80 ఏళ్ల స్వామి అండ్ ఫ్రెండ్స్... | 80-year-old Swami and Friends ... | Sakshi
Sakshi News home page

80 ఏళ్ల స్వామి అండ్ ఫ్రెండ్స్...

Published Sat, Apr 25 2015 9:22 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

80 ఏళ్ల స్వామి అండ్ ఫ్రెండ్స్...

80 ఏళ్ల స్వామి అండ్ ఫ్రెండ్స్...

 ‘మాల్గుడి ఎండలో ఒక విశేషం ఉంది. దాని గురించి ఆలోచించినవారికే అది హాని చేస్తుంది’ అని మొదలవుతుంది in Father's Room presence అనే కథ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’లో.పదేళ్ల స్వామికిగాని, అతడి ఖరీదైన స్నేహితుడు రాజంకుగానీ, వీపున గూటం మోస్తూ దాంతో ఎవడి నెత్తయినా పగలగొడతాను అని బెదిరిస్తూ తిరిగే మణికిగానీ ఆ ఎండంటే లెక్కే లేదు. అది వారి పాలిటి తెల్లని డేరా. మల్లెల షామియానా. ఇంకా చెప్పాలంటే  ‘చామీ’ అని ప్రేమగా పిలిచే నానమ్మ మెత్తటి ఒడి.మాల్గుడి పట్టణ దాపున, సరయూ నది వొడ్డున ఈ పిల్లలు, వాళ్ల అల్లరి దేశ సంపద మాత్రమే అయ్యిందా? ప్రపంచానికి మురిపెం కాలేదూ?

భారతదేశం అంటే బట్లర్లు, ఇంగ్లిష్ అక్షరమ్ముక్కరాని బంట్రోతులు అనుకునే వలసపాలన రోజుల్లో, ప్రపంచంలో సాహిత్యాన్ని ఇంగ్లిష్ అనే కొలబద్ద పక్కన నిలబెట్టి కొలుస్తున్నరోజుల్లో ఏకకాలంలో ముగ్గురు భారతీయ రచయితలు లండన్‌వారి అచ్చులను హల్లులను ఈ మట్టినీటిలో తడిపి, ఈ గోధూళి దారుల్లో దొర్లించి, ఈ సంస్కారాలతో స్నానం చేయించి, శుభ్రమైన ధోవతీలు చుట్టి లోకానికి చూపించారు. ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావ్, ఆర్.కె.నారాయణ్... నాలుగు ముక్కల లీవ్‌లెటర్ రాయడం రాని ఈ దేశంలో నలభై వేల వాక్యాలు రాయగల సత్తా ఉన్న కలాలు ఉన్నాయి కథలూ ఉన్నాయి చూస్తారా అని చూపించినవారు వాళ్లు.

వీరిలో ఎవరికివారు మేటి.ఆర్.కె.నారాయణ్? ఘనాపాటి. ఒక అయ్యర్ కుర్రాడు, తండ్రిలాగా టీచరో లేదంటే మరో బ్రిటిష్ నౌకరో కావలసినవాడు- ఆర్.కె.నారాయణ్- అచ్చు స్వామిలాగానే చదువులో అంతంత మాత్రం. యూనివర్సిటీ ఎంట్రన్స్ రాస్తే ఫెయిల్ అయ్యాడు. మూడేళ్ల డిగ్రీలో చేర్పిస్తే నాలుగేళ్లు చదివాడు. శారీరక బలం లేదు. స్కూల్ టీచర్‌గా పొద్దు పుచ్చుతాడనుకుంటే హెడ్మాస్టర్ వేసిన డ్రిల్ క్లాసుకు నిరసన తెలిపి ఇంటికొచ్చి బొబ్బున్నాడు. ఇలాంటివాడు రచనను ఒక ఉపాధిగా తీసుకోవడం గొప్ప. అందుకు కుటుంబం అంగీకరించడం మరీ గొప్ప.

తొలి సంవత్సరం సంపాదన అంతా కలిపి తొమ్మిది రూపాయల పన్నెండు అణాలైనా, తొలి నవల ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ను మేనమామ ఎగతాళి చేసి పబ్లిషర్లు తిరగ్గొట్టినా ఆర్.కె.నారాయణ్‌కు తెలుసు. తన దగ్గర ఒక మంత్రనగరి ఉంది. మాల్గుడి! ముద్దులొలికే ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు. స్వామి! వాళ్లిద్దరూ సరిగ్గా తగలాల్సిన వాళ్లకు తగలాలి. అంతే. కాని ఎలా? ఆక్స్‌ఫర్డ్‌లో ఒక స్నేహితుడుంటే అతనికి ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ రాత ప్రతి పంపాడు. ఆ స్నేహితుడు దానిని ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత గ్రాహం గ్రీన్‌కు చూపించాడు.

రోజూ బ్రెడ్డూ జాము పనికిమాలిన ఇంగ్లిష్ మర్యాదలతో విసిగిపోయున్నవాడికి పచ్చని అరిటాకు.. నడుమ తెల్లని అన్నమూ... ఆ పక్కనే కళకళలాడే బ్రాహ్మణ కుటుంబమూ... బంగారు బాల్యమూ... లేచి నడుముకు టై చుట్టుకుని అది పబ్లిష్ అయ్యేదాకా ఊరుకోలేదతడు.
1935. స్వామి అండ్ ఫ్రెండ్స్ నామ సంవత్సరం. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల నిలుచుని దుర్భుణీ వేసి చూసినా దూరంగా కనిపిస్తున్న ఒక నదురైన నౌక. రెపరెపలాడుతున్న భారతీయ పతాక. ఆర్.కె.నారాయణ్. భారతీయాంగ్ల సాహిత్యానికి ఏం తక్కువ? అవును ఏం తక్కువ అని నిరూపించినవాడు స్వామి.

ఇందుకు ఆర్.కె.నారాయణ్ ఏరింది కూడా చాలా సులువైన దినుసులు. మైసూరుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో చిన్న పట్టణం- నంజనగుడ్- దానిని మాల్గుడి చేసుకున్నాడు. అందులో పారే నది-కబిని- దానిని సరయు చేసుకున్నాడు. ముఖ్యపాత్ర స్వామి? దిగుల్లేదు. తనే. ఇక తండ్రి.. తల్లి...  నానమ్మ... స్నేహితులు... చిన్నప్పటి జ్ఞాపకాలు... కాకుంటే రెండు యాడ్ చేయాలి. ఒకటి స్వచ్ఛత మరొకటి అమాయకత్వం. యాడ్ చేశాడు. రచన సిద్ధం. లొట్టలు వేయకుండా ఉండటం దుస్సాధ్యం.

పిల్లల ప్రపంచాన్ని పిల్లల ప్రపంచంలోకి వెళ్లి రాయడం అది. లోపలి రచన. వారి అమాయకత్వం, తెంపరితనం, భయం, కపటం, అసూయ, భేషజం, పరిణితి... పెళ్లయ్యి ఇల్లు పిల్లలు ఉంటేనే సంసారం కాదు... పిల్లలకు కూడా ఒక సంసారం ఉంటుంది... టీచర్లతో టెక్స్ట్‌బుక్కులతో పరీక్షలతో ఆటలతో స్నేహితులతో పోటీలతో... దానిని రాయడం అది. ఆర్.కె.నారాయణ్ దృష్టిలో పిల్లల పట్ల పెద్దల నుంచి హింస, భయాలకు తావులేదు. దానిని చెప్పడానికి కూడా ఈ నవల రాశాడు. తమిళుడే. కాని కన్నడ భూమికి, కన్నడ మనుషులకు, కన్నడ సంస్కృతికి అక్షరాలా కస్తూరి పరిమళం అబ్బాడు. మైసూర్ అంటే ఆర్.కె.నారా యణ్, ఆర్.కె.నారాయణ్ అంటే మైసూర్.

 నేల మీద గట్టిగా కాలూనిన ఏ రచనైనా బతికింది. ఇదీ అందుకే బతికింది. దృశ్యమాధ్యమం అందుబాటులోకి వచ్చి, టెలివిజన్ సెట్ అనేది ఇంటింటికీ క్యాలెండర్‌తో సమానం అయ్యాక స్వామి అండ్ ఫ్రెండ్స్ రచన ‘మాల్గుడి డేస్’గా మారి ప్రతి ప్రేక్షకుణ్ణి తాకింది. 1986. అంటే దాదాపు 30 ఏళ్లు.కాని ఇంకా ఆ సీరిస్‌ను చూస్తున్నారు. హిందీలో చూశారు. ఇంగ్లిష్‌లో చూశారు. దేశీయ భాషల్లో డబ్ చేసుకొని చూశారు. చూస్తూనే ఉన్నారు.

 ఎందుకు చూస్తున్నారు? అందులో ఉన్నది నువ్వూ. నేనూ. నిన్ను నువ్వు ఎంత సేపు చూసుకున్నా తనివి తీరుతుందా? ఈ సిరీస్ వల్ల దర్శకుడు శంకర్‌నాగ్, స్వామి పాత్ర పోషించిన మంజునాథ్ ప్రేక్షకుల్చిన ఫాల్కేలను పొందారు.స్వామి అండ్ ఫ్రెండ్స్ తెలుగులో ‘స్వామి- మిత్రులు’ పేరుతో అనువాదమయ్యి 1996లో పుస్తకంగా వెలువడింది. దీనిని వాసిరెడ్డి సీతాదేవి అనువాదం చేశారని చాలా కొద్దిమందికే తెలుసు. ఎన్.బి.టి దీనిని రహస్యంగా ఉంచిందని కూడా చాలా కొద్దిమందికే తెలుసు. అందుబాటులో ఉంచితే పాఠకులు చదివేస్తారని దాని భయం. నిజానికి అడల్ట్ చిల్డ్రన్‌కు ఈ వేసవిలో ఇంతకు మించిన తోడు ఉందా?

అయితే ఆర్.కె.నారాయణ్‌కూ, స్వామి అండ్ ఫ్రెండ్స్‌కూ తెలుగు ప్రాంతంతో బాదరాయణ బంధం ఉందా? అలాంటి గాలి ఈ తావున తిరుగాడిందా? అలాంటి పాత్రలు ఈవైపు తారసిల్లాయా?అవును అనే అంటున్నారు ఒకరిద్దరు పాఠకులు. యూనివర్సిటీలలో కంపారిటివ్ స్టడీ చేస్తున్న విద్యార్థులు.‘పోలేరమ్మబండ కతలు’కు దక్కిన గౌరవం అది.ఇది విశేషం కావచ్చు. అలాంటి పోలికకు తెలుగులో ఒక రచన ఉండటం, అలాంటిదారిలో తెలుగులో ఒక రచయిత నడవడం ఘనతే కావచ్చు.ఇంతకీ ఎవరతడు? చాయ్‌కి పిలవాలి. చామీ.... Father's Room రెడీ చేస్తావా?
 - ఖదీర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement