అరేబియన్ నైట్స్... సూపర్ హిట్ | In UAE IPL sucessful | Sakshi
Sakshi News home page

అరేబియన్ నైట్స్... సూపర్ హిట్

Published Fri, May 2 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

అరేబియన్ నైట్స్... సూపర్ హిట్

అరేబియన్ నైట్స్... సూపర్ హిట్

యూఏఈలో ఐపీఎల్ విజయవంతం
 అన్ని వేదికల్లో అభిమానుల ఆదరణ
 ఆసక్తికర మ్యాచ్‌లకూ కొదవ లేదు
 
 యూఏఈలో జరిగిన ఐపీఎల్-7 తొలి దశ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సక్సెస్...సూపర్ హిట్... టోర్నీ ప్రారంభానికి ముందు ఉన్న అన్ని విఘ్నాలను దాటి ఈ ఏడాది లీగ్ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది.
 
 ప్రేక్షకుల ఆదరణ మొదలు ఆటగాళ్ల చక్కటి ప్రదర్శన, వివాదరహితంగా నిలపడం వరకు అన్ని చోట్లా ఐపీఎల్‌కు ఫుల్ మార్కులు పడ్డాయి. ప్రత్యామ్నాయ వేదికగా ఎంపికైన అరబ్ దేశం లీగ్‌ను సమర్థంగా నిర్వహించి తమ ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇప్పుడు ఐపీఎల్ భారత్‌లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తొలి దశ ఐపీఎల్‌పై విశ్లేషణ...  
 
 యూఏఈలో అడుగు పెట్టే సమయానికి ఐపీఎల్ గత ఏడాది వివాదాల బ్యాగేజిని కూడా మోసుకొచ్చింది. ముఖ్యంగా ఫిక్సింగ్‌కు అడ్డాగా గుర్తింపు తెచ్చుకున్న షార్జా లాంటి చోట్ల మ్యాచ్‌ల నిర్వహణ కత్తి మీద సాము అని తెలిసి కూడా బీసీసీఐ ధైర్యం చేసింది. తమ పరిధిలో అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మైదానం లోపల, బయట బుకీలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చింది. యూఏఈ క్రికెట్ బోర్డుతో పాటు అక్కడి ప్రభుత్వం కూడా అందుకు సహకరించింది. ఫలితంగా 20 మ్యాచ్‌లు జరిగినా...కనీసం చిన్నపాటి వివాదం, వార్త రాకపోవడం విశేషం.
 
 పంజాబ్ హవా
 జట్ల ప్రదర్శనను బట్టి చూస్తే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తిరుగు లేని ఆటను కనబర్చింది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ నెగ్గి అగ్రస్థానంతో స్వదేశం వచ్చింది. చెన్నై కూడా తొలి మ్యాచ్‌లో ఓడినా ఆ తర్వాత సాధికారిక విజయాలు సాధించింది. మరో వైపు డబ్బుకు తగిన విలువ...అనే సామెతకు బెంగళూరు జట్టు కొత్త అర్థం చెప్పింది. డబ్బులు తీసుకున్న బ్యాట్స్‌మెనేమో విఫలం కాగా... తక్కువ విలువ దక్కిన బౌలర్లు ఆ జట్టులో రాణించారు. ఫలింతగా ఈ స్టార్ జట్టు చెత్త ప్రదర్శన కనబర్చింది.

ఇక పరాజయాల్లో ఢిల్లీ, కోల్‌కతా పోటీ పడగా, సన్‌రైజర్స్ కూడా వేడిలో విజయం కోసం విలవిల్లాడింది. అయితే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ పరిస్థితి మాత్రం మరీ ఘోరం. ఎడారిలో చుక్క నీటిని పొందేందుకు ఒయాసిస్సు కోసం వెతికినట్లుగా ఆ జట్టు అష్ట కష్టాలు పడ్డా ఖాతా తెరవలేకపోయింది. రాజస్థాన్ జట్టు సూపర్ ఓవర్ టై అయిన మ్యాచ్‌లో కోల్‌కతాపై నెగ్గడం ద్వారా సంతృప్తికరంగా భారత్‌కు వచ్చింది.
 
 అంతా సమానమే...
 యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో కనిపించిన ఒక ప్రధాన అంశం బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరాటం సాగడం. టి20 అంటే బ్యాట్స్‌మెన్ ఆట మాత్రమే అనుకునే వారికి ఇక్కడ తేడా స్పష్టంగా కనిపించింది.  ఇక్కడి పిచ్‌లు స్వభావరీత్యా భారత్‌ను పోలి ఉన్నాయని వినిపించినా...వాస్తవానికి అవి ఇండియా పిచ్‌ల తరహాలో స్పందించలేదు. ఏకపక్షంగా బౌలర్లపై విరుచుకు పడి బ్యాట్స్‌మెన్ రికార్డులతో హోరెత్తించలేదు.  
 
 భారీ హిట్టింగ్ చేయగల బ్యాట్స్‌మెన్ ఉన్నా కూడా జట్లు టి20ల్లో సాధారణంగా కనిపించే స్కోర్లకే పరిమితమయ్యాయి. చక్కటి నైపుణ్యం గల బౌలర్లు కాస్త తెలివిని జోడించి ప్రత్యర్థులను బోల్తా కొట్టించగలిగారు. ఎవరూ ధారాళంగా పరుగులు సమర్పించుకోలేదు. 40 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే 200 స్కోర్లు వచ్చాయి. అదే బౌలింగ్‌లో మాత్రం ఎన్నో చక్కటి ప్రదర్శనలు వచ్చాయి.  ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు ఆరు సార్లు, 3 వికెట్లు 7 సార్లు పడగొట్టగా...బ్యాటింగ్‌లో 27 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. ఒక్క సెంచరీ కూడా బ్యాట్స్‌మెన్ నుంచి రాలేదు.
 
 ఆతిథ్యం బాగుంది
 క్రికెటర్ల కోణంలో చూస్తే ఈ కొత్త వేదికలో అభిమానుల ముందు ఆడటం, ఆదరణ వంటివాటిపై వారికి పెద్దగా అంచనాలు లేవు. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు మినహా గత దశాబ్దన్నరగా యూఏఈలో పెద్దగా క్రికెట్ ఆడని దేశాల ఆటగాళ్లు  ఏ మాత్రం సర్దుకుపోతారో అని అనిపించింది. కానీ అక్కడి అభిమానుల ఆసక్తి క్రికెటర్ల ఉత్సాహాన్ని పెంచింది. భారత్, పాక్, శ్రీలంక తదితర ఆసియా దేశాలకు చెందిన అభిమానులతో పాటు స్థానిక ప్రేక్షకులు ప్రతీ మ్యాచ్‌కు పోటెత్తారు. షార్జా, దుబాయ్, అబుదాబిలు ఏ దశలోనూ పరాయి వేదికల్లాగా, తాత్కాలిక మైదానాల్లాగా కనిపించలేదు. యూఏఈ మంత్రి షేక్ నహయన్ మ్యాచ్‌లకు సంబంధించిన ఏర్పాట్లు చూశారు. ఆయన కూడా స్వయంగా అన్ని మ్యాచ్‌లకు వచ్చారు.
 
 వీరే హీరోలు
 తొలి దశను పండగలా మార్చుకున్న క్రికెటర్లు ఇప్పుడు అదే ఉత్సాహంతో ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా బాగా ఆడిన బ్యాట్స్‌మెన్ జాబితాలో విదేశీయులు ఎక్కువ మంది ఉండగా, బౌలింగ్‌లో మాత్రం భారతీయలే ఎక్కువ ప్రభావం చూపించగలిగారు.
 
 అత్యధిక పరుగుల జాబితాలో మ్యాక్స్‌వెల్ (300), డ్వేన్ స్మిత్ (240), బ్రెండన్ మెకల్లమ్ (193) సహా టాప్-10లో ఏడుగురు విదేశీయులే ఉన్నారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ తన తొలి మూడు ఇన్నింగ్స్‌లలో 95, 89. 95 పరుగులు చేయడం విశేషం. బౌలింగ్‌లో నరైన్ 9 వికెట్లు తీయగా, ఆరోన్, మోహిత్, బాలాజీ 8 చొప్పున వికెట్లు పడగొట్టారు. బౌలింగ్ ప్రదర్శనలు చూస్తే...బాలాజీ (4/13), మోహిత్ శర్మ (4/14), నరైన్ (4/20), తాంబే (4/20), మలింగ (4/23), జడేజా (4/33) ప్రదర్శనలు హైలైట్‌గా నిలిచాయి.  సీనియర్లను మినహాయిస్తే మనీశ్ పాండే, సందీప్ శర్మ, యజువేంద్ర చహల్ ఆకట్టుకున్నారు.
 
 అయితే భారీ మొత్తాల బరువు నెత్తిన మోస్తున్న యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్‌లాంటి వాళ్లు మాత్రం తగిన న్యాయం చేయలేకపోయారు. ఇక మెరుపు వీరుడు గేల్ విన్యాసాలు చూసే అవకాశం పెద్దగా రాలేదు. మరి భారత్‌లో అతను ఏమైనా చెలరేగుతాడేమో చూడాలి. ఇక ఆరు ఐపీఎల్‌లలోనూ చూడని కొత్త ఫలితం ఈ సారి కనిపించింది. కోల్‌కతా-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ టై కాగా, అనంతరం సూపర్ ఓవర్ కూడా టై కావడం ఈ సారి విశేషంగా చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement