
చెన్నై: ఐపీఎల్ బరిలోకి దిగబోతున్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ‘ఓల్డేజ్ హోం’గా చెప్పవచ్చు. ధోని (37 ఏళ్లు), బ్రేవో (35), డు ప్లెసిస్ (34), హర్భజన్ (38), రాయుడు (33), మురళీ విజయ్ (34), వాట్సన్ (37), జాదవ్ (33), తాహిర్ (39 ఏళ్లు)లతో ఈ జాబితా బాగా పెద్దగానే ఉంది. గత ఏడాది జట్టును విజేతగా నిలపడంలో వీరిలో చాలా మంది కీలక పాత్ర పోషించినా... ఫిట్‌నెస్ పరంగా అందరూ అంతంత మాత్రమే. వీరందరికీ ‘యోయో టెస్టు’ పెడితే ఫలితాలు ఎలా ఉండవచ్చో ఊహించుకోవచ్చు!
బహుశా ఇదే కారణంతో కావచ్చు చెన్నై తమ ఆటగాళ్లకు యోయో టెస్టు ఉండదని ప్రకటించేసింది. టీమిండియాకు ఇది తప్పనిసరిగా మారినా, అందరూ అదే అమలు చేయాల్సిన అవసరం లేదని చెన్నై ట్రైనర్ రాంజీ శ్రీనివాసన్ అన్నాడు. ఫుట్‌బాల్‌లాంటి ఆటలకు మాత్రమే అది అవసరం ఉంటుందని అతను తేల్చి చెప్పాడు. యోయోకు బదులుగా తమ ఆటగాళ్లను పరీక్షించేందుకు 2 లేదా 2.4 కిలోమీటర్ల పరుగు మాత్రమే నిర్వహిస్తున్నామని రాంజీ వెల్లడించారు. ‘బోల్ట్ స్ప్రింట్ చేస్తే నేను కూడా అదే చేయాలని లేదు. కోహ్లి చేసే ఎక్స్‌ర్‌సైజ్‌లు మరొకరికి సాధ్యం కాకపోవచ్చు. అందరు ఆటగాళ్లు భిన్నంగా ఉంటారని తెలుసుకోవాలి. కాబట్టి యోయో అందరికీ అవసరం లేదని గుర్తించాం’ అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment