ముంబైలోనూ ద్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ
ద్రోన్‌లు అంటే.. నిన్నటివరకూ బాంబులు కురిపించే మానవ రహిత యుద్ధవిమానాలు. నిఘాకు ఉపయోగపడే సాధనాలు. కానీ ఇప్పుడు.. పిజ్జాలను డెలివరీ చేసే వాహనాలు కూడా! ఇంతవరకూ వివిధ దేశాల బలగాలకే పరిమితమైన ద్రోన్‌లు ఇప్పుడు సాధారణ పౌరులకూ ఎన్నో పనులు చేసిపెట్టే పరికరాలుగా మారుతున్నాయి. ఇంతకుముందు డొమినోస్ పిజ్జావారు ద్రోన్ ద్వారా పిజ్జాను ప్రయోగాత్మకంగా డెలివరీ చేశారు. అమెజాన్ కంపెనీవారు పార్శిళ్ల రవాణానూ పరిశీలించారు. మనదేశంలో కూడా రాజకీయ పార్టీలు, పెళ్లిళ్లు, వేడుకల సందర్భంగా ఆకాశంలోంచి వీడియోలు తీసేందుకూ ద్రోన్‌లను వాడటం ఇటీవల ఊపందుకుంది.
అయితే మన దేశంలో తొలిసారిగా ద్రోన్ ద్వారా పిజ్జాను డెలివరీ చేసే ప్రయోగాన్ని ఈ నెల 11న ముంబైకి చెందిన ‘ప్రాన్సెస్కోస్ పిజ్జేరియా’ వారు విజయవంతంగా నిర్వహించారు. వీరు పంపిన ద్రోన్ 1.5 కి.మీ. దూరంలోని ఓ భవనంలో ఉంటున్న వినియోగదారుడికి పిజ్జాను అందించింది. పిజ్జా బాయ్‌లకు బదులు ద్రోన్‌లను వాడటం వల్ల సమయం, ఖర్చు కలసివస్తాయని, మరో నాలుగేళ్లలో పిజ్జాల డెలివరీకి ద్రోన్‌ల వాడకం సాధారణ విషయం కావచ్చని పిజ్జేరియా యజమాని రజనీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మంచి ద్రోన్ రూ.1.20 లక్షలకు దొరుకుతుందని, కానీ ద్రోన్‌ల వినియోగంపై ఉన్న ఆంక్షలు తొలగితే వాటి వాడకం బాగా పెరుగుతుందన్నారు.