నిర్ణయాలు, పాలసీలతోనే మళ్లీ జోరు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఇక, రియల్టీ పరుగులే తరువాయి. కాకపోతే, హైదరాబాద్ మార్కెట్ పరిస్థితులు వేరు. రాజకీయ స్థిరత్వం అనేది వినియోగదారులు, పెట్టుబడిదారులకు కీలకం. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు విశ్వాసాన్ని చూరగొనాలంటే వేగవంతంగా విధానపరమైన నిర్ణయాలతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడి, క్రయవిక్రయాలు పెరుగుతాయి.
మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్బుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.
హైదరాబాద్‌లోని భౌగోళిక వాతావరణం, వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ, విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌కు ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్‌లో గృహాల ధరలు, అద్దెలు, భూముల రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం వంటివి నగరానికి అదనపు అంశాలు. దీంతో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏమాత్రం అలసత్వం ఉండదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు ఢోకా ఉండదు.
మార్కెట్‌లోకి మూడోతరం..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని నివాసితుల రెండు, మూడోతరం వారసులు కూడా సిటీకి వస్తున్నారు. వీరికి ఆయా ప్రాంతాల్లో లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్‌లు దొరకడం కష్టం. దీంతో హైరైజ్, అల్ట్రాలగ్జరీ అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితి. అలాగే విదేశాల్లో స్థిరపడిపోయిన ప్రవాసులు తిరిగి స్థానిక ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్‌లోకి కొత్తతరం కస్టమర్లు వస్తున్నారు. వీరికి విదేశాల్లో తరహా ఆధునిక వసతులు, విస్తీర్ణమైన అపార్ట్‌మెంట్లు కావాలి. అందుకే చాలామంది గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు.
కొందరు ఎన్నారైలు ఇప్పటికే స్థానికంగా ఉన్న స్థిరాస్తులను విక్రయించి, లగ్జరీ ప్రాపర్టీలకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. అలాగే ఇన్నాళ్లు భార్యా, భర్తలిద్దరి సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఇప్పుడు వారి పిల్లల సంపాదన కూడా తోడైంది. గత 3–4 ఏళ్లుగా ఈ మూడోతరం సంపాదనతో నగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పక్క రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొత్తగా స్థలాలు కొనే వారి కంటే ఉన్న భూమిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో నగరంలో ప్రాపర్టీ కొనేందుకే ఆసక్తి చూపిస్తారని దీంతో ప్రాపర్టీలకు మరింత డిమాండ్ ఉంటుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment