చెన్నై 'చమక్'
పంజాబ్, బెంగళూరు లాంటి రెండు బలమైన జట్లపై నెగ్గి దూకుడు మీద ఉన్న ముంబై ఇండియన్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ నేలకు దించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో వాంఖడే మైదానంలో బోణీ చేసింది. గతంలో ఈ మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన చెన్నై... ఈసారి మాత్రం గెలిచింది. వాంఖడేలో వరుసగా పది విజయాల తర్వాత ముంబై ఓటమిని రుచి చూసింది.
* వాంఖడేలో తొలిసారి గెలిచిన సూపర్ కింగ్స్
* ఉత్కంఠ పోరులో ఓడిపోయిన ముంబై ఇండియన్స్
* రాణించిన డ్వేన్ స్మిత్
* ధోని సూపర్ ఫినిషింగ్
ముంబై: ఐపీఎల్‌లో హై ప్రొఫైల్ జట్లు చెన్నై, ముంబైల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్కంఠ. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడ్డా ఆఖరి బంతి దాకా పోరాడి నాణ్యమైన వినోదాన్ని అందిస్తాయి. శనివారం కూడా అదే జరిగింది. రెండు జట్లూ చివరి వరకూ పోరాడినా... ధోని సూపర్ ఫినిషింగ్‌తో చెన్నై గట్టెక్కింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనిసేన నాలుగు వికెట్ల తేడాతో రోహిత్ బృందంపై నెగ్గింది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా... ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. రాయుడు (43 బంతుల్లో 59; 2 ఫోర్లు; 4 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన లెండిల్ సిమ్మన్స్ (38 బంతుల్లో 38; 3 ఫోర్లు; 2 సిక్స్) రాణించాడు. చివర్లో అండర్సన్ (6 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్స్) మెరిశాడు. అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డ్వేన్ స్మిత్ (51 బంతుల్లో 57; 5 ఫోర్లు; 3 సిక్స్) మరోమారు తన సత్తా ప్రదర్శించాడు. డు ప్లెసిస్ (24 బంతుల్లో 31; 2 ఫోర్లు; 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో స్టార్ ఫినిషర్ కెప్టెన్ ధోని (12 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) తన మార్కును ప్రదర్శించాడు. ముంబై బౌలర్లలో ప్రవీణ్ కుమార్, మలింగ రెండేసి వికెట్లు తీశారు. చెన్నై ఓపెనర్ డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మెరుపుల్లేవు
* ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బద్రీ బౌలింగ్‌లో గౌతమ్ (8 బంతుల్లో 9; 2 ఫోర్లు) అవుటయ్యాడు. అయితే టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ బ్యాట్‌ను ఝుళిపించాడు. బద్రీ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదగా.. వన్‌డౌన్‌లో దిగిన అంబటి రాయుడు కూడా జోరుగా ఆడడంతో స్కోరులో వేగం పెరిగి పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది.
* అడపాదడపా బౌండరీలు సాధిస్తూ కుదురుకుంటున్న దశలో ఈ జోడిని అశ్విన్ విడదీశాడు. జోరు మీదున్న సిమ్మన్స్ లాంగ్ ఆన్‌లో ఆడిన షాట్‌ను డు ప్లెసిస్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు కెప్టెన్ రోహిత్ (19 బంతుల్లో 19; 1 ఫోర్)తో కలిసి రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 38 బంతుల్లో రాయుడు ఈ సీజన్‌లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
* మెరుపులు లేకుండా నిదానంగా సాగుతున్న ముంబై ఇన్నింగ్స్‌ను 18వ ఓవర్‌లో అశ్విన్ గట్టి దెబ్బే తీశాడు. రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్‌లో రైనా ఎడమవైపునకు పరిగెత్తి అద్భుతంగా పట్టగా చివరి బంతికి పొలార్డ్‌ను డకౌట్ చేసి చెన్నై శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికి రాయుడు.. మోహిత్ శర్మ వేసిన స్లోబాల్‌కు దొరికిపోయాడు. చివరి ఓవర్‌లో అండర్సన్ రెండు సిక్స్‌లతో రెచ్చిపోవడంతో ముంబైకి గౌరవప్రదమైన స్కోరు లభించింది.
స్మిత్ జోరు
* చెన్నైకి ఓపెనర్ డ్వేన్ స్మిత్ 12 పరుగులతో తొలి ఓవర్‌లోనే దూకుడైన ఆరంభాన్నిచ్చాడు. అటు నాలుగో ఓవర్‌లో వరుసగా 6, 4 బాదిన మెకల్లమ్‌ను మరుసటి ఓవర్‌లో ప్రవీణ్ ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ తర్వాత రైనా, స్మిత్ భారీ షాట్లకు వెళ్లకపోవడంతో తొలి పవర్‌ప్లేలో చెన్నై 38 పరుగులు మాత్రమే చేయగలిగింది.
* ఈ దశలో రైనా స్టంప్ అవుట్ అయ్యాడు. రీప్లేలో అనేకమార్లు చూసిన థర్డ్ అంపైర్ చివరకు అవుట్‌గా ప్రకటించారు. జోరు పెంచిన స్మిత్... పొలార్డ్ వేసిన పదో ఓవర్‌లో 4, 4, 6తో రెచ్చిపోయాడు. ఇదే ఊపులో 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన అనంతరం.... సిక్స్ బాదినా ఆ వెంటనే ప్రవీణ్ బౌలింగ్‌లో సిమ్మన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
* 19 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో క్రీజులో కుదురుకున్న డు ప్లెసిస్‌ను మలింగ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్ (19వ)లో జడేజా (7 బంతుల్లో 6; 1 ఫోర్)ను కూడా బౌల్డ్ చేయడంతో పాటు మన్హాస్ రనౌట్ కావడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాల్సిన దశలో కెప్టెన్ ధోని ఓ సిక్స్, ఫోర్ బాది విజయాన్ని పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు:
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) డు ప్లెసిస్ (బి) అశ్విన్ 38; గౌతమ్ (సి) మెకల్లమ్ (బి) బద్రీ 9; రాయుడు (సి) జడేజా (బి) మోహిత్ 59; రోహిత్ (సి) రైనా (బి) అశ్విన్ 19; పొలార్డ్ (సి) రైనా (బి) అశ్విన్ 0; అండర్సన్ నాటౌట్ 18; తారే (సి) డు ప్లెసిస్ (బి) పాండే 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1-16; 2-77; 3-122; 4-129; 5-129; 6-157.
బౌలింగ్: బద్రీ 4-0-34-1; పాండే 4-0-34-1; జడేజా 4-0-33-0; మోహిత్ 4-0-26-1; అశ్విన్ 4-0-30-3.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) సిమ్మన్స్ (బి) ప్రవీణ్ 57; మెకల్లమ్ ఎల్బీడబ్ల్యు (బి) ప్రవీణ్ 13; రైనా (స్టంప్డ్) గౌతమ్ (బి) పొలార్డ్ 19; డు ప్లెసిస్ (బి) మలింగ 31; ధోని నాటౌట్ 22; జడేజా (బి) మలింగ 6; మన్హాస్ (రనౌట్) 1; అశ్విన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 160.
వికెట్ల పతనం: 1-29; 2-56; 3-119; 4-129; 5-146; 6-147.
బౌలింగ్: ప్రవీణ్ 4-0-31-2; మలింగ 4-0-15-2; బుమ్రా 4-0-33-0; హర్భజన్ 4-0-22-0; పొలార్డ్ 2.3-0-42-1; అండర్సన్ 1-0-11-0.