పంత్‌, అయ్యర్‌ వీరవిహారం.. రాజస్తాన్‌ లక్ష్యం 151 | Rajasthan Target 151 in 12 Overs with DLS | Sakshi
Sakshi News home page

Published Wed, May 2 2018 11:42 PM | Last Updated on Wed, May 2 2018 11:51 PM

Rajasthan Target 151 in 12 Overs with DLS - Sakshi

శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల హాఫ్‌సెంచరీలకు అండర్‌-19 స్టార్‌ పృథ్వీషా 47(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) తోడవ్వడంతో భారీ స్కోర్‌ నమోదైంది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం రాజస్తాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లకు 151 పరుగులుగా నిర్ణయించారు.  ఇక మ్యాచ్‌ ఆరంభానికి ముందే వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 18 ఓవర్లకు కుదించారు. ఇక 17.1 ఓవర్‌ అనంతరం మరోసారి వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ నిలిపేశారు. దీంతో మరోసారి ఓవర్లను కుదించి డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం లక్ష్యాన్ని నిర్ధేశించారు.

అండర్‌-19 హీరో సూపర్‌ ఇన్నింగ్స్‌..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్‌ కొలిన్‌ మున్రో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అయ్యర్‌తో అండర్‌-19 సూపర్‌ హీరో పృథ్వీషా దాటిగా ఆడాడు. 18, 27 వ్యక్తిగత పరుగుల వద్ద షా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌లను రాజస్తాన్‌ ఆటగాళ్లు జారవిడిచడంతో మరింత చెలరేగాడు. చిచ్చర పిడుగులా ఆడుతూ అర్ధశతకానికి చేరువైన షా శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 7.2వ బంతికి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

పంత్‌.. అయ్యర్‌ వీరవిహారం.. 
పృథ్వీషా వికెట్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ వచ్చిరావడంతోనే దాటిగా ఆడాడు. మరోవైపు అయ్యర్‌ కూడా రెచ్చిపోవడంతో ఢిల్లీ స్కోర్‌ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో పంత్‌ 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. మరికొద్ది సేపటికే అయ్యర్‌ సైతం 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థసెంచరీ సాధించాడు. ప్రమాదకరంగా మారిన వీరిని ఉనద్కట్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌ చేర్చాడు. తొలుత అయ్యర్‌ 50(35 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్‌లు), ఆ వెంటనే పంత్‌ 69(29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఔట్‌ అయ్యాడు. మూడో వికెట్‌కు ఈ జోడి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 

చివర్లో విజయ్‌ శంకర్‌ 17(6 బంతులు,2 ఫోర్లు, 1 సిక్స్‌), మ్యాక్స్‌వెల్‌ (5)లు దాటిగా ఆడే క్రమంలో పెవిలియన్‌ చేరారు. మ్యాక్స్‌ వికెట్‌ అనంతరం వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. దీంతో 17.1 ఓవర్లకు ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బౌలింగ్‌లో ఉనద్కత్‌ మూడు వికెట్లు తీయగా.. కులకర్ణి, శ్రేయస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్‌లు తలో వికెట్‌ తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement