పేదలపై పంతం | Sakshi
Sakshi News home page

పేదలపై పంతం

Published Wed, Apr 3 2024 5:38 AM

Chandrababu and Pawan Kalyan poisoned the volunteer system from the beginning - Sakshi

ఐదేళ్లుగా ఇంటి వద్దే అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కసు

వలంటీర్‌ వ్యవస్థపై తొలి నుంచి విషం కక్కిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌

గోనె సంచులు మోసే ఉద్యోగాలంటూ తూలనాడిన చంద్రబాబు 

ఇంట్లో మగాళ్లు లేనప్పుడు తలుపులు తడుతున్నారంటూ నీచమైన వ్యాఖ్యలు

వలంటీర్లు సంఘ విద్రోహ శక్తులంటూ పవన్‌ విద్వేష ప్రసంగాలు 

తాము అధికారంలోకి వస్తే వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తామంటూ హూంకరింపులు

ఎన్నికల వేళ కుట్రపూరితంగా వలంటీర్ల సేవలను అడ్డుకున్న వైనం

లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై తీవ్ర ప్రభావం

ప్రజా వ్యతిరేకతతో ఎప్పటిలాగే బాబు యూటర్న్‌ డ్రామాలు

ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలంటూ మొసలి కన్నీళ్లు   

సాక్షి, అమరావతి: చరిత్రను సమాజం ఎన్నటికీ మరువదు! మానవత్వం లేని మనిషిని నాయ­కుడిగా ఎన్నడూ అంగీకరించదు! దేశంలోనే తొలి­సారిగా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ చేరవేసి ప్రజాభిమానం పొందిన వలంటీర్‌ వ్యవస్థపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కసు అంతాఇంతా కాదు. ఆవిర్భావం నుంచి దీనిపై చంద్రబాబు అండ్‌ కో విషం చిమ్ముతూనే ఉంది. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారు.

ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో వలంటీర్లను టార్గెట్‌ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ వలంటీర్ల సేవలు నిలిచిపోయేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. తన సన్నిహితుడు, మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ సంస్థ ద్వారా వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదు చేయించారు. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో నాలుగున్నరేళ్లకు­పైగా సజావుగా సాగిన ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది.

ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. కోవిడ్‌ సంక్షోభంలోనూ ఆగని పింఛన్ల పంపిణీ చంద్రబాబు కారణంగా నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తన రివర్స్‌ డ్రామా మొదలెట్టారు. వలంటీర్ల సేవలను తానే అడ్డుకుని.. మళ్లీ ఇంటింటికీ పింఛన్లు పంచాలంటూ ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికి దొంగ లేఖలు రాస్తూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. యూటర్న్‌ తీసుకోవడంలో చంద్రబాబుకు ఏమాత్రం మొహమాటాలు ఉండవని అనేకసార్లు రుజువైంది. వాటిల్లో కొన్ని మచ్చుతునకలు ఇవే..! 

♦  2019 సెప్టెంబర్‌ 27: టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు వలంటీర్లను అత్యంత దారుణంగా కించపరిస్తూ వ్యాఖ్యలు ­చేశారు. ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5 వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది..? గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం డిస్ట్రబ్‌ చేయడం. డే టైం మగవాళ్లు ఉండరు.. వీళ్లు (వలంటీర్లు)పోయి తలుపులు కొట్టడం... ఎంత నీచం...’ అంటూ వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కారు. 

2021, అక్టోబర్‌ 30న కుప్పం రోడ్‌షోలోనూ చంద్రబాబు వలంటీర్లనే టార్గెట్‌ చేశారు. ‘ఊర్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్‌ అయ్యారు. బ్రిటీష్‌ వాళ్లకు ఏజెంట్లులా వీరు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ అవినీతికి పాల్పడు­తున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ అంటూ వలంటీర్ల సేవలను నిలిపివేసేలా కుట్రలకు అప్పుడే బీజం వేశారు. ఉత్తమ వలంటీర్లను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే కూడా ఓర్వలేక­పోయారు. 2022 ఏప్రిల్‌ 07న ‘వలంటీర్లు సాధించింది ఏంటి? సన్మానం పేరుతో కోట్లు తగలేస్తున్నారు’ అంటూ పెత్తందారీ కుళ్లును వెళ్లగక్కారు. 

టీడీపీ మహిళా నాయకులు వలంటీర్లను ఇష్టానుసారంగా తూలనాడారు. 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ వివరాలు కనుక్కొంటున్నారు. మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్ల కేంటి సంబంధం’ అంటూ నోటికొచ్చిన అబద్ధా­లను ఆపాదించి పైశాచిక ఆనందాన్ని పొందారు.

సేవకులపై ఉన్మాదం..
వలంటీర్లను అవమానించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు అన్నీఇన్నీ కావు. 2023, అక్టోబర్‌ 7న వారాహి యాత్రలో భాగంగా ఏలూరు పాత బస్టాండ్‌ వద్ద నిర్వహించిన రోడ్‌ షోలో మహిళల అదృశ్యానికి వలంటీర్లే కారణం అంటూ హేయంగా మాట్లాడారు. ‘ వలంటీర్లు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో వలంటీర్లు కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తు­న్నారు. మహిళల అదృశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ అంటూ ఉన్మాదాన్ని ప్రదర్శించారు.

2023 జూలై 11న ఏలూరులో పార్టీ నాయకులతో సమావేశంలోనూ వలంటీర్లే అజెండాగా పవన్‌ బురద రాజకీయం చేశారు. ‘ప్రజాసేవ కోసం పంచాయతీరాజ్, రెవెన్యూతో పాటు కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, తహసీల్దార్లు ఉన్నప్పటికీ.. వలంటీర్లు అనే మరో సమాంతర వ్యవస్థ ఎందుకు? ప్రజలను నియంత్రించడం.. ఎవరైనా ఎదురు తిరిగితే భయపెట్టడానికి, సోషల్‌ మీడియాలో టీడీపీ వాళ్లు విమర్శిస్తే ఇబ్బందులు పెట్టడానికి వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారు. జనసైనికులు, నాయకులు వలంటీర్లపై ఓకన్నేసి ఉంచండి. ఆడబిడ్డలున్న తల్లిదండ్రులు, ఒంటరి, వితంతువులు అప్రమత్తంగా ఉండండి. వలంటీర్లకు సమాచారం ఇవ్వకండి’ అని వలంటీర్‌ వ్యవస్థను ఉగ్రవాద చర్యలతో పోల్చారు.

సినిమా డైలాగులతో రాజకీయ ప్రసంగాలు చేసే పవన్‌కళ్యాణ్‌ వలంటీర్ల నడుం విరగొట్టి తీరుతాం అంటూ 2023, జూలై 12న వారాహి రెండో విడత యాత్రలో ఊగిపోయారు. ‘వలంటీర్‌ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిందా? ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వారి వద్దే ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వల్ల సమాచారం దుర్వినియో­గమైతే నిలదీయవచ్చు. వలంటీర్‌ వ్యవస్థ తొండ ముదిరి ఊసరవెల్లిలా మారింది.

బ్రిటీష్‌ వాళ్లు మన దేశాన్ని ఆక్రమిస్తే ఆరు కోట్ల మందిని వలంటీర్లు నియంత్రిస్తున్నారు. సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లకు దాడి చేసే హక్కు ఉందా? వలంటీర్లు బాలి­కలపై అఘాయిత్యాలు చేస్తున్నారు’ అంటూ వ్యక్తి­త్వ హననానికి పాల్పడ్డారు. అదేరోజు తన ట్విట్టర్‌లోనూ ‘వలంటీర్లు జగన్‌ అధికారిక పెగా­సస్‌. ప్రభుత్వ నిధులను వలంటీర్ల కోసం దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ యాప్‌లో ప్రజల సమా­చారాన్ని తీసుకుని వారి భద్రతకు భంగం కలిగి­స్తున్నారు’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

బెదిరించి.. నాలుక మడత
2021 మార్చి 29న తిరుపతిలో టీడీపీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వలంటీర్ల కథ చూస్తామని బెదిరింపులకు దిగారు. ‘వలంటీర్ల వ్యవస్థ దండగ. వలంటీర్ల లోపాలను గుర్తించి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇస్తే వారి కథ చూసుకుంటాం. రూ.10వేల పారితోషికం ఇస్తాం’ అంటూ ప్రకటించారు. ఎల్లో మీడియాలో వలంటీర్లను దుర్మార్గు­లుగా చిత్రీకరిస్తూ కథనాలు వండి వర్చేశారు.

కానీ ప్రజల్లో వలంటీర్లపై, ప్రభుత్వంపై బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని చూసి చంద్రబాబు అండ్‌ కో కంగుతిన్నారు. వలంటీర్‌ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఉంటే.. ఆ ఇంటి సభ్యుల్లోని వ్యక్తే వలంటీర్‌గా సేవలందిస్తున్నారు.

నిత్యం తమ కళ్లముందు తిరిగే తమ బిడ్డలనే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు నోటికొచ్చినట్టు తూలనాడుతుంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇది గ్రహించిన బాబు అండ్‌కో తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని భావించి వలంటీర్ల సేవలు గొప్పవంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వలంటీర్‌ ఉద్యోగం దండగ అన్న చంద్రబాబే ఇప్పుడు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతా­మంటూ కపట హామీలు గుప్పిస్తు­న్నారు. వలంటీర్‌ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించిన పవన్‌కళ్యాణ్‌ వారి పొట్ట కొట్టాలని అనుకోవట్లేదని నాలిక మడతేశారు. 

ఇప్పుడు గుర్తొచ్చిందా?
చంద్రబాబు ఒక్క వలంటీర్‌ వ్యవస్థపైనే కాదు.. దానికి కీలకమైన, గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన సచివాలయ వ్యవస్థపైనా ముప్పేట దాడి చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఊడతాయంటూ గద్దించారు. అదే చంద్రబాబు ఇప్పుడు వలంటీర్లకు బదులు.. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. స్వత్రంత్ర భారతంలో ఇంటింటికీ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది.

పంచాయ తీరాజ్, రెవెన్యూ, కలెక్టర్లు వ్యవస్థలు దశాబ్దాలుగా పని చేస్తున్నా చిట్టచివరి వ్యక్తికి లబ్ధి చేకూర్చడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇది గమనించిన సీఎం జగన్‌ సచివాలయ వ్యవస్థతో పాటు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు నాలుగు లక్షల మంది యువతకు సొంత గ్రామాల్లోనే ప్రభుత్వ సేవకులుగా ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించారు. అందుకే సమర్థవంతంగా, అవినీతికి తావులేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 

ఆ దుస్థితిని తొలగించి..
వలంటీర్‌ వ్యవస్థ రాకమునుపు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అరకొర పింఛన్‌ తెచ్చుకునేవారు. ప్రభుత్వ పథకాలు వాల్‌పోస్టర్ల రూపంలో గోడలపై కనిపించేవి కానీ అర్హులైన లబ్ధిదారులకు అందేవి కాదు.

నాడు ప్రభుత్వ సాయం అందాలంటే జన్మభూమి కమిటీలను దేహీ అనాల్సిన దుస్థితి. సచివాలయాలు, వలంటీర్లు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలే పేదల ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటిది నాలుగున్నరేళ్ల తర్వాత వలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మళ్లీ మండుటెండల్లో రోడ్లపై నిలబడి పింఛన్‌ తీసుకోవాల్సి రావడం చంద్రబాబు దుర్మార్గ చర్యలకు ప్రతీకగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు

స్వతంత్ర సంస్థ ముసుగులో..
మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్వతంత్ర సంస్థ ముసుగులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నది స్పష్టమైంది. ‘సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ’ సంస్థ ముసుగులో కుహనా మేధావులతో టీడీపీకి అనుంగు సంస్థగా వ్యవహరిస్తూ వలంటీర్ల వ్యవస్థను అడ్డుకుని పేదలను పరోక్షంగా దెబ్బకొట్టారు. నిమ్మగడ్డ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25న వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రెండుసార్లు ఫిర్యాదు చేసింది.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదంటూ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యక్షంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన చంద్రబాబు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని, ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ పంచాల్సిందేనంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలోనూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో ఆయన కేసులు వేయించడంతోపాటు సెంటు స్థలం సమాధికి కూడా సరిపోదంటూ అనుచిత వ్యాఖ్యలతో తన పెత్తందారీ అహంకారాన్ని చాటుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement