చెల్లెలిగానా... నో అన్నాను! | Sakshi
Sakshi News home page

చెల్లెలిగానా... నో అన్నాను!

Published Sun, Nov 2 2014 10:53 PM

చెల్లెలిగానా... నో అన్నాను!

‘‘నేనేం కారెక్టర్ ఆర్టిస్ట్‌ని కాదు. హీరోయిన్‌గా చేస్తున్నా. అయినా కూడా చెల్లెలి పాత్ర చేశానంటే.. ఆ పాత్ర ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు’’ అని కార్తీక అన్నారు. ‘జోష్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’లో ‘అల్లరి’ నరేశ్‌కి చెల్లిగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరూ కవలలు. బి. చిన్ని దర్శకత్వంలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక మట్లాడుతూ- ‘‘చిన్నిగారు సిస్టర్ కేరక్టర్ చేయాలనగానే అమ్మ, నేను ‘నో’ అనేశాం. కానీ, కథ విన్న తర్వాత నిర్ణయం తీసుకోమన్నారు.
 
 విన్నాం.. బాగా నచ్చింది అందుకే ఒప్పుకున్నాం. ఏదనుకుంటే అది చేయాలని, తన సోదరుణ్ణి ఆడుకోవాలని, ఎవరైనా రెచ్చిపోతే రఫ్ఫాడించాలని.. అనుకునే కారెక్టర్ నాది. సినిమాలో నా మీద ‘జేమ్స్ బాండ్’ అనే పాట ఉంది. దీన్నిబట్టి నా పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ‘అరుంధతి’లాంటి సినిమా అయితే కథానాయికకు నటనకు అవకాశం దొరుకుతుంది. కానీ, లేడీ ఓరియంటెడ్ కాని ఈ చిత్రంలో నాకు నటనకు అవకాశం దొరకడం ఆనందంగా ఉంది. కొత్తగా వచ్చే హీరోలు తమ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉండాలి? ఎలాంటి రిస్కీ ఫైట్స్ ఉండాలి? అని కలలు కంటారో.. అలాంటివన్నీ నాకు ఈ సినిమాలో ఉన్నాయి. వాస్తవానికి నా పాత్ర కూడా హైలైట్‌గా ఉంటుంది కాబట్టి, నరేశ్ తల్చుకుంటే దర్శకుడితో చెప్పి, నా సీన్స్ కట్ చేయించొచ్చు.
 
 కానీ, అలా చేయకపోవడం తన గొప్పతనం. ఈ సినిమాకి బ్రదర్, సిస్టర్ ఇద్దరూ హీరోలే. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఇద్దరు హీరోల సినిమా’’ అన్నారు. తన తల్లి రాధతో తనను పోల్చవద్దని చెబుతూ- ‘‘మా అమ్మ మంచి నటి. ఓ లెజెండ్‌తో ఇప్పుడిప్పుడే నటిగా పైకొస్తున్న నన్ను పోల్చడం సరికాదు. ఆవిడంత పేరు తెచ్చుకోవడానికి నాకు టైమ్ పడుతుంది. అప్పట్లో చిరంజీవిగారు మంచి డాన్సర్. ఎంత కష్టమైనా ఫర్వాలేదు.. నేను కూడా ఆ స్టెప్స్ వేస్తా అని అమ్మ అడిగి మరీ చేసేదట. చిరంజీవిగారు కూడా సపోర్ట్ చేసేవారట. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’లో కొన్ని డాన్స్ మూమెంట్స్‌ని నేను రోప్ లేకుండా చేశాను.
 
  నరేశ్, చిన్ని సహకారం లేకపోతే చేయగలిగేదాన్ని కాదు’’ అన్నారు. సినిమా సినిమాకి గ్యాప్ తీసుకోవడం గురించి చెబుతూ- ‘‘సినిమానే బతుకుదెరువు అనుకునే స్థితిలో నేను లేను. అందుకే, మనసుకి నచ్చినవాటినే చేస్తున్నాను. గ్యాప్ వచ్చినా చింతించను’’ అని చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన కనుబొమలు బాగా లేవనేవారని కార్తీక చెబుతూ - ‘‘నా ‘రంగం’ సినిమా విడుదలైన తర్వాత చాలామంది అమ్మాయిలు బ్యూటీ పార్లర్‌లో ‘కార్తీకలాంటి కనుబొమలు కావాలి’ అని అడుగుతున్నారట. అప్పుడు మైనస్ అన్నవాళ్లు ఇప్పుడు నా ఐబ్రోసే నాకు ప్లస్ అంటున్నారు. అందుకే విమర్శలకు కంగారుపడను. ఇప్పుడు బాగాలేదనిపించినది భవిష్యత్తులో బాగుంటుందని సర్దిచెప్పుకుంటా’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement