Fact Check: ‘ప్రగతి’ రథంపై ‘పచ్చ’ బురద  | Sakshi
Sakshi News home page

Fact Check: ‘ప్రగతి’ రథంపై ‘పచ్చ’ బురద 

Published Mon, Apr 1 2024 4:22 AM

During Babu regime RTC was in debt month after month - Sakshi

బాబు హయాంలో నెలనెలా అప్పులే ఆర్టీ సీకి గతి 

డొక్కు బస్సులతో నిత్యం తిప్పలే 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలతో ఆర్టీ సీలో నవశకం 

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. కొత్త బస్సుల కొనుగోలు వేగవంతం.. ఇప్పటికే 1,406 కొత్త బస్సుల కొనుగోలు 

మరో 10,625 బస్సుల కొనుగోలుకు ఆమోదం 

బస్సుల నిర్వహణకు భారీగా నిధులు 

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం హయాంలో నెలనెలా అప్పులు చేస్తూ, డొక్కు బస్సులతో ముక్కుతూ మూలుగుతూ నడిచే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభివృద్ధి బాటలో నడిపించారు. ఉద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సిబ్బందికి మేలు చేయడమే కాకుండా, సంస్థపై పెను ఆర్థిక భారాన్ని తొలగించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలతో ఆర్టీసీ ఇప్పుడు కొత్త బస్సులతో కళకళలాడుతోంది. ఉద్యోగులందరూ నెలనెలా సక్రమంగా జీతాలు, అలవెన్సులు పొందుతూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఆర్టీసీ ఉద్యోగిని అడిగినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వారికి చేసిన మేలును వివరిస్తారు. కానీ, రామోజీ నేతృత్వంలోని పచ్చ మీడియా, పచ్చ పార్టీలకు కావాల్సింది ఇది కాదు.

ఆర్టీసీ ఉద్యోగులు, ఆ సంస్థ నిత్యం సమస్యలతో సతమతమవుతుంటే చూసి ఆనందించే బ్యాచ్‌ ఇది. సహజంగానే వారికి మంచి అనేది నచ్చదు కాబట్టి ఈనాడులో రామోజీ ఆర్టీసీపై ఓ కుట్రపూరిత బురద కథనాన్ని అచ్చే శారు. అవాస్తవాలు, అభూతకల్పనలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఆర్టీసీ సాధించిన ప్రగతి ఏమిటో ఓ సారి చూద్దాం..

1,406 కొత్త బస్సులు కొనుగోలు
దశాబ్దాలుగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు వేగవంతం చేసింది. 2019 – 20లో 406 బస్సులు కొనుగోలు చేసింది. పాత బస్సుల స్థానంలో 900 సరికొత్త డీజీల్‌ బస్సులను ప్రవేశపెట్టింది. అంతేకాదు రాష్ట్రంలో తొలిసారిగా ఇ–బస్సులను ప్రవేశపెట్టింది. తిరుమల – తిరుపతి ఘాట్‌రోడ్డుతో పాటు తిరుపతి సమీప పట్టణాల్లో విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే. రెండేళ్ల­పాటు కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2019 నుంచి 2023 మధ్య ఆర్టీసీ 1,406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది.

తాజాగా 1,500 కొత్త డీజిల్‌ బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. ఆర్డర్లు కూడా జారీ చేసింది. మరో 1,125 డీజిల్‌ బస్సుల కొనుగోలు చేయనుంది. మరో వేయి విద్యుత్‌ బస్సుల కొనుగోలుకు నిర్ణయించింది. 2024 – 25లో 950 విద్యుత్‌ బస్సులతోపాటు రానున్న ఐదేళ్లలో దశలవారీగా 7వేల విద్యుత్‌ బస్సుల కొనుగోలు ప్రణాళికను ఆర్టీసీ ఆమోదించింది. మరోవైపు కొత్త బస్సుల తయారీకి బిల్డింగ్‌ యూనిట్లు ప్రారంభించింది.

ఉన్నత ప్రమాణాలతో బస్సుల నిర్వహణ
బస్సుల సక్రమ నిర్వహణపై ఆర్టీసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15 ఏళ్లు పూర్తి చేసుకున్న 214 పాత బస్సులను తొలగించింది. మరోవైపు బస్సుల మెరుగైన నిర్వహణకు ఉన్నత ప్రమాణాలను పాటిస్తోంది. బస్సుల విడిభాగాల కొనుగోలు, ఇతర నిర్వహణ వ్యయం కోసం గత నాలుగేళ్లలో ఆర్టీసీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించింది. గత ఐదేళ్లలో నిర్వహణ నిధులిలా..

2020–21, 2021–22లో కోవిడ్‌ మొదటి, రెండో వేవ్‌లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను బాగా కుదించింది. దాంతో స్పేర్‌ పార్టుల కోసం బడ్జెట్‌ ప్రతి­పాదనలు తగ్గాయి. 2021–22, 2022–23, 2023–24లో పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధ­రించింది. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక నిర్వహణ వ్యయం కింద రూ.50 కోట్లు ఖర్చు చేసింది.

ఉద్యోగుల జీవితాల్లో నవోదయం
2019కి ముందు ఆర్టీసీ చరిత్ర మొత్తం జీతాల కోసం నెలనెలా అప్పులు చేయడమే అన్నట్టుగా ఉండేది. ఉద్యోగుల జీతాల కోసం నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.300 కోట్లు అప్పు చేస్తేనే చెల్లింపులు అన్నట్లుగా ఉండేది. ఆ అప్పుల మీద ఏడాదికి వడ్డీల భారమే దాదాపు రూ.350 కోట్లు. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్ధ దశ, దిశ మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నంబర్లు కేటాయించి

సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు 
నెలనెలా సక్రమంగా చెల్లిస్తోంది. ఇందుకోసం ఏడాదికి రూ.3,600 కోట్ల భారాన్ని మోస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆర్టీసీ రాబడి గణనీయంగా తగ్గినప్పటికీ, ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఎటువంటి లోటు రాలేదు. జీతాల భారం లేకపోవడంతో ఆర్టీసీ క్రమంగా నష్టాల ఊబి నుంచి బయటపడుతోంది. 2020 జనవరి నాటికి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులుండగా, ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండటంతో ఇప్పటికే ఆర్టీసీ రూ.2 వేల కోట్ల అప్పులు తీర్చేసింది.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న మరిన్ని ప్రయోజనాలు
♦ పీఎఫ్‌ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి.
♦    ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు రూ.200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు కొత్తగా రుణాలు పొందుతున్నారు.
♦  ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్‌ శాలరీ (ప్ర­మాద బీమా) ప్యాకేజీని మొదట రూ.45 లక్షలకు, ఆ తర్వాత ఏకంగా రూ.1.10 కోట్లకు ప్రభుత్వం పెంచడం విశేషం.
♦  ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది.
♦  2020 జనవరి తరువాత రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రూ.271.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
♦  ఏపీ గవర్నమెంట్‌ ఇన్సూ్యరెన్స్‌ స్కీమ్‌ ద్వారా 55 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న 44,500 మందికి  ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తింపజేశారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు.
♦    2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది.
♦    2020 జనవరి 1 తరువాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
♦  2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్‌ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు, 2020 జనవరి 1 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలిచ్చింది.
♦  ఉద్యోగుల డిమాండ్‌ మేరకు ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతుల విధానాన్ని ఆమోదించింది. ప్రభుత్వంలో విలీనానికి ముందు ఉన్న ఉద్యోగులకు ఆర్టీసీ సర్వీసు నిబంధనల ప్రకారం, ఆ తరువాత చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తారు.
♦  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం జీతంతోపాటే అలవెన్స్‌లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Advertisement
Advertisement