డిజైన్‌ టెక్‌ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే | Sakshi
Sakshi News home page

డిజైన్‌ టెక్‌ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే

Published Tue, Apr 9 2024 5:26 AM

HC Judge Justice Ravi Cheemalapati key judgment by Design Tech - Sakshi

ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు ఆధారాలు ఉంటే జప్తు చేయొచ్చు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో డిజైన్‌ టెక్‌కు గట్టి ఎదురుదెబ్బ 

కుంభకోణం తీవ్రత, ప్రజాధనం దృష్ట్యా డిజైన్‌ టెక్‌ వాదనను ఆమోదించలేం

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి కీలక తీర్పు

అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ షోకాజ్‌ నోటీసులకు సమర్థన.. డిజైన్‌ టెక్‌ పిటిషన్‌ కొట్టివేత

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్‌ చట్టం కింద డిజైన్‌ టెక్‌కు అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది.

ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యు­డికేటింగ్‌ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ డిజైన్‌ టెక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్‌ టెక్‌కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కర­రావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీ­భ­వించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజా­ధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్‌ టెక్‌ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు.

ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది
‘మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో డిజైన్‌ టెక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్‌ ఆఫ్‌ క్రైం)­కి విస్తృత నిర్వచనం ఉంది.

సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్‌ ఆఫ్‌ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్‌ టెక్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యా­ల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.

డిజైన్‌ టెక్‌ వాదనలో ఏమాత్రం పస లేదు..
‘అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసు­లకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథ­మిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్‌ టెక్‌ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్‌ టెక్‌ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్‌ అథా­రిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్‌ టెక్‌ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్‌ టెక్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రా­యాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్‌ రవి తన తీర్పులో పేర్కొన్నారు.

స్కిల్‌ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికా­రు­లను సీమెన్స్, డిజైన్‌ టెక్‌ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజా­ధనం దారి మళ్లడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరె­క్ట­రేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్‌ టెక్‌ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్కిల్‌ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది.

ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్‌ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ.. డిజైన్‌ టెక్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్‌ టెక్‌ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ షోకాజ్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ డిజైన్‌ టెక్‌ చైర్మన్‌ కమ్‌ ఎండీ వికాస్‌ వినయ్‌ ఖాన్వీల్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈడీది రెండో జప్తు అవుతుంది..
డిజైన్‌ టెక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ జోస్యుల భాస్కరరావు వాద­నలు వినిపించారు. డిజైన్‌ టెక్‌ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినా­రా­యణరావు  చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వ­హ­ణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగ­దును ఫిక్స్‌­డ్‌ డిపాజిట్లుగా మార్చాలని ఆదే­శించింద­న్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్‌డ్‌ డిపా­జిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును విని­యో­గించుకునేందుకు హైకోర్టు తమకు అను­మతి­ని­చ్చిందని ఆదినారాయణ­రావు తెలి­పా­రు.

సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయ­డం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్త­ర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమ­న్నారు. తాము అడ్జ్యుడి­కేటింగ్‌ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతా­­దారుల నుంచి సివిల్, క్రిమినల్‌ కేసు­లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు.

సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు
డిజైన్‌టెక్‌ వాదనలను ఈడీ తరఫు న్యాయ­వాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్‌ అథా­రిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్‌ టెక్‌కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్‌ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూ­పించుకోవాల్సిన బాధ్యత డిజైన్‌ టెక్‌పైనే ఉందన్నారు.

షోకాజ్‌ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసు­కోవా­ల్సింది అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీయే­న­­న్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్‌ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్‌ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్‌ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు.

Advertisement
Advertisement