రామలక్ష్మణులు విడిపోయారు | Pune pick Dhoni, Rajkot go for Raina | Sakshi
Sakshi News home page

రామలక్ష్మణులు విడిపోయారు

Published Wed, Dec 16 2015 1:05 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

రామలక్ష్మణులు విడిపోయారు - Sakshi

రామలక్ష్మణులు విడిపోయారు

భారత క్రికెట్‌లో వాళ్లిద్దరూ రామలక్ష్మణుల్లాంటివారు. భారత్ తరఫున ఇంతకాలం కలిసే ఆడారు. ఇక ఐపీఎల్‌లో అయితే ఈ ఇద్దరి బంధం అసామాన్యం. చెన్నై జట్టుకు బ్రాండ్ అంబాసిడర్స్‌లా ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా కలిసే వెళ్లారు... కలిసే తిరిగారు... కష్టాల్లో ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు. సంతోషాన్ని ఇద్దరూ పంచుకున్నారు. మైదానంలో, వెలుపలా వాళ్లిద్దరినీ చూడటానికి రెండు కళ్లూ చాలేవికావు. అలాంటి వాళ్లు ఇప్పుడు విడిపోయారు.

ఐపీఎల్‌లో కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్ ఈ ఇద్దరినీ చెరో జట్టులో ఎంపిక చేసుకున్నాయి. ఇక వచ్చే రెండు సీజన్లు పుణే తరఫున ధోని... రాజ్‌కోట్ తరఫున రైనా... క్రికెట్ మైదానంలో బ్యాట్‌లతో యుద్ధం చేయబోతున్నారు.

 
పుణేకు ధోని, రాజ్‌కోట్‌కు రైనా
ముంబై: ఊహించినట్లుగానే ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనిని... సంజీవ్ గోయెంకాకు చెందిన పుణే ఫ్రాంచైజీ తీసుకుంది. సురేశ్ రైనాను ఇంటెక్స్ మొబైల్స్‌కు చెందిన రాజ్‌కోట్ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది. సస్పెన్షన్ వేటు పడిన చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీల ఆటగాళ్ల కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ఐపీఎల్ డ్రాఫ్ట్ కేవలం పది నిమిషాల్లోనే ముగిసింది.

50 మంది క్రికెటర్లు ఉన్న ఈ డ్రాఫ్ట్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు చెరో రూ. 39 కోట్లు ఖర్చు చేసి ఐదుగురు ఆటగాళ్ల చొప్పున ఎంపిక చేసుకున్నాయి. వచ్చే రెండేళ్లు ఈ క్రికెటర్లంతా కొత్త జట్ల తరఫున ఆడతారు. పాత ఫ్రాంచైజీలకు చెందిన మిగిలిన ఆటగాళ్లు ఫిబ్రవరి 6న జరిగే సాధారణ వేలంలో అన్ని ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంటారు. కొత్త ఫ్రాంచైజీలు మిగిలిన చెరో రూ. 27 కోట్లతో ఆ వేలంలో పాల్గొంటాయి. ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు ఐపీఎల్-9 పోటీలు జరుగుతాయి.
 
ఎంపిక జరిగిందిలా....        
జట్టు కోసం బీసీసీఐకి ఏడాదికి రూ.16 కోట్లు చెల్లిస్తున్నందున పుణే జట్టుకు తొలి ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మరో ఆలోచన లేకుండా ‘న్యూ రైజింగ్ కన్సార్టియం’ ధోనిని ఎంపిక చేసుకుంది. రాజ్‌కోట్ జట్టు తమ తొలి ఆటగాడిగా రైనాను తీసుకుంది. ఆ తర్వాత పుణే రహానేను ఎంచుకుంటే... ఇంటెక్స్ సంస్థ రాజ్‌కోట్‌కే చెందిన జడేజాను జట్టులోకి తీసుకుంది.

తమ మూడో క్రికెటర్‌గా పుణే జట్టు స్పిన్నర్ అశ్విన్ వైపు మొగ్గుచూపితే... రాజ్‌కోట్ మెకల్లమ్‌ను తమ ఖాతాలో చేర్చుకుంది. ఆ తర్వాత పుణే స్టీవ్ స్మిత్‌ను ఎంచుకుంటే... రాజ్‌కోట్ ఫాల్క్‌నర్‌ను తీసుకుంది. ఇక అందుబాటులో ఉన్న వారిలో తమ చివరి ఆటగాడిగా పుణే డుప్లెసిస్‌ను తీసుకోగా... రాజ్‌కోట్ జట్టు ఆల్‌రౌండర్ బ్రేవోను సొంతం చేసుకుంది.
 
ఆటగాళ్ల అసలు మొత్తం వేరు!
ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన డబ్బులకు, వాళ్లకు ఇచ్చే అసలు మొత్తానికి తేడా ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తమ వేలం డబ్బు (రూ. 66 కోట్లు)లో నుంచి ఈ ఐదుగురి కోసం రూ.39 కోట్లు తగ్గించుకుంటాయి. ఈ డ్రాఫ్ట్‌లో తొలి ఆటగాడిని తీసుకోగానే జట్టు పర్స్‌నుంచి రూ.12.5 కోట్లు తగ్గుతాయి. ఆ తర్వాత ఒక్కో ఆటగాడిని తీసుకున్న కొద్దీ వరుస క్రమంలో రూ.9.5 కోట్లు, రూ.7.5 కోట్లు, రూ.5.5 కోట్లు, రూ.4 కోట్లు తగ్గిపోతాయి.

అంటే తొలి క్రికెటర్‌గా ధోనినే కాదు... ఏ ఆటగాడిని ఎంపిక చేసుకున్నా రూ.12.5 కోట్లు తగ్గిపోతాయి. దీని అర్థం ధోనికి రూ.12.5 కోట్లు చెల్లిస్తారని కాదు. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కూడా ఇవ్వొచ్చు. గత ఫ్రాంచైజీ (చెన్నై)తో ధోనికి ఉన్న ఒప్పందం ప్రకారం ఎంత మొత్తం దక్కుతుందో అంత ఇవ్వాలి. ఈ మొత్తం ఎంత అనేది బయటకు తెలియదు.
 
హైలైట్స్
* ఐపీఎల్‌లో ధోని, రైనా వేర్వేరు జట్ల తరఫున ఆడటం ఇదే తొలిసారి.
* రహానే మినహా రాజస్తాన్‌లోని మిగతా భారత ఆటగాళ్లలో ఏ ఒక్కర్ని కూడా రెండు ఫ్రాంచైజీలు తీసుకోలేదు.
* చెన్నై జట్టులోని ఏడుగుర్ని తీసుకుంటే, రాజస్తాన్ నుంచి ముగ్గురు మాత్రమే కొత్త ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు.
* ఎంపిక చేసుకున్న 10 మందిలో ఏడుగురు ఆటగాళ్లు తమ జాతీయ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. వీళ్లలో నలుగురు పుణేలో, ముగ్గురు రాజ్‌కోట్‌లో ఉన్నారు.
* రాజ్‌కోట్ తీసుకున్న ఐదుగురిలో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు.
* గతంలో జడేజా మూడు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. అందులో చెన్నై, రాజస్తాన్ సస్పెన్షన్ బారినపడగా, కొచ్చి టస్కర్స్ కేరళ మొత్తానికి రద్దయ్యింది.
* మొత్తం పది మందిలో భారత్ (5), ఆస్ట్రేలియా (2), దక్షిణాఫ్రికా (1), న్యూజిలాండ్ (1), వెస్టిండీస్ (1) ఆటగాళ్లున్నారు.
 
కెప్టెన్‌గా రైనా?
రాజ్‌కోట్ ఫ్రాంచైజీ తమ జట్టు పగ్గాలు రైనాకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ స్టార్ మెకల్లమ్ కూడా రేసులో ఉన్నాడు. అయితే గతంలో చెన్నై తరఫున కొన్ని మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉండటం, భారత క్రికెటర్ కావడం వల్ల... జట్టు బ్రాండ్ ఇమేజ్ కోసం రైనా వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

రాజ్‌కోట్ తమ తొలి ప్రాధాన్యం కూడా తనకే ఇవ్వడం, మరోవైపు గవాస్కర్ లాంటి మాజీల సలహాలు కూడా రైనా పేరును ముందుకు తెచ్చాయి. జడేజా స్థానిక ఆటగాడు అయినప్పటికీ.. గతంలో ఏ స్థాయి క్రికెట్‌లోనూ తను జట్టుకు సారథ్యం వహించలేదు. మరోవైపు పుణే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకుండా ధోనిని సారథిగా ఎంచుకుంటుంది.
 
వాట్సన్‌ను వదిలేశారు
ఈ డ్రాఫ్ట్‌లో ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, మైక్ హస్సీపై రెండు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరం. మెకల్లమ్, ఫాల్క్‌నర్, డు ప్లెసిస్‌లు రేసులోకి రావడం, కేవలం ఐదుగుర్ని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో వాట్సన్‌ను పట్టించుకోలేదు. మరోవైపు దేశవాళీ ఆటగాళ్ల గురించీ ఎవరూ ఆలోచించలేదు.
 
ఏ జట్టులో ఉన్నా బరిలోకి దిగాక క్రీడాస్ఫూర్తితోనే ఆడతా. ధోనితో తలపడినప్పుడు కూడా దీన్ని పాటిస్తా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. రాజ్‌కోట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడా. ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. జడేజా స్థానికుడు. ఇద్దరం కలిసి ఇక్కడి పరిస్థితులను అనుకూలంగా మల్చుకుంటాం.                    
-సురేశ్ రైనా
 
 
మా ప్రణాళిక ప్రకారమే రైనాను తొలుత ఎంచుకున్నాం. స్థానిక ఆటగాడు, లోయర్ ఆర్డర్‌లో హిట్టర్ కావడం వల్ల రెండో క్రికెటర్‌గా జడేజాను తీసుకున్నాం. జట్టును సమతుల్యం చేయడానికే ఎక్కువ మంది ఆల్‌రౌండర్లను తీసుకున్నాం. మేం ఇప్పటికే ఒకరిద్దరు కోచ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాం. చీఫ్ కోచ్ ఎవరన్నది తేలాక వేలానికి సంబంధించిన వ్యూహం రచించుకుంటాం. దాని ప్రకారం వెళ్తాం.
-కేశవ్ బన్సల్ (ఇంటెక్స్ డెరైక్టర్)  
 
 
మాది కొత్త ఫ్రాంచైజీ. దాన్ని బలోపేతం చేసుకోవడానికి, బ్రాండ్‌ను విస్తరించుకోవడానికి ధోని చాలా అవసరం. అందుకే అతని వైపు మొగ్గాం. అంతకుమించిన మరో అవకాశం మాకు లేదు. అలాగే మిగతా వారిలో కూడా కోరుకున్న ఆటగాళ్లనే తీసుకున్నాం. మనోజ్ తివారి, అశోక్ దిండాలతో కూడా చర్చలు జరుపుతున్నాం.
-సుబ్రతో తాలుక్‌దార్ (పుణే ప్రతినిధి)

రాజ్కోట్కు


పుణేకు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement