
దక్షిణాది నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే వేరని చెప్పవచ్చు. ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, తేడా వస్తే అంత రఫ్‌గానూ దులిపేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడే వరలక్ష్మీశరత్‌కుమార్ ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా కలిగిన నటి. ఈమె తాజాగా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన బహుభాషా చిత్రం శబరి ఇటీవలే తెరపైకి వచ్చింది. మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తన గురించి మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు.
అసలు తన గురించి నెగిటివ్‌గా మాట్లాడటానికి మీరెవరు? అని వరలక్ష్మి ప్రశ్నించారు. శరత్‌కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మీ శరత్‌కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మనస్పర్థల కారణంగా వరలక్ష్మీ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత శరత్‌కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.
అయితే ప్రస్తుతం శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ, రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసి మెలిసే ఉంటున్నాయి. ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్‌మెంట్ వేడుకలోనూ అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సంఘటన గురించి రక రకాల కామెంట్స్ దొర్లాయి. వీటిపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీరు కామెంట్స్ చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా? తను ఉన్నత స్థాయికి చేరారంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా? ఈజీగా కామెంట్స్ మాత్రం చేస్తారు అని ఫైరయ్యారు.
ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్ చేసేకంటే.. మీరెందుకు సాయం చేయకూడదు అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని అన్నారు. ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని.. షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు తాము సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటామని భావిస్తుంటారన్నారు.
కానీ నిజానికి అలాంటి పరిస్థితిలేదని ఆమె తెలిపారు. తాము నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు చెల్లించాలని.. అయితే తమకు మాత్రం నెలసరి జీతాలు ఉండవన్నారు. షూటింగ్ ఉంటేనే పారితోషిక ఉంటుందని.. ఒక్కోసారి నిర్మాత ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తి.. షూటింగ్ నిలిచిపోతే పారితోషికం ఆగిపోతుందన్నారు. తాము వెళ్లి అడిగే పరిస్థితి ఉండదన్నారు. అలా తమకు పారితోషికం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అన్నారు. కాబట్టి తమ పని అంత సులభం కాదని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment