ముంబై రాత మారేనా!
ముంబై: ఒక జట్టేమో వరుసగా ఐదు విజయాలతో ఊపు మీదుంది. మరో జట్టేమో సరిగ్గా వ్యతిరేకంగా ఐదు పరాజయాలు సాధించి అట్టడుగున నిలిచింది. ఇప్పుడు ఈ రెండు టీమ్‌లు ఐపీఎల్-7లో తొలిసారి ప్రత్యర్థులుగా తలపడనున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య శనివారం ఈ కీలక పోరు జరగనుంది.
బోణీ చేస్తుందా...
తొలి ఐపీఎల్‌లో మాత్రమే ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా తొలి నాలుగు మ్యాచుల్లో ఓడింది. అయితే ఈ సారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆ టీమ్ తమ చెత్త రికార్డు మరింత సవరిస్తూ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి మూటగట్టుకుంది. యూఏఈలో జరిగిన తొలి దశనుంచి రిక్త హస్తాలతో వెనుదిరిగిన ముంబై, స్వదేశంలోనైనా ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది.
సొంత గడ్డపై ముంబైలో ఈ మ్యాచ్ ఆడనుండటం జట్టుకు అనుకూలాంశం. ‘తప్పులు పునరావృతం చేడయమే మా పరాజయాలకు కారణం. రెండో దశను కొత్త ఆరంభంగా భావిస్తున్నాం. వాటిని సరిదిద్దుకుంటాం. ముంబై పిచ్‌పై అవగాహన ఉంది. గత ఏడాది ఇక్కడ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లూ గెలిచిన రికార్డు మాకుంది’ అని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. సచిన్ లేని లోటు తెలుస్తోందని, అయితే దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదన్న రోహిత్ శర్మ...యూఏఈ గడ్డపై తమ జట్టు పరాజయాలకు సాకులు చెప్పనని అన్నాడు.
జోరు మీదున్న టీమ్...
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ ఇప్పుడు భారత్‌లోనూ తమ జోరు కొనసాగించాలని భావిస్తోంది. అయితే టి20ల్లో ప్రతీ మ్యాచ్ నెగ్గడం అంత సులువు కాదని జట్టు కెప్టెన్ జార్జ్ బెయిలీ అభిప్రాయ పడ్డాడు. ‘ఇంత మంచి స్థితిలో భారత్‌లో మ్యాచ్‌లు ప్రారంభించడం సంతోషకరం.
అయితే ఇదే ఊపును కొనసాగించాల్సిన ఒత్తిడి మాపై ఉంది. కొన్ని సార్లు ఒక్క ఇన్నింగ్స్ మాకు విజయాన్ని దూరం చేయవచ్చు. కాబట్టి అలసత్వం రానీకుండా జాగ్రత్త పడతాం’ అని బెయిలీ అన్నాడు. వేలంలో పలికిన మొత్తాన్ని బట్టి ఆటగాళ్ల విలువను లెక్కించడం సరైంది కాదన్న బెయిలీ...సహచరుడు మ్యాక్స్‌వెల్ మిగిలిన సీజన్‌లో మరింతగా శ్రమించాల్సి ఉంటుందన్నాడు.