ప్రశాంత ఎన్నికలే లక్ష్యం | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

Published Sun, May 12 2024 5:21 AM

Peaceful elections are the goal

హింసాత్మక సంఘటనలు జరగకుండా 295 కంపెనీల బలగాలతో పహారా 

పోలింగ్‌ ముగిసేవరకు రాష్ట్రంలో అమల్లోకి 144వ సెక్షన్‌.. అయిదుగురికి మించి గుమికూడరాదు  

భారీగా డూప్లికేట్, డెట్‌ ఓట్ల తొలగింపుతో ఈసారీ ఓటింగ్‌ 83 శాతానికి చేరవచ్చు 

ప్రతి పోలింగ్‌స్టేషన్‌లో మహిళలు, వృద్ధులు/దివ్యాంగులు, పురుషులకు ప్రత్యేక లైన్లు  

పెద్దవారికి సాయంచేసే సహాయకులకు ఒకరికి ఒకసారే అనుమతి  

పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు  

ఆరు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్నిచోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 11 గంటలపాటు పోలింగ్‌ 

అనుమతి పొందిన పత్రికా ప్రకటనలు తప్ప ఎటువంటి ప్రచారానికి అనుమతి లేదు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్  కుమార్‌ మీనా 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా చెప్పారు. ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా 1,06,145 మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసి, మే 13న ఓటింగ్‌ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఆయన శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో 197 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల కోసం వినియోగిస్తే ఈ ఎన్నికల్లో 295 కంపెనీలకు చెందిన 26,550 మంది సాయుధుల్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనకుండా పురుషులు, మహిళలు, వృద్ధులు/దివ్యాంగులకు మూడు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులతో నియంత్రించనున్నట్లు చెప్పారు.

 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్‌ నమోదు కాగా ఈసారి 82 నుంచి 83 శాతం పోలింగ్‌ నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారీస్థాయిలో డూప్లికేట్‌ ఓట్లు, చనిపోయినవారి ఓట్లు తొలగించడంతో పాటు కొత్తగా తొలిసారి ఓటువేస్తున్న వారు పదిలక్షల మందికిపైగా ఉండటంతో పోలింగ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్‌ స్టేషన్‌కు 200 మీటర్ల వరకు ఓటరుకు తప్ప మిగిలిన వారికి ప్రవేశంఉండదని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయడానికి సహకరించడానికి ఒక సహాయకుడిని ఒకసారి మాత్రమే అనుమతిస్తామన్నారు.  

11 గంటల పాటు పోలింగ్‌ 
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో.. ఆరు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్నిచోట్ల ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు అంటే 11 గంటలపాటు ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు తెలిపారు. అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నక్సలైట్ల ప్రభావం ఉన్న పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదుగంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగుగంటల వరకు ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు వివరించారు. 

పోలింగ్‌ సిబ్బంది ఆదివారం సాయంత్రానికే పోలింగ్‌ స్టేషన్లకు చేరుకోవాలని చెప్పారు. సోమవారం ఉదయం ఐదుగంటల నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు చేసి ఏడుగంటలకు ఓటింగ్‌ ప్రారంభించాలని పేర్కొన్నారు. ఏజెంట్ల సమక్షంలో 90 నిమిషాలు మాక్‌ పోలింగ్‌ నిర్వహించి సీల్‌వేసిన అనంతరం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ముగ్గురు ఏజెంట్లకు అనుమతి ఇస్తామని, కానీ పోలింగ్‌ స్టేషన్‌లోకి ఒక ఏజెంటుకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. 

పోలింగ్‌ స్టేషన్‌లోకి సెల్‌ఫోన్లు, మారణాయుధాలు అనుమతించరని తెలిపారు. సెల్‌ఫోన్లు తీసుకొస్తే వాటిని బయటే వదిలి లోపలికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.269 కోట్ల విలువైన నగదు, వస్తువులను సీజ్‌చేసినట్లు తెలిపారు. దీన్లో నగదు రూ.71 కోట్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. 

అమల్లోకి 144వ సెక్షన్‌
శనివారం సాయంత్రం ఆరుగంటల నుంచి సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాష్ట్రంలో సైలెంట్‌ పీరియడ్‌ కొనసాగుతుందని, ఈ సమయంలో రాష్ట్రంలో 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. 

అయిదుగురి కంటే ఎక్కువమంది గుమికూడరాదని, ఎటువంటి రాజకీయ ప్రచారాలు, ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు. కానీ రాజకీయ పార్టీ లు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందిన ప్రకటనలు పత్రికల్లో ఇవ్వడానికి అనుమతిస్తామన్నారు. ఇకనుంచి ఒపీనియన్‌ పోల్స్, ఎగ్జిట్‌ పోల్స్‌ జూన్‌ 1న చివరిదశ ఎన్నికలు ముగిసేవరకు ప్రచారం చేయకూడదని చెప్పారు

Advertisement
 
Advertisement
 
Advertisement