిలాండ్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా జూలై 12న(మంగళవారం) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే అదే మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కివీస్ సీమర్ బ్లెయిర్ టిక్నర్ గుడ్‌లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ అవతల బంతిని విసిరాడు. క్రీజులో ఉన్న సిమీ సింగ్ థర్డ్‌మన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ టాప్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్ పాల్ రెనాల్డ్స్ మొదట ఔట్ అంటూ వేలెత్తాడు.
అయితే మరుక్షణమే ఔట్ కాదంటూ డెడ్‌బాల్‌గా పరిగణించాడు. అంపైర్ నిర్ణయంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. వెంటనే టామ్ లాథమ్ ఎందుకు ఔట్ కాదంటూ అంపైర్ వద్దకు వచ్చాడు. కాగా టిక్నర్ బంతి విడుదల చేయడానికి ముందు అతని టవల్ పిచ్‌పై పడింది. ఇది నిబంధనలకు విరుద్దమని.. ఈ చర్య వల్ల బ్యాట్స్‌మన్ ఏకాగ్రత దెబ్బతిని ఔటయ్యే ప్రమాదం ఉందని.. అందుకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డెడ్‌బాల్‌గా ప్రకటించినట్లు తెలిపాడు.
దీంతో లాథమ్ అసలు టవల్ వల్ల బ్యాటర్ ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగలేదని వివరించినప్పటికి పాల్ రెనాల్డ్స్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. ఇక చేసేదేం లేక టామ్ లాథమ్ నిరాశగా వెనుదిరిగాడు. అలా ఔట్ నుంచి బయటపడ్డ సిమీ సింగ్ 25 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. మరి క్రికెట్‌లో చట్టాలు అమలు చేసే మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ఏం చెబుతుందంటే..
►ఎంసీసీ లా ఆఫ్ క్రికెట్ ప్రకారం లా 20.4.2.6 కింద ఏవైనా శబ్దాలు.. ఏదైనా కదలిక.. ఇంకా ఇతరత్రా చర్యలు స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ ఏకాగ్రతకు భంగం కలిగిస్తే ఫీల్డ్ అంపైర్‌కు ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించే అధికారం ఉంటుంది. ఇది మ్యాచ్ జరుగుతున్న మైదానంలో కావొచ్చు.. లేదా మైదానం బయట ప్రేక్షకుల స్టాండ్స్‌లో జరిగినా కూడా అంపైర్ డెడ్‌బాల్‌గా పరిగణిస్తాడు.
►లా 20.4.2.7 ప్రకారం స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ దృష్టి మరల్చడానికి లా 41.4 (ఉద్దేశపూర్వక ప్రయత్నం) లేదా లా 41.5 (ఉద్దేశపూర్వకంగా మోసం లేదా బ్యాటర్‌ను అడ్డుకోవడం) కిందకు వస్తుంది. టిక్నర్ తన తప్పు లేకున్నప్పటికి అతని టవల్ బంతి విడవడానికి ముందే పిచ్‌పై పడడంతో అంపైర్ పాల్ రెనాల్డ్స్ పై రెండు నిబంధన ప్రకారం డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
— ParthJindalClub (@ClubJindal) July 13, 2022
Comments
Please login to add a commentAdd a comment