మహిళల శ్రమ దోపిడీకి ‘పిల్స్‌’ | Sakshi
Sakshi News home page

మహిళల శ్రమ దోపిడీకి ‘పిల్స్‌’

Published Fri, Jun 14 2019 4:09 PM

Textile Factories illegally Giving Women Pills In Tamil Nadu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాదిలోనే వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులో దాదాపు నాలుగువేల ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు ఉండగా, వాటిల్లో దాదాపు మూడు లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. వారు రోజంతా పది గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తేనే వారికి పూర్తి వేతనం వస్తుంది. మహిళలు రుతుస్రావం సమయంలో కనీసం మూడు రోజులపాటు సెలవు పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే ఉద్యోగాలే పోతాయి. అందుకని వారు ఆ సమయాల్లో కూడా ఫ్యాక్టరీల్లో పనికి హాజరవుతున్నారు. రుతుస్రావం సందర్భంగా వచ్చే నీరసం, బలహీనత పది గంటల పాటు పనిచేయనీయదు. వారి పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ‘టైమ్‌కీపర్‌’ వారికి గంట విశ్రాంతి కూడా ఇవ్వరు. మూత్రానికి వెళ్లిన పది నిమిషాల్లో తిరిగి రావాలి. మూత్రానికి కూడా ఎక్కువ సార్లు పోనీయరు. పోతే గంటకింతా, అరగంటకింతా అని వేతనాలు కట్‌ చేస్తారు.

మరి రుతుస్రావం సమయంలో మహిళలు పనిచేసేది ఎలా ? దీనికి సులభమైన మార్గాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలే కనిపెట్టాయి. రుతుస్రావం సమయంలో మహిళలకు పెయిన్‌ కిల్లర్స్‌ లాంటి మాత్రలను టైమ్‌ కీపర్ల ద్వారా యాజమాన్యాలే సరఫరా చేస్తున్నాయి. ‘థామ్సన్‌ రాయటర్స్‌ ఫౌండేషన్‌’ ఇటీవల వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తోన్న వంద మందికి పైగా మహిళా కార్మికులను ఇంటర్వ్యూ చేయగా వారిలో 90 శాతం మంది ఇలాంటి పిల్స్‌ తీసుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇది చాలా భయంకరమైన విషయం. తరచుగా ఈ పిల్స్‌ను వాడడం వల్ల మహిళల్లో మానసిక ఒత్తిడి, గాబరా పెరుగుతుంది. గర్భాశయం వద్ద క్యాన్సర్‌ రహిత కణతులు ఏర్పడతాయి. ఇతర ఇన్‌ఫెక్షన్లూ వస్తాయి. కొందరిలో గర్భస్రావం కూడా జరుగుతుంది.

ఫ్యాక్టరీలు సరఫరా చేస్తున్న ఈ పిల్స్‌పై ఓ కాగితంగానీ, బ్రాండ్‌ నేమ్‌గానీ, ఆఖరికి అది ఎక్స్‌పైర్‌ అయిందా, లేదా కూడా తెలియడం లేదని దర్యాప్తులో తేలింది. ఈ పిల్స్‌ కారణంగా తాను తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సుధా అనే 17 ఏళ్ల యువతి తెలిపింది. చిత్తు కాగితాలు ఏరుకుని బతికే తన తల్లికి తోడుగా ఉండేందుకు తానీ పనిలో చేరానని, నెలకు ఆరు వేల రూపాయలు వస్తాయని, వారానికి ఒక్క రోజు మినహా ఎలాంటి సెలవులు ఉండవని, సెలవు పెడితే జీతం కట్‌ చేస్తారని తెలిపింది. తమ కుటుంబానికి లక్షన్నర రూపాయల అప్పు ఉండడం వల్ల తప్పనిసరిగా తానీ పనిలో కొనసాగాల్సి వస్తోందని వాపోయారు. మరో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కనగ మరిముత్తు అనే 21 ఏళ్ల యువతి పిల్స్‌ కారణంగా తన ఆరోగ్యం పాడవుతోందని, తీసుకోకపోతే పనిచేసే పరిస్థితి ఉండడం లేదని చెప్పారు. ఈ పిల్స్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయన్న విషయం తెలియదని, తమకు ఎవరు ఆ విషయం తెలపలేదని చెప్పారు.

ఐబ్రూఫెన్, అడ్విల్‌ లాంటి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ డ్రగ్స్‌ను మహిళలకు ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. రుతుస్రావాన్ని అరికట్టేందుకు మందులు ఇస్తున్న మాట వాస్తవమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ టైమ్‌ కీపర్‌ తెలిపారు. యాజమాన్యమే వాటిని తమకు సరఫరా చేస్తోందని, అయితే వాటి పేరేమిటో, వాటి వల్ల లాభమా, నష్టమా కూడా తనకు తెలియదని, తాను వాటిని వాడాల్సిన అవసరం రాలేదని మధ్యవయస్కురాలైన ఆమె చెప్పారు. తమ దృష్టికి ఈ విషయం రాలేదని, ఇలాంటి అనైతిక చర్యలకు తాము పాల్పడమని 500 వస్త్ర కంపెనీలకు సభ్యత్వం కలిగిన ‘సదరన్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌’ ప్రధాన కార్యదర్శి సెల్వరాజు కందస్వామి చెప్పారు. ఈ డ్రగ్స్‌ తీసుకొని బాధ పడుతున్న వస్త్ర ఫ్యాక్టరీల మహిళలు తమ వద్దకు పదుల సంఖ్యలో వస్తున్నారని దిండిగుల్‌లో క్లినిక్‌ నడుపుతున్న డాక్టర్‌ పీ. నళిన కుమారి తెలిపారు.

కార్మిక చట్టాల ప్రకారం అర్హులైన నర్సులు, డాక్టర్లతో కంపెనీలే స్వయంగా డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలి. ఎక్కువ ఫ్యాక్టరీలను కలిగిన అతికొద్ది మంది మాత్రమే డిస్పెన్సరీలను నడుపుతున్నారు. చాలా కంపెనీలు ఫ్యాక్టరీల్లో టైమ్‌ కీపర్ల ద్వారా కడుపు నొప్పికి, తల నొప్పికి, నడుము నొప్పులకు సాధారణ మాత్రలను సరఫరా చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement