భార్య ప్రీతితో అశ్విన్
‘‘రాజ్‌కోట్ టెస్టు జరుగుతున్న సమయంలో పిల్లలు స్కూలు నుంచి వచ్చిన ఐదు నిమిషాల తర్వాత.. తను 500 వికెట్ల మార్కు అందుకున్నాడు. వెనువెంటనే మమ్మల్ని అభినందిస్తూ ఫోన్ కాల్స్ మొదలయ్యాయి.
ఇంతలో మా అత్తయ్య పెద్దగా కేక పెట్టి కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. అశ్విన్‌కు ఈ విషయం గురించి చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే.. చెన్నై- రాజ్‌కోట్ మధ్య విమాన రాకపోకలు అంత ఎక్కువగా లేవని తెలుసు.
అందుకే నేను ఛతేశ్వర్ పుజారాకు ఫోన్ చేసి అతడి కుటుంబ సభ్యుల సహాయం కోరాను. ఆ తర్వాత అశ్విన్‌కు ఫోన్ చేశాను. ఎందుకంటే ఆంటీని పరీక్షించిన తర్వాత.. ‘ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు దగ్గరగా ఉంటే బాగుంటుంది’ అని డాక్టర్ చెప్పారు.
అదే విషయం అశ్విన్‌తో చెప్పగానే తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత 20 -25 నిమిషాలకు గానీ మళ్లీ మాట్లాడలేకపోయాడు. రోహిత్ శర్మ, రాహుల్(ద్రవిడ్) భాయ్, బీసీసీఐలోని ఇతర సభ్యులకు ధన్యవాదాలు.
అశ్విన్ చెన్నైకి చేరేంతవరకు క్షేమసమాచారాలు అడుగుతూ మాకు అండగా నిలబడ్డారు. ఆరోజు అశ్విన్ వచ్చేసరికి అర్ధరాత్రి అయింది’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్ ఉద్వేగానికి లోనైంది.
అశ్విన్ ఐదు వందల టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరాడన్న సంతోష సమయంలోనే అత్తగారు అనారోగ్యం పాలవడం తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని పేర్కొంది. కష్టకాలంలో ఛతేశ్వర్ పుజారా కుటుంబం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ తమకు అండగా నిలిచారని ప్రీతి కృతజ్ఞతాభావం చాటుకుంది.
కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా మూడో టెస్టు మధ్యలోనే అశ్విన్ జట్టును వీడిన విషయం తెలిసిందే. 500 వికెట్ల క్లబ్‌లో చేరిన తర్వాత తల్లి అనారోగ్యం పాలైన నేపథ్యంలో సెలవు తీసుకుని చెన్నైకి వెళ్లాడు. అయితే, ఆమె ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ జట్టుతో చేరాడు.
ఇక ప్రస్తుతం ధర్మశాలలో జరిగే ఐదో టెస్టుతో అశ్విన్ మళ్లీ బిజీ కానున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అశూకు ఇది వందో టెస్టు కావడం విశేషం. ఈ నేపథ్యంలో అశ్విన్ భార్య ప్రీతి.. ఈ సిరీస్ సమయంలో తమ కుటుంబం మానసిక వేదనకు గురైన తీరును వివరిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాలమ్‌లో తన మనసులోని భావాలు పంచుకుంది.
చదవండి: Rohit Sharma: సాకులు చెప్పి తప్పించుకోవచ్చు.. కానీ ఉదయం 5.30 గంటలకే ఇలా..
Comments
Please login to add a commentAdd a comment