ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఆస్తుల వేలం జరగబోతుంది. ఈమేరకు కంపెనీ స్థిరచరాస్తులను వేలం వేస్తున్నట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రకటించింది. నోటీసులో తెలిపిన వివరాల ప్రకారం..రూ.360 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయనున్నారు.
కంపెనీ బ్యాంకుల కన్సార్టియం వద్ద దాదాపు రూ.947 కోట్లు అప్పు చేసింది. దాన్ని తిరిగి తిరిగిచెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తిగా మారింది. ఎలాగైనా ఆ డబ్బును రాబట్టుకునేందుకు బ్యాంకులు కేంద్రాన్ని ఆశ్రయించాయి. దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఆ కేసును సీబీఐకు అప్పగించింది. 2019లోనే ఈ కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. బ్యాంక్రప్సీ బోర్డు(ఐబీబీఐ) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) తాజాగా ఆస్తులు వేలం వేయాలని నిర్ణయించింది. దాంతో కంపెనీ చేసిన అప్పులను కొద్ది మొత్తంలో తగ్గించవచ్చనే ఉద్దేశంతో ఎన్‌సీఎల్‌టీ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
సీబీఐ ఛార్జ్‌షీట్..
రూ.947.70 కోట్ల రుణాల మోసానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌తో పాటు మరో 15 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) 2019లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇండ్-భారత్ రుణదాతల కన్సార్టియం నుంచి రూ.947 కోట్లు తీసుకుని చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది. ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఎఫ్‌సీ) రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ), ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) నుంచి కంపెనీకు చెందిన తమిళనాడులోని టుటికోరిన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అప్పు చేసినట్లు చెప్పింది.
ఇండ్ భారత్ పవర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం), సిబా సీబేస్, ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్, ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కల్, ఇండ్ భారత్ పవర్ వంటి కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన మధుసూధన్ రెడ్డి పేరును కూడా సీబీఐ ఛార్జ్‌షీటులో పేర్కొంది. కంపెనీ కాంట్రాక్టర్లు సోకియో పవర్ ప్రైవేట్ లిమిటెడ్, వై.నాగార్జున రావు, సీఏలు ఎంఎస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ జాబాద్‌తో పాటు కంపెనీ భాగస్వామ్యంలో ఉన్న టిఆర్ చద్దా అండ్ కంపెనీ, ఇండ్ భారత్ గ్రూప్‌కు చెందిన సి.వేణును నిందితులుగా చేర్చారు.
ఇదిలాఉండగా, ఐబీబీఐ-ఎన్‌సీఎల్‌టీ ఆధ్వర్యంలో ఆస్తుల వేలానికి వెళ్తున్న కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా తమ బినామీల ద్వారా తిరిగి వాటిని దక్కించుకునే ప్రమాదం ఉంది. ముందుగా అప్పుచేసి కొనుగోలు చేసిన ఆస్తుల విలువతో పోలిస్తే ఆక్షన్‌లో దక్కించుకున్న వాటికి వ్యత్యాసం ఉంటుంది. దాంతో భారీగా లాభపడవచ్చని కొన్ని కంపెనీలు దురుద్దేశంతోనే దివాలా ప్రక్రియకు నమోదు చేసుకుంటాయి. రాజకీయమైనా, వ్యాపారమైనా సమర్థంగా నిర్వహించే సత్తా ఉంటేనే విజయం సాధిస్తారు. రాజకీయ ప్రచారంలో భాగంగా నీతులు చెబుతున్న రఘురామ వాటిని పాటించడేమో. బ్యాంకులకు అప్పులు కట్టకుండా ఎగనామం పెడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను మోసం చేసినట్లే. ఈ విషయాన్ని ప్రజలు గమనించరని భావిస్తున్నాడేమో పాపం. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో ప్రజలు తనకు సరైన గుణపాఠం చెబుతారని తెలుస్తుంది.
ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?
ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బిల్డప్‌బాబాయ్‌గా పేరున్న రఘురామకృష్ణరాజుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఆయనపై దిల్లీలో సీబీఐ కేసులు కూడా ఉన్నాయి.
ఇండ్ భారత్ పవర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment