Sakshi News home page

స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!

Published Mon, Dec 4 2023 1:04 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులందరూ అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని ఏమీ లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేయడం, మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండడం జరిగేది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈవీఎం బ్యాలెట్లలో నోటా(నన్‌ ఆఫ్‌ ద ఎబోవ్‌) బటన్‌ తీసుకొచ్చారు.

ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థులు ఎవరూ సరైన వారు లేరని భావించిన పక్షంలో నోటాకు ఓటు వేయవచ్చు. అత్యధికంగా నోటాను వినియోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది ఓటర్లు నోటా బటన్‌ నొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,254 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 17,327 మంది నోటాకు ఓటేశారు. బోథ్‌ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు వేశారు.

ఇలా ఈవీఎంల్లోకి..
2013లో పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. దీన్ని భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థ రూపొందించింది.

బోథ్‌: బోథ్‌ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2565 మంది నోటాను వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి జంగుబాపుకు 2044 ఓట్లు, బీసీపీ పార్టీ అభ్యర్థి ఆడె సునీల్‌ నాయక్‌కు 677, ఆర్‌జేపీ అభ్యర్థి హీరాజీకి 1388, డీఎస్పీ అభ్యర్థి ఉమేష్‌కు 1011, జీజీపీ అభ్యర్థి బాదు నైతంకు 596, స్వతంత్ర అభ్యర్థులు భోజ్యా నాయక్‌కు 878, ధనలక్ష్మికి 1231 ఓట్లు పోల్‌ అయ్యాయి.
ఇవి చ‌ద‌వండి: తూర్పున కాంగ్రెస్‌, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్‌ఎస్‌..

Advertisement

What’s your opinion

Advertisement