స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?
స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?
Published Fri, Sep 30 2016 11:37 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
స్మార్ట్ఫోన్ దిగ్గజాలకు ఏడు నెంబర్ ఏడిపిస్తోందా? అసలు అచ్చికి రావడం లేదా? అంటే అవుననే అనిపిస్తోంది.ఇటీవలే శాంసంగ్ తాజా స్మార్ట్ఫోన్ గెలాక్సీ నోట్7 పేలుడు ఘటనలు మార్కెట్లో తీవ్ర సంచలనం రేపగా.. ఇప్పడు అదే బాటలో మరో దిగ్గజం ఆపిల్కు షాక్ తగిలిందట. ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ పేలిపోయిందని వార్తలు బయటికి పొక్కాయి. ఎప్పుడూ ఒకరినొకరు కాఫీ చేసుకుంటూ స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని ఏలే ఈ రెండు దిగ్గజాలు ఏడు నెంబర్తో తాజా ఫ్లాగ్షిప్లను విడుదల చేశాయి. కానీ ఈ రెండింటికి ఏడు నెంబర్ షాకిస్తూ పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే గెలాక్సీ నోట్7 పేలుళ్ల సమస్య శాంసంగ్కు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది.
శాంసంగ్ గెలాక్సీ నోట్7 బ్యాటరీ లోపంతో పేలిపోగా, ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ మోడల్ సరియైన కారణాలు వెల్లడికాలేదు. ఈ ఫోన్ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుని దగ్గరికి పేలిపోయిన ఫోన్ డెలివరీ అయింది. ఆర్డర్ను అందుకుని బాక్స్ తెరిచిచూడగానే పేలిపోయిన ఫోన్ను గుర్తించినట్టు వినియోగదారుడు పేర్కొన్నాడు.ఫ్యాక్టరీ నుంచి డెలివరీ అయ్యే మధ్యలో ఈ పేలుడు సంభవించి ఉంటుందని ఫోన్ యజమాని చెబుతున్నాడు. ఆపిల్ ఈ విషయంపై ఇప్పటికీ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు.కానీ విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుడు రీప్లేస్మెంట్ కోసం ఆపిల్ సంస్థను ఆశ్రయించాడు. ప్రస్తుతం పేలిపోయిన ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
Advertisement