చెన్నై సూపర్ ‘సిక్స్’ | Delhi Daredevils vs Chennai Super Kings | Sakshi
Sakshi News home page

చెన్నై సూపర్ ‘సిక్స్’

Published Tue, May 6 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

చెన్నై సూపర్ ‘సిక్స్’

చెన్నై సూపర్ ‘సిక్స్’

మళ్లీ అదే పునరావృతం... ఓపెనర్ స్మిత్ అద్భుత ఇన్నింగ్స్...సూపర్ కింగ్స్ గెలుపు...ఐపీఎల్‌లో తమకు అలవాటైన రీతిలో ధోని బృందం మరో అలవోక విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ఆ జట్టు ముందు అది చిన్నదైపోయింది. ఫలితంగా సొంత గడ్డపై డేర్‌డెవిల్స్‌కు వరుసగా రెండో పరాజయం తప్పలేదు. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా ఆరో విజయం. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీపై కూడా ఇది వరుసగా ఆరో గెలుపు కావడం విశేషం.

- ధోనిసేన ఖాతాలో మరో విజయం  
- 8 వికెట్లతో ఢిల్లీపై గెలుపు
- చెలరేగిన స్మిత్, రైనా
 
 న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించి జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (51 బంతుల్లో 79; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), రైనా (27 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైని గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 44 బంతుల్లోనే 86 పరుగులు జోడించడం విశేషం. స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

చెలరేగిన కార్తీక్
ఓపెనర్లు విజయ్ (30 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), డి కాక్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించి ఢిల్లీ జట్టుకు శుభారంభం అందించారు. అయితే అనవసరపు పరుగుకు ప్రయత్నించి డి కాక్ రనౌట్ కాగా, మోహిత్ బౌలింగ్‌లో కెప్టెన్ పీటర్సన్ (0) తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే దినేశ్ కార్తీక్ ఆరంభంనుంచి చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ వేగం పెంచాడు. ముఖ్యంగా మోహిత్, జడేజాల బౌలింగ్‌లో చెలరేగిన అతను 35 బంతుల్లో టోర్నీలో రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తక్కువ వ్యవధిలోనే కార్తీక్‌తో పాటు శుక్లా, విజయ్ వెనుదిరిగారు.

ఈ దశలో డుమిని (17 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు), కేదార్ జాదవ్ (18 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించారు. మోహిత్ వేసిన 18వ ఓవర్లో డుమిని వరుసగా 4 ఫోర్లు కొట్టగా, 20వ ఓవర్లో జాదవ్ వరుసగా 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో విరుచుకు పడ్డాడు. ఆఖరి 5 ఓవర్లలో ఢిల్లీ 56 పరుగులు చేసింది.

మెరుపు ఆరంభం...
ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ (35 బంతుల్లో 32; 5 ఫోర్లు) మరోసారి దూకుడు ప్రదర్శించారు. ఉనాద్కట్ వేసిన నాలుగో ఓవర్లో స్మిత్ వరుసగా 3 సిక్సర్లు బాదడంతో చెన్నై పవర్‌ప్లేలో 49 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం మెకల్లమ్ వెనుదిరిగాడు.మరో వైపు స్మిత్ జోరు మాత్రం తగ్గలేదు. భారీ సిక్సర్లతో చెలరేగిన అతను 38 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. స్మిత్‌కు రైనా జత కలిసిన తర్వాత సూపర్ కింగ్స్ మరింత వేగంగా లక్ష్యం వైపు దూసుకుపోయింది. చివర్లో స్మిత్ అవుటైనా, ధోని (12 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.

స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (రనౌట్) 24; విజయ్ (సి) డు ప్లెసిస్ (బి) జడేజా 35; పీటర్సన్ (బి) మోహిత్ 0; కార్తీక్ (సి) మోహిత్ (బి) హిల్ఫెన్హాస్ 51; శుక్లా (సి) పాండే (బి) అశ్విన్ 0; డుమిని (నాటౌట్) 28; జాదవ్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1-36; 2-37; 3-108; 4-119; 5-120.
బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-34-1; పాండే 3-1-26-0; మోహిత్ 4-0-51-1; జడేజా 4-0-23-1; అశ్విన్ 4-0-29-1; స్మిత్ 1-0-9-0.

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) విజయ్ (బి) పార్నెల్ 79; మెకల్లమ్ (సి) విజయ్ (బి) శుక్లా 32; రైనా (నాటౌట్) 47; ధోని (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో 2 వికెట్లకు) 181.
వికెట్ల పతనం: 1-82; 2-168.
బౌలింగ్: షమీ 4-0-42-0; పార్నెల్  4-0-25-1; ఉనాద్కట్ 3.4-0- 47-0; నదీమ్ 4-0-27-0; శుక్లా 4-0-31-1. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement