super hit...tournment
-
ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ
ప్రతీ ఐపీఎల్‌కు ఒక కథ ఉంటుంది... ఈ సారి ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ... కరోనా ఐపీఎల్‌ను ఆపేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అస్సలు జరగలేదు... ఖాళీ స్టేడియాలు బోర్ కొట్టిస్తాయని అంతా అనుకున్నారు. అయితే అదీ జరగలేదు... చెన్నై క్వాలిఫై కావడమనేది సహజసిద్ధమైన నిబంధన... కానీ అలా కూడా జరగలేదు. పది రోజుల ముందే ప్లే ఆఫ్స్ స్థానాలు ఖరారవుతాయని అనిపించింది. ఏమాత్రం అలా జరగలేదు... 224 పరుగులు చేస్తే గెలుపు ఖాయమనిపించింది. చివరకు ఇది కూడా సాధ్యం కాలేదు... ఒక సూపర్ ఓవర్‌తో ఫలితం వస్తుందని అనిపించింది. కానీ అదీ సరిపోలేదు.... అయితే ఇవన్నీ జరగకపోయినా ఒకటి మాత్రం కచ్చితంగా జరిగింది. అదే ఐపీఎల్ సూపర్ హిట్... విజేత, పరాజితుల గురించి పక్కన పెడితే అభిమానులను అలరించడంలో మాత్రం లీగ్ ఎక్కడా తగ్గలేదు. కోవిడ్–19 సమయంలో అభిమానులకు ఈ టోర్నీ పూర్తి వినోదాన్ని పంచిందనడంలో సందేహం లేదు. ఐపీఎల్–2020లో కొన్ని విశేషాలను చూస్తే... తాజా సీజన్లోనూ కొన్ని వివాదాలు ఐపీఎల్‌ను తాకాయి. అయితే అవేవీ పెద్ద సమస్యగా మారకుండా టీ కప్పులో తుఫాన్ తరహాలాంటివే కావడం వల్ల లీగ్ పేరుకు నష్టం వాటిల్లలేదు. పూర్తి వివరాలు తెలియకపోయినా... ‘బాల్కనీ’ గది ఇవ్వకపోవడం వల్లే సురేశ్ రైనా ఐపీఎల్ నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు రావడం, దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు స్పష్టంగా వినకుండా తన గురించి తప్పుగా మాట్లాడారంటూ అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేయడంలాంటివి జరిగాయి. గత ఐపీఎల్లో ‘మన్కడింగ్’తో వివాదం రేపిన అశ్విన్... ఈసారి అలా చేయకుండా ఫించ్‌ను హెచ్చరికతో వదిలేయడం కూడా వివాదం కాని వార్తగా నిలిచింది. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు ముంబై అధికారిక ట్విట్టర్లో ఢిల్లీ 163/5 పరుగులు చేస్తుందంటూ ట్వీట్ ఉండటం... ఢిల్లీ చివరకు దాదాపు అంతే స్కోరు (162/4) చేయడం కొంత చర్చకు దారి తీసింది. ఐపీఎల్–2020 వెలుగులకు కాస్త అడ్డుపడిన విషయం అంపైరింగ్ ప్రమాణాలు. ఈసారి లీగ్‌లో పెద్ద సంఖ్యలో అంపైరింగ్ నిర్ణయాలు తప్పులుగా తేలడమే కాదు... పలు సందర్భాల్లో వివాదంగా కూడా మారాయి. ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ తీసిన సింగిల్‌ను ‘షార్ట్ రన్’గా పరిగణించడం, చివరకు అదే ఫలితానికి కారణం కావడంతో అంపైరింగ్ వివాదాలు మొదలయ్యాయి. లీగ్ నుంచి నిష్క్రమించిన రోజున కూడా కేఎల్ రాహుల్ దీని గురించి మాట్లాడాడంటే దాని ప్రభావం వారిని ఎంతగా వెంటాడిందో అర్థమవుతుంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముజీబ్ అవుట్ కూడా వింతగా మారింది. క్యాచ్ పట్టినట్లు తేల్చి మూడో అంపైర్ అవుట్‌గా ప్రకటించడం, ఆ తర్వాత ముజీబ్ మళ్లీ రివ్యూ కోరడం అంతా గందరగోళంగా కనిపించింది. చెన్నైతో మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాట్స్‌మన్ టామ్ కరన్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చినట్లు అంపైర్ ముందుగా ప్రకటించాడు. అయితే టామ్ సందేహం వెలిబుచ్చడంతో అంపైర్లు మళ్లీ థర్డ్ అంపైర్‌ను సంప్రదించి నాటౌట్‌గా తేల్చారు. నిజానికి అప్పటికే రివ్యూ వాడేసిన రాజస్తాన్ మళ్లీ రివ్యూ కోరడం కెప్టెన్ ధోనికి కోపం తెప్పించింది. ఆ తర్వాత హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కూడా అంపైర్ పాల్ రీఫెల్ వైడ్‌ను ప్రకటించేందుకు సిద్ధమై... ధోని ఆగ్రహ చూపులతో వెనక్కి తగ్గడం కూడా తీవ్ర ఆశ్చర్యం కలిగించింది. ఎలిమినేటర్‌లో వార్నర్ విషయంలో కూడా రీప్లేలో ఎలాంటి స్పష్టత లేకపోయినా మూడో అంపైర్ అవుట్‌గా ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఈ సీజన్లో ఆ జట్టు, ఈ జట్టు అని తేడా లేకుండా అభిమానులను అన్నింటికంటే ఆనందపర్చిన విషయం వర్షం లేకపోవడం! వానలకు కొరత ఉండే ఎడారి దేశంలో టోర్నీ జరగడంతో ఒక్క మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారలేదు. మ్యాచ్ మాత్రమే కాదు... కనీసం ఒక్క బంతి కూడా వరుణదేవుడి కారణంగా వృథా కాలేదు. 60 మ్యాచ్‌లలో మొత్తం ఓవర్లు సజావుగా సాగడం... పైగా సొంత మైదానాలు కాకపోవడంతో ఏ జట్టుకూ ప్రత్యేకంగా అనుకూలత లేకపోవడం వల్ల యూఏఈలో జరిగిన ఐపీఎల్ అన్నింటికంటే హోరాహోరీగా, ఆసక్తికరంగా సాగిందనడంలో సందేహం లేదు. ► టోర్నీ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో (69 బంతుల్లో 132 నాటౌట్) మెరిశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారత ఆటగాడు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఈసారి లీగ్‌లో మొత్తం 5 శతకాలు నమోదయ్యాయి. ► పంజాబ్‌పై రాహుల్ తేవటియా(రాజస్తాన్) ఇన్నింగ్స్ మరచిపోలేనిది. ఏమాత్రం గెలుపు అవకాశం లేని మ్యాచ్‌లో అతను అద్భుతంగా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాట్రెల్ ఓవర్లో 5 సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది. అప్పటి వరకు అనామకుడిగా ఉన్న తేవటియాను ఈ ఇన్నింగ్స్ హీరోను చేసింది. ► ముంబై, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘డబుల్’ సూపర్ ఓవర్ నమోదు కావడం మరచిపోలేనిది. ఇరు జట్లు 176 పరుగులు చేయగా, తొలి సూపర్ ఓవర్లో కూడా సమానంగా 5 పరుగులే చేశాయి. రెండో సూపర్ ఓవర్లో ముంబై 11 పరుగులు చేయగా, పంజాబ్ 15 పరుగులు సాధించి గెలిచింది. అంతకుముందు అదే రోజు హైదరాబాద్, కోల్‌కతా మధ్య మ్యాచ్‌లో కూడా సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం తేలింది. ► ముంబై ఇండియన్స్ 195 పరుగులు చేశాక మ్యాచ్‌పై ప్రత్యర్థి ఆశలు వదులుకోవాల్సిందే... కానీ వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుతమైన ఆటతో మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్ పరం చేశాడు. ఛేదనలో అతను 60 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేయడం అనూహ్యం. ► ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. ముందుగా చెన్నైపై అజేయంగా 101 పరుగులు చేసిన అతను, తర్వాతి మ్యాచ్ లో పంజాబ్‌పై 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ► కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్ సంచలన బౌలింగ్ ప్రదర్శన (3/8) నమోదు చేశాడు. లీగ్ చరిత్రలో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. -
అరేబియన్ నైట్స్... సూపర్ హిట్
యూఏఈలో ఐపీఎల్ విజయవంతం అన్ని వేదికల్లో అభిమానుల ఆదరణ ఆసక్తికర మ్యాచ్‌లకూ కొదవ లేదు యూఏఈలో జరిగిన ఐపీఎల్-7 తొలి దశ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సక్సెస్...సూపర్ హిట్... టోర్నీ ప్రారంభానికి ముందు ఉన్న అన్ని విఘ్నాలను దాటి ఈ ఏడాది లీగ్ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. ప్రేక్షకుల ఆదరణ మొదలు ఆటగాళ్ల చక్కటి ప్రదర్శన, వివాదరహితంగా నిలపడం వరకు అన్ని చోట్లా ఐపీఎల్‌కు ఫుల్ మార్కులు పడ్డాయి. ప్రత్యామ్నాయ వేదికగా ఎంపికైన అరబ్ దేశం లీగ్‌ను సమర్థంగా నిర్వహించి తమ ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇప్పుడు ఐపీఎల్ భారత్‌లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తొలి దశ ఐపీఎల్‌పై విశ్లేషణ... యూఏఈలో అడుగు పెట్టే సమయానికి ఐపీఎల్ గత ఏడాది వివాదాల బ్యాగేజిని కూడా మోసుకొచ్చింది. ముఖ్యంగా ఫిక్సింగ్‌కు అడ్డాగా గుర్తింపు తెచ్చుకున్న షార్జా లాంటి చోట్ల మ్యాచ్‌ల నిర్వహణ కత్తి మీద సాము అని తెలిసి కూడా బీసీసీఐ ధైర్యం చేసింది. తమ పరిధిలో అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మైదానం లోపల, బయట బుకీలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చింది. యూఏఈ క్రికెట్ బోర్డుతో పాటు అక్కడి ప్రభుత్వం కూడా అందుకు సహకరించింది. ఫలితంగా 20 మ్యాచ్‌లు జరిగినా...కనీసం చిన్నపాటి వివాదం, వార్త రాకపోవడం విశేషం. పంజాబ్ హవా జట్ల ప్రదర్శనను బట్టి చూస్తే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తిరుగు లేని ఆటను కనబర్చింది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ నెగ్గి అగ్రస్థానంతో స్వదేశం వచ్చింది. చెన్నై కూడా తొలి మ్యాచ్‌లో ఓడినా ఆ తర్వాత సాధికారిక విజయాలు సాధించింది. మరో వైపు డబ్బుకు తగిన విలువ...అనే సామెతకు బెంగళూరు జట్టు కొత్త అర్థం చెప్పింది. డబ్బులు తీసుకున్న బ్యాట్స్మెనేమో విఫలం కాగా... తక్కువ విలువ దక్కిన బౌలర్లు ఆ జట్టులో రాణించారు. ఫలింతగా ఈ స్టార్ జట్టు చెత్త ప్రదర్శన కనబర్చింది. ఇక పరాజయాల్లో ఢిల్లీ, కోల్‌కతా పోటీ పడగా, సన్‌రైజర్స్ కూడా వేడిలో విజయం కోసం విలవిల్లాడింది. అయితే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ పరిస్థితి మాత్రం మరీ ఘోరం. ఎడారిలో చుక్క నీటిని పొందేందుకు ఒయాసిస్సు కోసం వెతికినట్లుగా ఆ జట్టు అష్ట కష్టాలు పడ్డా ఖాతా తెరవలేకపోయింది. రాజస్థాన్ జట్టు సూపర్ ఓవర్ టై అయిన మ్యాచ్‌లో కోల్‌కతాపై నెగ్గడం ద్వారా సంతృప్తికరంగా భారత్‌కు వచ్చింది. అంతా సమానమే... యూఏఈలో జరిగిన ఐపీఎల్లో కనిపించిన ఒక ప్రధాన అంశం బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరాటం సాగడం. టి20 అంటే బ్యాట్స్‌మెన్ ఆట మాత్రమే అనుకునే వారికి ఇక్కడ తేడా స్పష్టంగా కనిపించింది. ఇక్కడి పిచ్‌లు స్వభావరీత్యా భారత్‌ను పోలి ఉన్నాయని వినిపించినా...వాస్తవానికి అవి ఇండియా పిచ్‌ల తరహాలో స్పందించలేదు. ఏకపక్షంగా బౌలర్లపై విరుచుకు పడి బ్యాట్స్‌మెన్ రికార్డులతో హోరెత్తించలేదు. భారీ హిట్టింగ్ చేయగల బ్యాట్స్‌మెన్ ఉన్నా కూడా జట్లు టి20ల్లో సాధారణంగా కనిపించే స్కోర్లకే పరిమితమయ్యాయి. చక్కటి నైపుణ్యం గల బౌలర్లు కాస్త తెలివిని జోడించి ప్రత్యర్థులను బోల్తా కొట్టించగలిగారు. ఎవరూ ధారాళంగా పరుగులు సమర్పించుకోలేదు. 40 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే 200 స్కోర్లు వచ్చాయి. అదే బౌలింగ్‌లో మాత్రం ఎన్నో చక్కటి ప్రదర్శనలు వచ్చాయి. ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు ఆరు సార్లు, 3 వికెట్లు 7 సార్లు పడగొట్టగా...బ్యాటింగ్‌లో 27 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. ఒక్క సెంచరీ కూడా బ్యాట్స్‌మెన్ నుంచి రాలేదు. ఆతిథ్యం బాగుంది క్రికెటర్ల కోణంలో చూస్తే ఈ కొత్త వేదికలో అభిమానుల ముందు ఆడటం, ఆదరణ వంటివాటిపై వారికి పెద్దగా అంచనాలు లేవు. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు మినహా గత దశాబ్దన్నరగా యూఏఈలో పెద్దగా క్రికెట్ ఆడని దేశాల ఆటగాళ్లు ఏ మాత్రం సర్దుకుపోతారో అని అనిపించింది. కానీ అక్కడి అభిమానుల ఆసక్తి క్రికెటర్ల ఉత్సాహాన్ని పెంచింది. భారత్, పాక్, శ్రీలంక తదితర ఆసియా దేశాలకు చెందిన అభిమానులతో పాటు స్థానిక ప్రేక్షకులు ప్రతీ మ్యాచ్‌కు పోటెత్తారు. షార్జా, దుబాయ్, అబుదాబిలు ఏ దశలోనూ పరాయి వేదికల్లాగా, తాత్కాలిక మైదానాల్లాగా కనిపించలేదు. యూఏఈ మంత్రి షేక్ నహయన్ మ్యాచ్‌లకు సంబంధించిన ఏర్పాట్లు చూశారు. ఆయన కూడా స్వయంగా అన్ని మ్యాచ్‌లకు వచ్చారు. వీరే హీరోలు తొలి దశను పండగలా మార్చుకున్న క్రికెటర్లు ఇప్పుడు అదే ఉత్సాహంతో ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా బాగా ఆడిన బ్యాట్స్‌మెన్ జాబితాలో విదేశీయులు ఎక్కువ మంది ఉండగా, బౌలింగ్‌లో మాత్రం భారతీయలే ఎక్కువ ప్రభావం చూపించగలిగారు. అత్యధిక పరుగుల జాబితాలో మ్యాక్స్‌వెల్ (300), డ్వేన్ స్మిత్ (240), బ్రెండన్ మెకల్లమ్ (193) సహా టాప్-10లో ఏడుగురు విదేశీయులే ఉన్నారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ తన తొలి మూడు ఇన్నింగ్స్‌లలో 95, 89. 95 పరుగులు చేయడం విశేషం. బౌలింగ్‌లో నరైన్ 9 వికెట్లు తీయగా, ఆరోన్, మోహిత్, బాలాజీ 8 చొప్పున వికెట్లు పడగొట్టారు. బౌలింగ్ ప్రదర్శనలు చూస్తే...బాలాజీ (4/13), మోహిత్ శర్మ (4/14), నరైన్ (4/20), తాంబే (4/20), మలింగ (4/23), జడేజా (4/33) ప్రదర్శనలు హైలైట్‌గా నిలిచాయి. సీనియర్లను మినహాయిస్తే మనీశ్ పాండే, సందీప్ శర్మ, యజువేంద్ర చహల్ ఆకట్టుకున్నారు. అయితే భారీ మొత్తాల బరువు నెత్తిన మోస్తున్న యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్‌లాంటి వాళ్లు మాత్రం తగిన న్యాయం చేయలేకపోయారు. ఇక మెరుపు వీరుడు గేల్ విన్యాసాలు చూసే అవకాశం పెద్దగా రాలేదు. మరి భారత్‌లో అతను ఏమైనా చెలరేగుతాడేమో చూడాలి. ఇక ఆరు ఐపీఎల్లలోనూ చూడని కొత్త ఫలితం ఈ సారి కనిపించింది. కోల్‌కతా-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ టై కాగా, అనంతరం సూపర్ ఓవర్ కూడా టై కావడం ఈ సారి విశేషంగా చెప్పవచ్చు.