శ్రేయస్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్
పుణే : చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ఓటమిపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..అంపైర్ తప్పుడు నిర్ణయం వల్లె ఓటమి పాలయ్యామని, తొలి బంతికే చెన్నై బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ ఔట్ అయినప్పటికి అంపైర్లు ఇవ్వలేదని ఆరోపించాడు. తనతో పాటు తమ డ్రెసింగ్స్ రూం కూడా వాట్సన్ ఔటేనని భావిస్తుందని తెలిపాడు. ఈ తప్పిదంతో వాట్సన్ చెలరేగాడని దీంతో భారీ లక్ష్యం నమోదైందని.. ఇది తమ జట్టుపై పెద్ద ప్రభావం చూపిందని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారంపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు.
మాకు ప్రతి మ్యాచ్ సవాలే..
విజయానికి చేరువగా రావడం శుభపరిణామమని ఈ యువ సారథి ఆనందం వ్యక్తం చేశాడు. ‘ మేం నిజంగా విజయానికి చేరువగా వచ్చాం. ఇది మా తదుపరి మ్యాచ్‌కు ఉపయోగపడుతోంది. టోర్నీలో ఇంకా మేం ఆడాల్సిన ప్రతి మ్యాచ్‌ను ఖచ్చితంగా గెలువాలి. మా తప్పిదాలను గుర్తించి.. వాటి సరిదిద్దుకోని విజయాల కోసం ప్రయత్నిస్తాం. మేం మేనేజ్‌మెంట్‌తో సమావేశమై జట్టు కూర్పుపై చర్చిస్తాం. ఇదే విధంగా జట్టుగా ముందుకు కొనసాగుతాం. తదుపరి మ్యాచ్‌లో రాణిస్తామని’ అయ్యర్ తెలిపాడు.
చెన్నై ఇన్నింగ్స్.. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి బంతికే వాట్సన్ వికెట్ల ముందు దొరకగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఢిల్లీ రివ్యూ కోరింది. అయితే ధర్డ్ అంపైర్ సైతం బంతి బ్యాట్‌కు తగిలిందని సందేహం వ్యక్తం చేస్తూ బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా నాటౌట్ ఇచ్చాడు. అయితే వీడియోలో మాత్రం స్పష్టమైన ఔట్‌గానే కనిపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాట్సన్ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగాడంతో 13 పరుగులతో ఢిల్లీ పరాజయం చెందింది.
ఈ సీజన్‌లో అంపైర్లు తప్పిదాలపై అభిమానులు ఇప్పటికే అగ్రహం వ్యక్తంచేశారు. చెన్నై-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో స్పష్టమైన నోబాల్‌ను ఇవ్వకపోవడం, రాజస్తాన్-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఓవర్‌లో 7 బంతులు వేయించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా సైతం సూచించారు. చెన్నైతో జరిగే మ్యాచ్‌లోనే అంపైర్లు ఇలా తప్పిదాలు చేస్తూ ఆజట్టుకు మద్దతిస్తున్నారని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment