ఈ ఒక్కటైనా గెలుస్తారా!
నేడు బెంగళూరుతో హైదరాబాద్ పోరు
- ప్రత్యర్థి దూకుడును అడ్డుకునేనా!
- ఓడితే కథ ముగిసినట్లే
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై వరుసగా ఓడటం గతంలో డెక్కన్ చార్జర్స్‌కు అలవాటుగా ఉండేది. తొలి సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఓడిన ఆ జట్టు ఆ తర్వాత చాన్నాళ్లకు తొలి విజయం నమోదు చేసింది. ఇప్పుడు సన్‌రైజర్స్‌గా మారిన హైదరాబాద్ జట్టు ఈ సారి అదే తరహాలో పరాజయాల బాట పట్టింది. ఉప్పల్‌లోని ఆడిన మూడు మ్యాచ్‌లూ ఓడి అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది. సీజన్‌లో ఇక్కడ మిగిలిన ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తారా అనేది చూడాలి. పటిష్టమైన బెంగళూరును ఓడిస్తే ఫ్యాన్స్‌కు సంతృప్తి దక్కవచ్చు.
ఐపీఎల్‌లో గత మ్యాచ్ పరాజయంనుంచి కోలుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న హైదరాబాద్, ఈ మ్యాచ్‌లో ఓడితే ఈ ఏడాది లీగ్‌లో ముందంజ వేసే అవకాశానికి తెర పడినట్లే. మరో వైపు రైజర్స్‌ను ఓడిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు ఉండటంతో ఆర్‌సీబీ గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
పేలవ ప్రదర్శన
ఐపీఎల్-7లో ఆరంభంనుంచి కూడా ఏ ఒక్క మ్యాచ్‌లోనూ హైదరాబాద్ జట్టు తనదైన ముద్ర వేయలేకపోయింది. బ్యాటింగ్‌లో జట్టు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండు సార్లు భారీ స్కోర్లు నమోదు చేసినా అవి పరాజయానికే పనికొచ్చాయి. వ్యక్తిగతంగా చూస్తే డేవిడ్ వార్నర్ ఒక్కడే టి20 తరహా క్రికెట్ ఆడుతున్నాడు. 4 అర్ధ సెంచరీలు సహా అతను 375 పరుగులు చేశాడు. ఫించ్ రెండు హాఫ్ సెంచరీలు చేసినా ఆ రెండు సార్లూ టీమ్ ఓడింది. స్యామీ కూడా ఒక్క మెరుపు ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక భారత క్రికెటర్లు మాత్రం ఒక్కటీ చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోతున్నారు.
కెప్టెన్సీనుంచి తప్పించినా గత మ్యాచ్‌లో ధావన్ బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. బౌలింగ్‌లో భువనేశ్వర్ మెరుగ్గా ఉన్నా...చివరి ఓవర్లలో అతనూ తేలిపోతున్నాడు. జట్టు బలమైన స్టెయిన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం రైజర్స్ కష్టాలు పెంచింది. వ్యక్తిగతంగా, జట్టుగా రైజర్స్ సర్వ శక్తులూ ఒడ్డి అసాధారణ ప్రదర్శన కనబరిస్తేనే విజయావకాశాలు ఉన్నాయి.
టాపార్డర్ కీలకం
చెన్నైతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గెలుపుతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు కాపాడుకుంది. గత మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లు గేల్, డివిలియర్స్ చక్కటి ఇన్నింగ్స్ ఆడి గెలిపించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కోహ్లి మంచి ఫామ్‌లో లేకపోయినా...యువరాజ్ కూడా నిలదొక్కుకోవడంతో చాలెంజర్స్ పటిష్టంగా కనిపిస్తోంది. వీరందరూ సమష్టిగా రాణిస్తే బెంగళూరుకు భారీ స్కోరుకు అవకాశాలున్నాయి. బౌలింగ్‌లో స్టార్క్, ఆరోన్ మెరుగ్గా రాణిస్తున్నారు. భారత దేశవాళీ క్రికెటర్లలో ఈ సారి చక్కటి గుర్తింపు తెచ్చుకున్న లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.