కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్రగౌడ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరైస్టెన దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం.
అయితే రేణుకాస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని, దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్ మహజర్ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్ చేశారు. రఘు దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు.
నగదు సీజ్
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్‌కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్ చేసి నగదు సీజ్ చేశారు.
అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామి
రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్ డ్రైవర్. టొయోటా ఈటీఎస్ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు.
చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్‌లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్‌లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్ చేయగా రేణుకాస్వామే బిల్ చెల్లించాడు. బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్‌గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment