10 ఓవర్ల క్రికెట్ లీగ్ లో సెహ్వాగ్!
షార్జా: ఓవర్ల పరంగా చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది. తొలుత 50 ఓవర్ల క్రికెట్ ను పూర్తిగా ఆస్వాదించిన సగటు క్రికెట్ అభిమాని.. ఆపై 20 ఓవర్ల ఫార్మాట్ కు బాగా అలవాటు పడ్డాడు. దాంతో 50 ఓవర్ల వన్డే క్రికెట్ కు ఆదరణ బాగా తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు 20 ఓవర్ల క్రికెట్ కంటే మరింత పొట్టి ఫార్మాట్ వీక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అదే టీ 10 క్రికెట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా జరిగే ఈ లీగ్ టెన్ క్రికెట్ గా నామకరణం చేశారు.
ఇందులో పాల్గొనడానికి వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, షాహిద్ ఆఫ్రిది, కుమార సంగక్కరలతో పాటు మరికొంత మంది అంతర్జాతీయ క్రీడాకారులు అంగీకరించారు. ఈ లీగ్ లో పంజాబీస్, పక్తూన్స్, మరాఠా, బంగ్లాస్, లంకన్స్, సింధీస్, కేరళైట్స్ జట్లు పాల్గొనున్నాయి. డిసెంబర్ 21 నుంచి 24 వరకూ షార్జా క్రికెట్ స్టేడియంలో టీ 10 లీగ్ జరుగనుంది. దాదాపు 20 మంది అంతర్జాతీయ క్రికెటర్లు టీ 10 లీగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.